అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో విమర్శలు మొదలయ్యాయి. అసలు నిర్మాణమే లేకపోతే పునర్నిర్మాణం ఎక్కడిదంటూ నేతలు ట్రోల్ చేస్తున్నారు. అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం క్రెడిట్ రాకూడదనేది వైసీపీ ప్లాన్. అయితే ఇక్కడ కేంద్రం నుంచి సాయం వస్తుందా, వచ్చిందా, రాబోతుందా అనే విషయాన్ని వైసీపీ నేతలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. తమ హయాంలో అమరావతికి ఏం చేశామనేది అస్సలు చెప్పుకోలేకపోతున్నారు. ఇక పదే పదే సీఎం చంద్రబాబుని విమర్శిస్తున్నారే కానీ, ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి కూడా సాససించడం లేదు. ఈ విషయంలో జగన్ డైరక్షన్ ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అటు జగన్ కూడా మోదీ పేరెత్తడానికి భయపడుతున్నట్టు అర్థమవుతోంది.
అమరావతి పేరెత్తని జగన్..?
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జగన్ కి ఆహ్వానం అందినా వెళ్లలేదు. ప్రతిపక్ష నేత హోదా అడుగుతారే కానీ, ఆ హోదాకి తగ్గట్టుగా కనీసం ఏమీ చేయలేరని అర్థమైంది. జగన్ లేకుండానే ఆ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు, కార్యక్రమం సక్సెస్ అని పేరొచ్చింది. రాష్ట్రానికి సంబంధించి అంత ఇంపార్టెంట్ కార్యక్రమం జరిగితే కనీసం దానిపై జగన్ స్పందించరా..? పోనీ జగన్ పూర్తి సైలెంట్ గా ఉన్నారా అంటే.. రైతు కష్టాలపై తాజాగా ఓ సుదీర్ఘ ట్వీట్ వేశారు. రైతుల కష్టాలపై స్పందించొద్దని ఎవరూ అనరు కానీ, అమరావతి విషయంలో ఎందుకంత ఇగ్నోరెన్స్. ఆ పేరెత్తడానికి కూడా ఆయన ఎందుకు ఇష్టపడటం లేదు. అమరావతి పేరెత్తితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ పేరెత్తాల్సి వస్తుందనేది జగన్ భయం అని తెలుస్తోంది. మోదీ పేరు ప్రస్తావించాలంటే అమరావతికి కేంద్రం తరపున ఆయన ఎలాంటి సాయం చేశారు, చేయబోతున్నారు అనేది చర్చించాలి. ఈ ఇబ్బంది ఎందుకనుకున్నారేమో అమరావతిపై రెచ్చిపోయే అవకాశం తన పార్టీ నేతలకు అప్పగించారు.
అంబటి ఆవేశం..
అమరావతి నిర్మాణంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో పోలవరం గురించి చెప్పినట్టే ఇప్పుడు అమరావతి గురించి కూడా తీసిపారేసినట్టు మాట్లాడారు అంబటి. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని అన్నారు అంబటి. అది అసాధ్యం అని తేల్చి చెప్పారు. అమరావతికి జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సెలవిచ్చిన ఆయన.. కూటమి నేతలు అనుకున్నట్టుగా అంతర్జాతీయస్థాయిలో రాజధాని నిర్మాణం చేపట్టలేరని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అప్పులు తేవద్దని, కేంద్రం ఉచితంగా ఇచ్చే నిధులు తేవాలని చంద్రబాబుకి ఉచిత సలహాలిచ్చారు. మరి ఇదే అంబటి.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కి ఆ సలహాలివ్వచ్చు కదా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ, కేంద్రాన్ని చంద్రబాబు సాయం అడగాలంటున్న అంబటి, కేంద్రం అసలు ఏమాత్రం సాయం చేసిందో చెప్పలేకపోయారు. తాము ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి గురించి ఎందుకు పట్టించుకోలేదో వివరించలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ రావడంతో అమరావతికి ఊపొచ్చింది. జగనే తిరిగి ముఖ్యమంత్రి అయి ఉంటే అమరావతి చరిత్రలో కలసిపోయేది, కలిపేసేవారు కూడా అనే టాక్ వినపడుతోంది.
శైలజానాథ్ సెటైర్లు..
ఇక అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం గురించి తాజాగా వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శైలజానాథ్ సెటైర్లు పేల్చారు. అసలు అమరావతి నిర్మాణమే జరక్కుండా పునర్నిర్మాణం ఎక్కడిదని ఆయన నిలదీశారు. ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా ఏపీలో భాగమేనన్నారు. ఇలా మూడుముక్కలాట ఆడినందుకే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. కనీసం జగన్ కి ప్రతిపక్ష నేత హోదా కూడా రాకుండా చేశారు. ఇంకా రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటూ కాలం సాగదీస్తే వైసీపీని ఎవరూ నమ్మని పరిస్థితి వస్తుందని నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు.
మోదీ కనపడ్డం లేదా..?
అమరావతి పునర్నిర్మాణ సభలో కేవలం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ మాత్రమే పాల్గొన్నట్టుగా వైసీపీ నేతలు, ఆ పార్టీ మీడియా రియాక్ట్ అవుతున్నాయి. అక్కడకు ప్రధాని మోదీ వచ్చారు. అమరావతి నిర్మాణ పనుల్ని మెచ్చుకున్నారు, చంద్రబాబుకి కితాబిచ్చారు. ఇవన్నీ వారికి కనపడలేదు, వినపడలేదు. ఒకవేళ వినపడినా.. మోదీ పేరెత్తితే, పొరపాటున విమర్శిస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీకి బాగా తెలుసు. జగన్ కి ఇంకా బాగా తెలుసు. అందుకే మోదీ పేరెత్తకుండా అమరావతిని విమర్శించడానికి, చంద్రబాబుని ఎగతాళి చేయడానికి వైసీపీ నేతలు రెడీ అయిపోయారని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.