Amaravati: ఎట్టకేలకు ఏపీ జెడ్పీ పీఠాల పదవుల పంపకాలు పూర్తి అయ్యాయి. శుక్రవారం నాడు జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు ఎంపిక, పదవీ శ్రీకారం జరగనుంది. అందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జెడ్పీ పీఠాల పదవుల విషయంలో ‘బిగ్ టీవీ’ మొదటి నుంచి చెప్పినట్టుగానే జరిగింది.
ఏపీలో జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవుల పంపకాలు పూర్తి అయ్యాయి. ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రెండు రోజులుగా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. చివరకు సుదీర్ఘ చర్చల తర్వాత ఏ పార్టీకి ఎక్కడ కేటాయించాలనే విషయమై ఓ నిర్ణయానికి రావడంతో ఓ పనైపోయింది. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్మన్-వైస్ ఛైర్మన్ల పీఠాలపై పార్టీల వారీగా ఖరారు చేస్తూ టీడీపీ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయంలో బిగ్ టీవీ వెబ్ సైట్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. టీడీపీ కచ్చితంగా 22 జడ్పీ ఛైర్మన్లు తీసుకుంటుందని తొలి నుంచి చెబుతూ వచ్చింది, చివరకు అదే నిజమైంది. జనసేన- 4 జిల్లా పరిషత్ ఛైర్మన్లు, 5 వైస్ ఛైర్మన్ల
పదవులను దక్కించుకుంది. బీజేపీ ఓ జడ్పీ ఛైర్మన్, 2 వైస్ ఛైర్మన్లు కేటాయించినట్టు ఆ ప్రకటనలో ప్రస్తావించింది.
ఇటీవల ఏపీలో జరిగిన జిల్లా పరిషత్ పరిషత్ ఎన్నికల్లో 28 జిల్లాలకు గాను 27 జిల్లాలు కూటమి ఖాతాలో పడ్డాయి. అందులో టీడీపీ-22, జనసేన- 4, బీజేపీ-ఓ జెడ్పీ ఛైర్మన్ పదవి ఓకే అయ్యింది. దీంతో జిల్లా పరిషత్ ఛైర్మన్- వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరగనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పోస్టులు వైసీపీ ఖాతాల్లోకి వెళ్లింది. మొదటి నుంచి చెబుతున్నట్టు గానే శ్రీసత్యసాయి జిల్లా జెడ్పీ పీఠం పరిటాల శ్రీరామ్‌కు దక్కింది. అలాగే విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్మన్ పీఠం మజ్జి సిరి సహస్ర సొంతం చేసుకుంది. ఏలూరు జెడ్పీ ఛైర్మన్ పదవి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యను వరించింది.
ALSO READ: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!
కడప జెడ్పీ పీఠంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బంధువులకు ఇవ్వాలని బీజేపీ భావించింది. అందుకుగాను కృష్ణా జిల్లా జెడ్పీ పీఠం వరించింది. వైస్ ఛైర్మన్ పదవులు రెండు ఒకటి ఎన్టీఆర్ జిల్లాకు కాగా, మరొకటి తిరుపతి సొంతం చేసుకుంది.
ఇక జనసేన విషయానికి వద్దాం. ఆ పార్టీ కోరినట్టుగానే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జెడ్పీ పీఠాలను కేటాయింపు జరిగింది. వైస్ ఛైర్మన్ పదవుల విషయంలో తూర్పుగోదావరి, కోనసీమ, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి జిల్లాలను దక్కించుకుంది. మిగతా జిల్లాల్లో టీడీపీ హైకమాండ్ యువకులకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పగ్గాలు అప్పగించింది. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే విజయనగరం జెడ్పీ పీఠం మజ్జి సరి సహస్రను వరించింది.
