Krishna Water: వాస్తవ అవసరాలకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అదనపు కృష్ణా జలాలను కేటాయించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) ఎదుట తేల్చిచెప్పింది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం సెక్షన్-3 కింద జరుగుతున్న విచారణలో భాగంగా, ఏపీ వాదనలకు తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్ రిజాయిండర్ (ప్రతివాదన) వినిపించారు. బుధవారం ట్రిబ్యూనల్ ముందు వాదించారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ (ఎన్ఎస్ఎల్సీ) కింద ఏపీ తన ఆయకట్టును నిబంధనలకు విరుద్ధంగా 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఎకరాలకు పెంచుకుందని తెలంగాణ ఆరోపించింది. అదే సమయంలో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 5.2 లక్షల ఎకరాలకు తగ్గించిందని పేర్కొంది. 1969 డిసెంబర్ మెమో ప్రకారం ఏపీ ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలకే పరిమితమని, దీనికి వాస్తవంగా కేవలం 19.68 టీఎంసీల నీరు సరిపోతుందని స్పష్టం చేసింది. ఏపీ అదనంగా చూపుతున్న 2.48 లక్షల ఎకరాలు కృష్ణా బేసిన్ వెలుపల ఉన్నాయని, ఆ భూములకు పోలవరం కుడి కాల్వ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను అందించుకోవచ్చని వాదించింది. సీసీడీఏ పరిధి వల్ల కమాండ్ ఏరియా తగ్గి మరో 12.87 టీఎంసీల నీటి అవసరం తగ్గిందని గుర్తుచేసింది. ఎన్ఎస్ఎల్ సీకి కృష్ణాజలాల కేటాయింపును వాస్తవ అవసరమైన 19.68టీఎంసీలకే పరిమితం చేయాలని కోరారు.
Also Read: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!
కర్నూలు-కడప కాలువకు కేటాయించిన 31.90 టీఎంసీలకు బదులు వాస్తవ అవసరం 7.71 టీఎంసీలేనని తెలంగాణ పేర్కొంది. తుంగభద్ర డ్యామ్ నుంచే ఈ నీరు అందుతున్నందున, శ్రీశైలం నుంచి ఏపీ అక్రమంగా నిర్మించుకున్న మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టులను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేసింది. బనకచర్ల ఎస్కేప్ ఛానల్‌ను కేవలం అత్యవసర పరిస్థితులకే పరిమితం చేయాలని కోరింది. అలాగే తుంగభద్ర లోలెవల్ కాల్వకు 29.50 టీఎంసీలకు బదులు 23.52 టీఎంసీలు, హైలెవల్ కాల్వ (స్టేజ్-1, 2)కు 32.50 టీఎంసీలకు బదులు 20.58 టీఎంసీలు మాత్రమే వాస్తవ అవసరమని ట్రిబ్యునల్‌కు తెలంగాణ స్పష్టం చేసింది.
సాగర్ కుడి కాల్వకు కేటాయించిన 140 టీఎంసీలకు బదులు వాస్తవ అవసరం 67.42 టీఎంసీలు (పంటలకు 65.96, ఆవిరి నష్టాలకు 1.46 టీఎంసీలు) మాత్రమేనని వైద్యనాథన్ వివరించారు. అసలైన 9.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ నీటిని సాగర్ రిజర్వాయర్ (25.63 టీఎంసీలు), సాగర్-పులిచింతల మధ్య లభ్యత (24.28 టీఎంసీలు), పులిచింతల దిగువ (17.51 టీఎంసీలు) నుంచి సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో 3.06 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గడం వల్ల 20.82 టీఎంసీలు ఆదా అవుతాయని, పెరిగిన ఆయకట్టుకు ‘వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ పథకం’ ద్వారా నీరివ్వచ్చని సూచించారు.
Also read: వందే భారత్ జర్నీ సోషల్ మీడియా స్టేటస్‌గా ఎందుకు మారుతోంది? సైకాలజీ చెప్పే క్రేజీ సంగతి ఇదే!