Car Prices Hike: కొత్త సంవత్సరం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ఆటో మోబైల్ కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటికే పలు కంపెనీలు ధరల పెంపు గురించి అధికారిక ప్రకటన చేశాయి. ఇన్ పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ధరలను పెంచాల్సి వస్తుందని వెల్లడించాయి. ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. మోడల్, వేరియంట్ ఆధారంగా ధరల పెంపు ఉంటుందని తెలిపారు.
ఇండియాలో ధరల పెంపు గురించి తొలుత ప్రకటన చేసిన కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఇండియా. తమ కార్లు, SUVల ధరల పెంచనున్నట్లు తెలిపింది. ఈ ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమలు అవుతుందని తెలిపింది. ఈ పెంపు 2 శాతం వరకు ఉంటుందని ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు యూరో-ఇండియన్ రూపాయి మారకం రేటు నిరంతరం మారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
JSW MG మోటార్ ఇండియా తన కార్లకు సంబంధించి 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. సవరించిన ధరలు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు మారుతూ ఉంటుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ఇతర ఫైనాన్షియల్ కారణాలు ఈ పెరుగుదలకు కారణమని కంపెనీ తెలిపింది. ఇటీవల ప్రారంభించిన హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కు కూడా ధరల పెంపు ఉంటుందని తెలిపింది. .
జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చేలా నిస్సాన్ తన కార్లకు 3 శాతం వరకు ధరల పెంపును అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మాగ్నైట్, ఎక్స్ ట్రైల్ లను అమ్ముతోంది. 2026 నాటికి, రెనాల్ట్ ట్రైబర్ బేస్ డ్ గ్రావైట్ కాంపాక్ట్ MPV మార్చి 2026 నాటికి షోరూమ్‌లలోకి వస్తుందని నిస్సాన్ తెలిపింది.
BYD ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ సీలియన్ 7 ధరల పెంపును ప్రకటించింది. సవరించిన ధరలు జనవరి 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి. డిసెంబర్ 31న లేదంటే అంతకు ముందు బుకింగ్‌లు చేసే కస్టమర్‌లు ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధరలకే ఎలక్ట్రిక్ SUVని పొందే అవకాశం ఉంది.
BMW ఇండియా ఇప్పటికే సెప్టెంబర్ 1, 2025 నుండి 3 శాతం వరకు ధరల పెంపును అమలు చేసింది. జనవరి 1, 2026 నుంచి మరో పెంపును ప్లాన్ చేస్తోంది. పెరుగుతున్న మెటీరియల్, లాజిస్టిక్స్ ఖర్చులు, ఇండియన్ రూపీ వ్యాల్యూ తగ్గిన నేపథ్యంలో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని ప్రకటించింది. స్థానికంగా అసెంబుల్ చేయబడిన, దిగుమతి చేసుకున్న మోడళ్లతో సహా BMW లైనప్ అంతటా ఈ పెంపుదల వర్తిస్తుంది.
అటు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి పెద్ద కంపెనీలు ఇంకా ధరల పెంపు గురించి ప్రకటన చేయలేదు. డిసెంబర్ 2025లోపు బుక్ చేస్తే పాత ధరలతోనే కారు డెలివరీ పొందవచ్చు. ఈ ధరల పెంపు సాధారణంగా 2-3% మధ్యలో ఉంటుంది. మోడల్ ఆధారంగా మారుతుంది.
Read Also: సరికొత్తగా రెనాల్ట్ డస్టర్ రీఎంట్రీ, లాంచింగ్ ఎప్పుడంటే?