జూన్ 2026 ఆటో మొబైల్ రంగానికి ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ నెలలో పలు అద్భుతమైన మోడల్స్ విడుదల కాబోతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, హోండా, స్కోడా, టాటా మోటార్స్, బీవైడీ లాంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. లగ్జరీ సెడాన్ల నుంచి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల వరకు పలు విభాగాల్లో కొత్త వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. ఇంతకీ ఈ నెలలో విడుదలయ్యే కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
⦿ మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్
జూన్ 15న ఈ ఫ్లాగ్ షిప్ సెడాన్ భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇందులో తొలిసారిగా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపి 435 హెచ్‌పీ పవర్ ను ఉత్పత్తి చేయగలదు. ఆధునిక టెక్నాలజీ, కొత్త డిజైన్, పెద్ద డిజిటల్ స్క్రీన్లతో ఈ కారు మరింత ఆకర్షణీయంగా మారింది.
బీఎండబ్ల్యూ X6 M60i కూపే ఎస్‌యూవీని తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ తో వచ్చే ఈ ఎస్ యూవీ 523 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్పోర్టీ డిజైన్, పెద్ద అల్లాయ్ వీల్స్, లగ్జరీ ఇంటీరియర్ ఈ మోడల్ ప్రత్యేకతలు.
హోండా నుంచి రానున్న ZR-V ఎస్‌యూవీ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ వాహనాన్ని ప్రదర్శించగా, జూన్ లో ధరలను ప్రకటించనుంది. 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ 184 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. అధునాతన భద్రతా ఫీచర్లు, పెద్ద టచ్ స్క్రీన్, బోస్ ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇది దేశంలో స్కోడా నుంచి వచ్చే తొలి RS బ్యాడ్జ్ ఎస్‌యూవీగా నిలవనుంది. సాధారణ కోడియాక్ తో పోలిస్తే ఎక్కువ పవర్, స్పోర్టీ డిజైన్, ప్రత్యేక ఇంటీరియర్‌ను అందించనుంది.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియెర్రా EV కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రావొచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE 6, మారుతి ఈ-విటారా లాంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
బీవైడీ కూడా భారత మార్కెట్లో తన ఫస్ట్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఏ మోడల్ ను విడుదల చేస్తుందో ఇంకా ప్రకటించకపోయినా.. అట్టో 2, సీలియన్ 6 మోడళ్లలో ఒకటి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వాహనాలు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు బ్యాటరీ సపోర్ట్ తో 900 నుంచి 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Read Also: ఇండియన్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మోడల్ ఫిక్స్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!