Suzuki Ignis EV Unveiled: ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి (Suzuki) కొత్త ఎలక్ట్రిక్ కారును అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. గతంలో ఇగ్నిస్ (Ignis) పేరుతో అమ్మకాలు కొనసాగించిన కారును ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో పరిచయం చేస్తోంది. 2025 జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన విజన్ ఇ-స్కై (Vision e Sky) కాన్సెప్ట్ ఆధారంగా ఈ కొత్త EVని అభివృద్ధి చేసింది. జపాన్‌లో నవంబర్ 16న దీనిని ఇ-స్కై (e Sky) పేరుతో విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ఇగ్నిస్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. 2027 సమ్మర్ నుంచి యూరప్‌తో పాటు ఇతర మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. అయితే, భారత్ లో ఈ కారు విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కొత్త సుజుకి ఇగ్నిస్ EVలో 26kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 310 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ఫ్రంట్ వీల్స్ కు పవర్ ను అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ 91hp పవర్, 133Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు 25 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 3kW AC ఛార్జర్‌తో 8 గంటలు, 6kW AC ఛార్జర్‌తో 4.5 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
ఇగ్నిస్ EV స్పెషల్ బాక్సీ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ప్రత్యేకమైన LED DRLలు, బ్లాక్ కలర్ క్లోజ్డ్ గ్రిల్ ఉన్నాయి. బంపర్ కు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్ లో 15 అంగుళాల బ్లాక్ రిమ్స్, వీల్ ఆర్చ్ ల చుట్టూ బ్లాక్ క్లాడింగ్ కనిపిస్తాయి. వెనుక భాగంలో కూడా LED టెయిల్ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, వెనుక వైపర్, వాషర్ ఉన్నాయి. ఈ ఈ కారు పొడవు 3,570 మి.మీ, వెడల్పు 1,565 మి.మీ, ఎత్తు 1,635 మి.మీగా ఉంది. వీల్‌బేస్ 2,460 మి.మీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 150 మి.మీగా ఉంది.
కారు లోపలి భాగంలో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి. మూడు స్పోక్‌ల స్టీరింగ్ వీల్‌తో పాటు ఫిజికల్ బటన్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అందించారు. సెంటర్ కన్సోల్‌లో 45W ఛార్జింగ్ పోర్టులు, స్టోరేజ్ స్పేస్ కూడా ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, వెహికల్ టు లోడ్ (V2L) సపోర్ట్ లాంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
కొత్త ఇగ్నిస్ EV భారత్ లో విడుదలవుతుందా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ మారుతి సుజుకి భారత్‌కు తీసుకొస్తే, ఇక్కడ కొత్త పేరుతో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఇగ్నిస్ పేరుతో తీసుకొచ్చిన పెట్రోల్ మోడల్ కు తగిన ఆదరణ లభించకపోవడంతో 2026 ఏప్రిల్‌లో నిలిపివేశారు.
Read Also: టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త లుక్‌లో వచ్చేసింది.. ధర ఎంతంటే?