Suzuki Access 125 2026: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో సుజుకి యాక్సెస్ 125 ఒకటి. ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా మంచి మైలేజ్, కంఫర్ట్ రైడింగ్‌ను అందిస్తుండటంతో ఈ స్కూటర్‌కు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సుజుకి సంస్థ యాక్సెస్ 125 వేరియంట్లు, కలర్స్ విషయంలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో భాగంగా గతంలో అందుబాటులో ఉన్న టాప్ వేరియంట్ రైడ్ కనెక్ట్ TFTను డిస్ కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా రెండు కొత్త కలర్స్ ను పరిచయం చేసింది.
గతంలో సుజుకి యాక్సెస్ 125 మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండేది. స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ ABS, రైడ్ కనెక్ట్ TFT, రైడ్ కనెక్ట్ TFT ABS పేర్లతో వీటిని అమ్మారు. అయితే, తాజాగా రైడ్ కనెక్ట్ TFT వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కూటర్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్ల ధరలు ఎలా ఉన్నాయంటే.. స్టాండర్డ్ – రూ.83,086, స్పెషల్ ఎడిషన్ – రూ.89,428, రైడ్ కనెక్ట్ – రూ.91,627, రైడ్ కనెక్ట్ ABS – రూ.98,432, రైడ్ కనెక్ట్ TFT ABS – సుమారు రూ.1.04 లక్షలుగా ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో TFT డిస్‌ప్లే లాంటి అదనపు ఫీచర్లు ఉండటం వల్ల దాని ధర ఎక్కువగా ఉంది. మేకింగ్ ఖర్చును దృష్టిలో ఉంచుకుని సుజుకి ఈ ఫీచర్‌ను ఖరీదైన వేరియంట్‌కే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వేరియంట్లలో మార్పులతో పాటు యాక్సెస్ 125కు రెండు కొత్త రంగులను కూడా యాడ్ చేసింది. వాటిలో ఒకటి మెటాలిక్ రాయల్ బ్రాంజ్, రెండోది మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్. వీటిలో మెటాలిక్ రాయల్ బ్రాంజ్ కలర్ టాప్ 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్ మాత్రం టాప్ వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేశారు. అటు స్టాండర్డ్ వేరియంట్‌లో గతంలో ఉన్న బ్లాక్, బ్లూ కలర్స్ తో పాటు కొత్తగా గ్రీన్ కలర్ ను కూడా అందిస్తున్నారు. రైడ్ కనెక్ట్, రైడ్ కనెక్ట్ TFT ABS వేరియంట్లకు ఆక్వా బ్లూ కలర్ ను యాడ్ చేశారు. మరోవైపు గతంలో అందుబాటులో ఉన్న పెర్ల్ షైనీ బేజ్ కలర్ ను తొలగించినట్లు తెలుస్తోంది.
ఈ ఛేంజెస్ కేవలం వేరియంట్లు, రంగులకే పరిమితమయ్యాయి. స్కూటర్ ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 125cc ఇంజిన్, ముందు 12 అంగుళాలు, వెనుక 10 అంగుళాల వీల్స్ ఉన్నాయి. అలాగే సీటు కింద 24.4 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది. కొత్త కలర్స్ తో సుజుకి యాక్సెస్ 125 మరింత ఆకట్టుకునేలా మారింది. అయితే, టాప్ వేరియంట్ నిలిపివేతపై కంపెనీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
Read Also: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?