VinFast VF5 India Launch: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ SUVని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. అదే విన్‌ఫాస్ట్ VF5. ఈ కారు భారత మార్కెట్లోకి వస్తే కంపెనీకి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల ఈ మోడల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అంతర్జాతీయంగా ఆవిష్కరించారు. కొత్త డిజైన్, పెద్ద బ్యాటరీ, మెరుగైన ఫీచర్లతో వచ్చిన ఈ SUV ప్రత్యేకతలను తెలుసుకుందాం..
విన్‌ఫాస్ట్ ప్రస్తుతం ఇండియాలో VF6, VF7, VF MPV 7, లిమో గ్రీన్ లాంటి నాలుగు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అమ్ముతోంది. 2026 జనవరి 1 నుంచి నవంబర్ 9 వరకు 15,867 యూనిట్లను అమ్మి.. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో నాలుగో స్థానంలో నిలిచింది. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు VF5 SUVని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్ EV, కియా సైరోస్ EV, మహీంద్రా XUV 3XO EV వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
2026 విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్ లో డిజైన్ పరంగా పలు మార్పులు చేశారు. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త కారు 20 మి.మీ పొడవు, 49 మి.మీ వెడల్పు, 16 మి.మీ ఎత్తు పెరిగింది. దీని పొడవు 3,987 మి.మీ, వెడల్పు 1,772 మి.మీ, ఎత్తు 1,595 మి.మీగా ఉంది. ముందు భాగంలో కొత్త సన్నని ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంపులు, రీడిజైన్ చేసిన బంపర్, క్రోమ్ ఆకట్టుకునేలా ఉంది. వెనుకవైపు కనెక్టెడ్ LED లైట్ బార్, కొత్త టెయిల్ లైట్ డిజైన్, స్పోర్టియర్ బంపర్ అందించారు. కొత్త 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
ఇంటీరియర్‌లోనూ కంపెనీ కీలక మార్పులు చేసింది. పాత 8 అంగుళాల టచ్‌స్క్రీన్ స్థానంలో కొత్తగా 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇచ్చింది. కొత్త డ్యాష్ బోర్డ్, రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్, అదనపు స్టోరేజ్ తో కూడిన సెంటర్ కన్సోల్ ఉన్నాయి. బ్లాక్, క్రీమ్ కలర్ లెదరెట్ సీట్లు క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
ఈ SUVలో 43kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనికి ఎలక్ట్రిక్ మోటార్ 99bhp పవర్, 135Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 6.6kW AC ఛార్జింగ్, 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also: హ్యుందాయ్ కస్టమర్లకు షాక్.. మరోసారి పెరగనున్న కార్ల ధరలు!