Simple Energy EV Sales Boom: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సింపుల్ ఎనర్జీ తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటోంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 2026లో ఇప్పటి వరకు 10,429 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. 2025లో ఇదే కాలంలో నమోదైన 3,436 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 203 శాతం వృద్ధి కావడం విశేషం. 2023లో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సంస్థ మొత్తం 18,556 స్కూటర్లను విక్రయించింది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సింపుల్ ఎనర్జీకి చెందిన ‘వన్’ స్కూటర్ వరుసగా దేశంలోని అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న పది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల లిస్టులో చేరింది.
ఇప్పటివరకు పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చిన ‘వన్’ స్కూటర్ కు భిన్నంగా, సింపుల్ ఎనర్జీ ఇప్పుడు కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ‘వేవ్’ పేరుతో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. వేవ్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలు. తక్కువ ధరతో పాటు రోజువారీ ప్రయాణాలకు అవసరమైన సౌకర్యం, ఉపయోగకరమైన ఫీచర్లు, సులభమైన రైడింగ్‌ను అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ విభాగంలో ఇప్పటికే టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, హీరో విడా వంటి మోడళ్లు బలమైన పోటీ ఇస్తున్నాయి. ఏథర్ రిజ్టా, కోనార్క్ లాంటి స్కూటర్లు కూడా మార్కెట్లోకి రావడంతో పోటీ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో వేవ్ ద్వారా తన కస్టమర్ పరిధిని విస్తరించాలని సింపుల్ ఎనర్జీ చూస్తోంది.
వేవ్‌ను బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. ప్రారంభ వేరియంట్‌లో 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉండగా, ఇది 110 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుంది. 2.7 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే మరో వేరియంట్ 132 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇక 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 171 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అన్నింటికంటే పైస్థాయిలో ఉన్న వేవ్ ప్లస్‌లో 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఇది 243 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. వేవ్ స్కూటర్ల డెలివరీలు సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్ తమ అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ ఆశిస్తోంది.
కొత్త స్కూటర్‌కు మార్కెట్లో మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్న సంస్థ, తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతోంది. ప్రస్తుతం నెలకు సుమారు 3,000 స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా విక్రయ కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతోంది. ప్రస్తుతం 63 నగరాల్లో 75కు పైగా అవుట్‌లెట్లు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, నాగ్‌పూర్, గోవా వంటి నగరాల్లో సంస్థ తన ఉనికిని విస్తరించింది.
2023లో కేవలం 66 యూనిట్లతో ప్రారంభమైన సింపుల్ ఎనర్జీ అమ్మకాలు 2024లో 1,433కు చేరాయి. 2025లో 6,628 యూనిట్లకు పెరిగాయి. ఇక 2026లో ఆగస్టు చివరి నాటికే 10,429 యూనిట్లను దాటాయి. మార్చి 2026లో సంస్థ అత్యధికంగా 1,780 యూనిట్ల నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఫ్యామిలీ స్కూటర్ విభాగంలోకి వేవ్ ప్రవేశంతో ఈ అమ్మకాల వేగం మరింత పుంజుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!