Hero MotoCorp’s Big EV Plan: దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హీరో మోటోకార్ప్ సూపర్ ప్లాన్ రెడీ చేస్తోంది. దేశంలోనే నంబర్ వన్ ఈవీ విక్రేతగా నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ హర్షవర్ధన్ చితాలే కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకోసం హీరోకు చెందిన విడా బ్రాండ్‌ను మరింత విస్తరించడంతో పాటు, ఏథర్ ఎనర్జీ, యూలర్ మోటార్స్ లాంటి సంస్థల్లో పెట్టుబడులను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
న్యూఢిల్లీలో జరిగిన సియామ్ వార్షిక సమావేశంలో మాట్లాడిన హర్షవర్ధన్ చితాలే.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రస్థానమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విడా, ఏథర్ విక్రయాలను కలిపి చూస్తే కొన్ని నెలలుగా అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. అయితే ఒక్కో సంస్థ అమ్మకాలను విడిగా పరిగణిస్తే పరిస్థితి మరోలా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నమోదైన అమ్మకాల ప్రకారం విడా ప్రస్తుతం ఏథర్ కంటే వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది. దీంతో మార్కెట్‌లో విడా వాటాను మరింత పెంచడంపై హీరో దృష్టి పెట్టింది.
హీరోకు చెందిన విడా ప్రారంభంలో రిమూవబుల్ బ్యాటరీలతో కూడిన స్కూటర్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం లేని అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ భావించింది. ఇప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్థిరమైన బ్యాటరీలతో కూడిన స్కూటర్లను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు రకాల వాహనాలకు వేర్వేరు వినియోగదారుల నుంచి డిమాండ్ ఉందని కంపెనీ చెబుతోంది. స్థిరమైన బ్యాటరీలను ఉపయోగించడం వల్ల స్కూటర్ ధరను మరింత పోటీగా ఉంచే అవకాశం ఉంటుంది. రిమూవబుల్, స్టేబుల్ బ్యాటరీ మోడళ్ల మధ్య ధరలో సుమారు రూ.10,000 వరకు తేడా ఉండొచ్చని హర్షవర్ధన్ చితాలే తెలిపారు.
గత ఏడాది కాలంలో విడా తన మార్కెట్ వాటాను సుమారు 6 శాతం పాయింట్లు పెంచుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అదే సమయంలో దాదాపు 100 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్నట్లు తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నారు. గత నెలతో పోలిస్తే ప్రస్తుత నెలలో ఈవీ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 50 శాతం పెరగనుంది. డిసెంబర్ నాటికి ఈ సామర్థ్యాన్ని మరింత పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
హీరో మోటోకార్ప్ ఈవీ వ్యూహంలో ఏథర్ ఎనర్జీకి కూడా కీలక స్థానం ఉంది. ఏథర్‌లో హీరో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇటీవల జరిగిన రూ.1,758 కోట్ల నిధుల సమీకరణలోనూ హీరో మద్దతు కొనసాగింది. ప్రస్తుతం రెండు సంస్థలు తమ వాహనాలను ఒకే వేదికపై తయారు చేసే ఆలోచనలో లేవు. అయితే, భవిష్యత్తులో బ్యాటరీ సెల్‌ల కొనుగోలు, సాఫ్ట్ వేర్, మోటార్లు, ఇతర భాగాల విషయంలో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించవచ్చని చితాలే తెలిపారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విషయంలో హీరో, ఏథర్ ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. వేగవంతమైన ఛార్జింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమంలో రెండు సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అటు యూలర్ మోటార్స్ లోనూ హీరో పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో యూలర్ కూడా పెద్ద స్థాయికి ఎదగగలదని చితాలే అభిప్రాయపడ్డారు.
Read Also: నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!