Constitutional Amendment: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే.. పీఎం, సీఎం సహా మంత్రుల పదవులు ఆటోమేటిక్‌గా ఊడిపోయేలా తెస్తున్న ఈ నిబంధనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నైతిక సంస్కరణల పేరుతో తెస్తున్న ఈ బిల్లు అత్యంత క్రూరమైనదని, ప్రజాస్వామ్య విలువులను కాలరాసేలా ఉందంటూ పార్లమెంటరీ సంయుక్త కమిటీకి నివేదిక పంపింది.
జేపీసీకి ఫిర్యాదు..
ఈ బిల్లు వెనుక విపక్షాలను అణచివేసే పెద్ద కుట్ర దాగుందంటూ తెలంగాణ ప్రభుత్వం జేపీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నిబంధన పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య వ్యవస్థను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని నట్టేట ముంచేలా ఉందని అభ్యంతరం తెలిపింది.
తెలంగాణ సర్కార్ హెచ్చరిక..
ఈ బిల్లు అమల్లోకి వస్తే.. చట్టసభ విశ్వాసం కోల్పోకుండానే ఒక సీఎంను పదవి నుంచి తొలగించవచ్చు. ఇది దేశంలోని అధికార విభజన సూత్రాలకే విఘాతమని తెలంగాణ ప్రభుత్వం జేపీసీకి స్పష్టం చేసింది. భారత న్యాయశాస్త్రం ప్రకారం నేరం నిరూపితమయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే.. కానీ ఈ బిల్లు ద్వారా కోర్టుల ట్రయల్, శిక్షతో సంబంధం లేకుండా పోలీసుల రిమాండే ఫైనల్ తీర్పుగా మారుతుందని తెలంగాణ సర్కార్ హెచ్చరించింది.
Also Read: గైడ్‌లు బట్టీ కొడితే ఇక సున్నా మార్కులే.. ఏపీ టెన్త్ పరీక్షల్లో ‘పరఖ్’ విప్లవం!
30 రోజులు జైల్లో ఉంటే పదవి ఖతం
ప్రస్తుతం దేశంలో సీబీఐ, NIA వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లోనే నడుస్తున్నాయి. ఈ బిల్లును సాకుగా చూపించి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్ష రాష్ట్రాల్లోని సీఎంలు, మంత్రులను వ్యూహాత్మకంగా అరెస్టు చేయించే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. దర్యాప్తు సంస్థలు నిబంధనలను సాకుగా చూపించి 31 రోజులు జైల్లో ఉంచగలిగితే చాలు.. ప్రజా తీర్పుతో గెలిచిన ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. ఇక ప్రస్తుత న్యాయవ్యవస్థలో 30 రోజుల్లో బెయిల్ రావడం సాధ్యం కాదన్న నిజాన్ని కేంద్రం తమకు అనుకూలంగా మార్చుకునే ముప్పు ఉందన్నది ప్రభుత్వ వాదన.ఈ బిల్లు చట్టంగా మారితే.. దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ రాజకీయ కుట్రల కేంద్రంగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఈ అభ్యంతరాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్రధాని అయినా.. ముఖ్యమంత్రి అయినా..
దేశ రాజకీయాల్లో పొలిటికల్ బాంబ్.. అదే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. 30 రోజులకు పైగా జైల్లో ఉంటే వారి పదవి ఆటోమేటిక్‌గా ఊడిపోనుంది. ప్రధాని అయినా.. ముఖ్యమంత్రి ఐనా జైలుకి వెళ్తే తప్పుకోవాల్సిందే. క్రిమినల్స్ అధికార పీఠాలపై కూర్చోకుండా చూడటమే ఈ బిల్లు లక్ష్యమని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. ఈ బిల్లులోని 30 రోజుల నిబంధనే ఇప్పుడు పెను తుఫాను రేపుతోంది. కోర్టులో నేరం నిరూపణ కాకపోయినా.. 30 రోజులు రిమాండ్‌లో ఉంటే పదవి రద్దయిపోవడం ఏంటనే ప్రశ్నల ప్రవాహం ఉప్పొంగుతోంది. ఇదే క్లాజ్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
బిల్లుపై దేశమంతా నిరసన జ్వాలలు..
ఈ బిల్లుపై దేశమంతా నిరసన జ్వాలలు రగులుతుంటే.. తెలుగు రాష్ట్రాల స్టాండ్ ఆసక్తికరంగా మారింది. ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రం నిర్ణయానికే జై కొడుతోంది. నేరపూరిత రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమేనని వాదిస్తోంది. ఒకే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న భిన్న స్వరాల వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటనే చర్చ నడుస్తోంది.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా..?
ఈ బిల్లు వెనుక అసలు అజెండా ఏంటి? ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసేందుకే కేంద్రం ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోందా? అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజాబలంతో గెలిచిన ఒక సీఎంను కుప్పకూల్చాలంటే.. ఒక పోలీస్ స్టేషన్‌లో FIR, నెల రోజుల జైలు శిక్ష ఉంటే సరిపోతుందా? న్యాయ సూత్రాల ప్రకారం నేరం నిరూపితమయ్యే వరకు ఎవరైనా నిర్దోషే. మరి కోర్టు తుది తీర్పు ఇవ్వకముందే, కేవలం రిమాండ్ ఆధారంగా ప్రభుత్వాన్ని కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ 30 రోజుల తర్వాత ఆ నేత నిర్దోషిగా తేలితే… పోయిన పదవిని, పోగొట్టుకున్న ప్రతిష్టను ఏ చట్టం తిరిగి ఇస్తుంది? ఏ ఆర్టికల్ ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది?
Also Read: రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!