BigTV English

Rajasthan: రాజస్థాన్ పురావస్తు తవ్వకాల్లో బయటపడిన చారిత్రక వస్తువులు ఇవే.. 4,500 ఏళ్ల నాగరికత వెలుగులోకి!

Rajasthan: రాజస్థాన్ పురావస్తు తవ్వకాల్లో బయటపడిన చారిత్రక వస్తువులు ఇవే.. 4,500 ఏళ్ల నాగరికత వెలుగులోకి!

Rajasthan: చరిత్రను మార్చలేము.. తుడిచిపెట్టలేము.. దీనికి ఈ తవ్వకాలే ఓ నిదర్శనం. లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మాములు విషయం కాదు. అంతేకాదు రాజస్థాన్‌ అంటేనే అనేక నాగరికతలకు కేరాఫ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నో తరాలుగా విడతల వారీగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.. అందులో ప్రతిసారి మట్టిపొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది. బహజ్‌ సరే.. మరి రాజస్థాన్‌లో మిగతా ప్రాంతాల పరిస్థితేంటి? అక్కడ తవ్వితే బయట పడిన చరిత్రేంటి?


ఒకే ప్రదేశంలో ఐదు వేర్వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు

చారిత్రక ఆనవాళ్ల కోసం తవ్వకం అనేది.. మానవజాతి గతాన్ని తిరిగి తెలుసుకోవడానికి ఓ అడుగు. ఇది నేర్చుకోవడానికి, మన ఉనికిని అర్థం చేసుకోవడానికి, మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి తప్పనిసరి అంటారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఈ మాటలు ముమ్మాటికీ నిజమే అనిపిస్తోంది. బహజ్‌లో జరిగిన తవ్వకాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఐదు వేర్వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడటం. హరప్పా అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి. నిజానికి ఒకే ప్రాంతంలో ఇన్ని నాగరికతలకు చెందిన ఆనవాళ్లు బయటపడటం చాలా అరుదు.


ఒకదానికొకటి ఉన్న సంబంధాల అధ్యయనం

ఒకే ప్రదేశంలో అనేక సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు దొరకడంతో ఆయా కాలాల నాగరికతల పరిణామాన్ని, ఒకదానికొకటి ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి అవకాశం లభించినట్టైంది. ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టిపాత్రలు, యజ్ఞ కుండాలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఈ మట్టిపాత్రలపై ఉన్న చిత్రాలు, మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు, పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని బట్టి చూస్తుంటే మహాభారత కాలం ఒక కాల్పనిక కథ కాదని, వాస్తవంగా ఉనికిలో ఉన్న కాలమని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారమంటున్నారు చరిత్రాకారులు. ఇక శివపార్వతుల విగ్రహాలు కూడా ఓ కొత్త కథను చెబుతున్నాయి. వేల ఏళ్లనాటి నుంచే శివుడిని ఆరాధించడం వస్తుందనేది తేలిపోయింది. వేదకాలం నాటి సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలు యజ్ఞ కుండాలని చెప్పవచ్చు. ఈ కుండలు వేద, ఉత్తర వేద కాలాల్లో ఈ ప్రాంతంలో మతపరమైన కర్మకాండలు విస్తృతంగా జరిగాయని చెప్పకనే చెబుతోంది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక, మతపరమైన చరిత్రపై ఓ కొత్త ఆధారమని చెప్పవచ్చు. అంతేకాదు ఆనాటి వర్తక, సౌందర్య సంప్రదాయాలను తెలిపే శంఖు గాజులు, విలువైన రాతి పూసలు కూడా తవ్వకాల్లో దొరికాయి.

పురావస్తు తవ్వకాలకు ఒక నిధిగా రాజస్థాన్

ఒక్క బహజ్ మాత్రమే కాదు.. రాజస్థాన్‌ రాష్ట్రం పురావస్తు తవ్వకాలకు ఒక నిధి లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకు అనేక నాగరికతల ఆనవాళ్లు బయటపడ్డాయి. హనుమాన్‌గఢ్‌ జిల్లాలోని కాలిబంగన్ సింధు లోయ నాగరికతకు చెందిన ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ హరప్పా కాలం నాటి మానవ నివాసాలు సరస్వతి నది ఒడ్డున ఉన్నట్లు బయటపడింది. ఏడు అగ్ని ఆరాధన కుండలు, ఎద్దుల బొమ్మలు, నలుపు, ఎరుపు అలంకరణలతో కూడిన కుండలు, స్థూపాకార ముద్రలు, రాగి పనిముట్లు, దంతపు దువ్వెనలు వంటి కళాఖండాలు లభించాయి. ఉదయ్‌పూర్‌ జిల్లాలోని అహర్‌లో క్రీస్తుపూర్వం 3000-1500 కాలానికి చెందిన అహర్-బనాస్ సంస్కృతికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ కొన్ని నాణాలను గుర్తించారు. సీకర్‌ జిల్లాలోని గణేశ్వర్‌లో 4 వేల సంవత్సరాల పురాతన నాగరికత అవశేషాలను కలిగి ఉంది. ఇది రాగి గనులకు దగ్గరగా ఉన్నందున రాగితో చేసిన బాణం మొనలు, ఈటెలు, చేపల గాలాలు, గాజులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఇది హరప్పా పూర్వ కాలానికి చెందినదిగా పరిగణించారు.

ఇనుమును కరిగించే కొలిమిలు, చేనేత వస్త్రాలు, 11 గదుల భవనం

ఉదయ్‌పూర్‌ జిల్లాలోని బలథల్‌లో ఇనుమును కరిగించే కొలిమిలు, చేనేత వస్త్రాలు, 11 గదుల భవనం వంటివి కనుగొన్నారు. ఇక్కడ హైలేట్ ఏంటంటే.. 4 వేల క్రితం నాటి కుష్టు వ్యాధి సోకిన ఆనవాళ్లు ఉన్న ఓ అస్థిపంజరాన్ని గుర్తించారు. ఇవి కాకుండా నహ్, జోధ్‌పుర్‌, సునారి, రైధ్ ప్రాంతాల్లో ఇనుప యుగం నాటి ఆధారాలు లభించాయి అంతేకాదు భారత పురాతన చరిత్రలో చీకటి యుగం అంటే సింధు లోయ నాగరికత పతనం నుంచి బుద్ధుని కాలం వరకు మధ్య కాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు రాజస్థాన్‌లో లభ్యమయ్యాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే రాజస్థాన్‌ ప్రాంతం ఒకప్పుడు అనేక నాగరికతలకు కేంద్రంగా నిలిచిందని అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం బహజ్‌లో తవ్వకాలు ఇంకా ముగియలేదు. ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరి త్వరలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం కనుగొంటారో చూడాలి.

ఓ తవ్వకం ఇప్పుడు గతించిన గాథలను గుర్తు చేసింది. పుడమి పొరల్లో దాగున్న పురాతన రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వేల ఏళ్ల క్రితమే మానవజాతి ప్రగతి ఏంటో చూపించింది. అక్కడ దొరికినవి పగిలిన పెంకలు, శిథిలమైన విగ్రహాలే కావొచ్చు.. కానీ ఎన్నో సంస్కృతుల ఊపిరి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఇదంతా మనం చెప్పుకుంటున్నది రాజస్థాన్‌లో జరిగిన పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల గురించి. అసలు అక్కడ ఏం బయట పడింది? ఆ బయటపడిన వస్తువులు చెబుతున్న కథేంటి?

2024 జనవరి 10న బహజ్ గ్రామంలో తవ్వకాలు ప్రారంభం

రాజస్థాన్.. ఏడారి రాష్ట్రం. ఎటు చూసినా ఇసుకే. కానీ ఆ ఇసుక మాటున ఓ చరిత్ర ఉంది. గత వైభవాన్ని దాచుకుంది ఆ ప్రాంతం. ఇప్పటికే ఈ విషయాన్ని రుజువు చేసిన రాజస్థాన్.. ఇప్పుడు మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా 4 వేల 500 ఏళ్లనాటి కట్టడాలను బయటపెట్టింది. 2024 జనవరి 10న రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా, బహజ్‌ గ్రామంలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ గ్రామం భరత్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భరత్‌పూర్ అనేది పురాతన నాగరికతకు కేంద్రమనే ఆనవాళ్లు ఉన్నాయి. అందుకే తవ్వకాలను చాలా కాన్ఫిడెంట్‌గా కొనసాగించారు. దానికి నిదర్శనమే ఇప్పుడు బయటపడ్డ ఆనవాళ్లు. ఈ తవ్వకాల్లో రుగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతి నదితో పాటు.. 800కు పైగా పురాతన వస్తువులు, ఒక అస్తిపంజరాన్ని కనుగొన్నారు. దీంతో ఇప్పుడు ASI అధికారుల ఆనందానికి అవధులు లేవు.

23 మీటర్ల లోతు వరకు తవ్వకాలు

పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాలు ఏకంగా 23 మీటర్ల లోతు వరకు జరిగాయి. రాజస్థాన్‌లో జరిపిన తవ్వకాల్లో ఇదే అత్యంతలోతైనదని చెప్పవచ్చు. అంతలోతున ఓ పురాతన నది పాయను కనుగొన్నారు. ఈ నది వేదాల్లో చెప్పినట్టుగా ఉన్న సరస్వతీ నదిగా భావిస్తున్నారు. ఈ నదికి పురాణాల్లో అత్యంత విశిష్టత ఉందని చెప్పొచ్చు. హరప్పా, బ్రజ్, మథుర ప్రాంతాల మధ్య సంస్కృతిని లింక్‌ చేస్తూ.. ఆనాటి నాగరికతలకే ఈప్రాంతం కేరాఫ్‌గా ఉందని చెబుతున్నారు. ఇక ఈ తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు కూడా ఇప్పుడు అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మిలిపితో కూడిన పురాతన ముద్రలు, రాగితో తయారు చేసిన నాణాలు, యజ్ఞకుండాలు, హవన సాధనాలు, మౌర్య, కుషాణ, గుప్త యుగాల నాటి విగ్రహాలు, శివ-పార్వతి ప్రతిమలు, శంఖ బంగిళ్లు లభ్యమయ్యాయి. అంతేకాదు ఈ తవ్వకాల్లో ఓ ఆస్తిపంజరం.. ముఖ్యంగా ఓ కపాలం లభ్యమైంది. అది ఏకాలానికి సంబంధించిందో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌కు పంపారు ASI అధికారులు.

లోహశాస్త్రంపై అధునాతన జ్ఞానం ఉందరే చర్చ

ఇక లోహాలకు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఇప్పుడు బయటపడ్డాయనే చెప్పాలి. లోహలను వస్తువులుగా మార్చుకునేందుకు కావాల్సిన కొలిమిలు, లోహ వస్తువులు లభించాయి. వీటన్నింటిని బట్టి చూస్తే ఆనాటి ప్రజలకు లోహశాస్త్రంపై అధునాతన జ్ఞానం ఉందని తెలుస్తోంది. ఇక ఈ తవ్వకాల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓ దేవత బొమ్మ. ఇది 400 బీసీ కాలానికి చెందినదిగా గుర్తించారు. ఈ విగ్రహాన్ని మౌర్యుల కాలంలో ఆరాధించే వారని తెలుస్తోంది. ఇక ఇక్కడ నిర్మించిన మట్టి గోడలు, స్థూపాలు గుప్తుల శైలిలో ఉన్నాయని.. ఇక ఎముకలతో చేసిన పనిమూట్లు, సూదులు దువ్వెనలు కూడా లభించాయి. ఈ తవ్వకాలు ఇప్పుడు సరికొత్త దిశను చూపించేలా ఉన్నాయంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇప్పుడు బయటపడిన కొన్ని వస్తువులు, ఆధారాలు రాజస్థాన్‌ను మాత్రమే కాదు.. ఉత్తర భారతదేశ చరిత్ర దిశను మార్చేలా ఉన్నాయి. భారత పురాతన సాంస్కృతిక జీవన విధానంపై విస్తృత అవగాహనను అందించనుంది.

దేశంలో లభించడం ఇదే తొలిసారి అంటున్న శాస్త్రవేత్తలు

అంతేకాదు మట్టి గోడలు, స్తంభాలు, లోహ పరిశ్రమకు సంబంధించిన కొలుములు, ఎముకలతో చేసిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుతమైన కళాఖండాలు ఆనాటి ప్రజల జీవనశైలి, కళానైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయని సంబరపడుతున్నారు. ఇక తవ్వకాల్లో దొరికిన ఓ అస్థిపంజరం కూడా అనేక విషయాలను తెలపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అస్థిపంజరం ద్వారా ఆనాటి ప్రజల ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఆయుష్షు, వ్యాధులు, అలాగే ఆ ప్రాంతంలో నివసించిన మానవ సమూహాల గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.

Also Read: హిందువులే టార్గెట్.. అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర టెర్రర్ భారత్ ప్లాన్ ఏంటంటే..

ఇప్పటికే ఈ తవ్వకాలకు సంబంధించిన నివేదిక కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు చేరింది. బహజ్‌ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నారు అధికారులు. భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించి రుగ్వేద, సరస్వతి, హరప్పా కాలానికి మధ్య సంబంధాన్ని సూచిస్తుండటంతో.. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశమే కనిపిస్తోంది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×