Singhaiah Case: ఏపీలో సంచలనం రేపిన దళితుడు సింగయ్య మృతి కేసులో వైసీపీ నేతలకు చుక్కలు కనిపించనున్నాయా? వైసీపీ చేస్తున్న ప్రచారం అబద్దమని తేలిపోయిందా? రంగంలోకి విచారణ అధికారులు దిగేశారా? కేసు పక్కదారి పట్టించిన వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అతి చేస్తే దానివల్ల వచ్చే అనర్థాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పడానికి సింగయ్య మృతి కేసు ఓ ఉదాహరణ. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసులో కీలక పురోగతి. వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఆయన కాన్వాయ్ కింద సింగయ్య పడినట్టు చూపుతున్న వీడియోలు నిజమైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. వాటిని మార్ఫింగ్ చేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిపోయింది. పోలీసులకు అందిన రిపోర్టుతో కేసు విచారణలో నెలకొన్న అనుమానాలకు తెరపడింది.
సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనం కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే వైసీపీ కార్యకర్తల సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు నిజమేనన్నది ఆ నివేదిక సారాంశం. పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ సమాచారం ఇచ్చిన వారిపై అంతర్గత విచారణ మొదలైంది. నేడు లేకుంటే రేపు గానీ ఆ నేతను అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు.
జూన్ 18న పల్నాడు జిల్లా పర్యటన బయలుదేరారు వైసీపీ అధినేత జగన్. అధినేత వస్తున్నాడంటే నేతలు, కార్యకర్తలు హంగమా అంతా ఇంతా కాదు. పల్నాడు టూర్‌లోనూ అదే జరిగింది. జగన్ వాహనం వెళ్లే క్రమంలో దాని కింద పడ్డాడు సింగయ్య. ఆ సన్నివేశాన్ని చూసిన ఆ పార్టీ కార్యకర్తలు సింగయ్యను రోడ్డు పక్కకు లాగేసి వదిలేశారు. జగన్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ALSO READ: వందేళ్ల బ్రిడ్జిపై 10 అద్భుతాలు
కొద్దిసేపటికి సింగయ్య మృతి చెందాడు. వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందాడని గుంటూరు జిల్లాకి చెందిన వైసీపీ నేత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ విషయాన్ని మీడియా సమావేశంలో జిల్లా పోలీసులు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు షాకయ్యారు.
ఘటనా స్థలంలో డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించారు. ర్యాలీని చిత్రీకరించిన వైసీపీ కార్యకర్తల ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఆరు ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించిన నిపుణులు ఆ వీడియోలు ఒరిజినల్ అని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో కీలక అరెస్టులు మొదలుకావచ్చని అంటున్నారు.
ఫోరెన్సిక్ నివేదిక రావడంతో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు పోలీసులు. ప్రమాదం జరిగినప్పుడు దిగువ స్థాయి పోలీసులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించిన పోలీసులపై శాఖాపరమైన విచారణ మొదలైంది. కొందరు పోలీసులు వైసీపీ మద్దతుదారులుగా వ్యవహరించారనే ప్రచారం లేకపోలేదు.