Gold Scam: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో నాలుగున్నర కిలోల బంగారం పోయిందన్న వార్తలు.. దేశవ్యాప్తంగా భక్తులను కలచివేశాయ్. స్వామి బంగారం దోపిడీకి గురైందనే ఆరోపణలు.. దేశం మొత్తం సంచలనంగా మారాయ్. ఇప్పుడు మన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఏకంగా 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణల్ని.. వేంకటేశ్వరస్వామి భక్తులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. గోవిందరాజస్వామి ఆలయ గోపురం పనుల్లో జరిగిన అవకతవకలేంటి? టీటీడీ చుట్టూ ఈ వరుస వివాదాలేంటి?
తిరుమల కొండ కింద కూడా బయటపడుతున్న అక్రమాలు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపైనే కాదు.. కొంద కింద కూడా అక్రమాలు బయటపడుతున్నాయ్. ఇప్పటికే.. తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారం ఎంత దుమారం రేపిందో అంతా చూశాం. ఆ తర్వాత.. కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటీవల.. వస్త్రాల కొనుగోళ్లలో జరిగిన అవినీతి కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు.. కలియుగ వైకుంఠం తిరుపతిలోని.. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ ముసురుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆలయ రాజగోపురం బంగారు తాపడం పనుల్లో ఏకంగా 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందనే ఆరోపణలు.. ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయ్. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. అంతేకాదు.. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా బయటపడటం మరింత కలకలం రేపుతోంది.
2022-2023 మధ్యలో బంగారు తాపడం పనులకు నిధులు
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. 2022-2023 మధ్యకాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల కోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. సుమారు 100 కిలోల బంగారాన్ని కేటాయించింది. ఈ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, కేటాయించిన దానిలో.. 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలు సంచలనంగా మారాయ్. నిబంధనల ప్రకారం.. 9 పొరల తాపడం చేయాల్సి ఉండగా.. కేవలం 2 పొరలు మాత్రమే వేసి.. దాదాపు సగం బంగారాన్ని పక్కదారి పట్టించారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. తాపడం పనులు జరుగుతున్న సమయంలో గోపురానికి ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. విగ్రహాలు దెబ్బతిన్నా.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకుండా అలాగే బంగారం తాపడం పనులు చేశారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయ్. దీనివల్ల ఆలయ పవిత్రతకు, వారసత్వానికి భంగం కలిగిందని.. హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చినా.. టీటీడీ ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోలేదని, ఆందోళనలను అణచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. విగ్రహాలు దెబ్బతిన్న విషయం బయటకురాకుండా.. ఆనాటి టీటీడీ బోర్డులోని కొందరు కీలక వ్యక్తులు.. జాగ్రత్తపడ్డారనే చర్చ కూడా ఉంది.
బంగారం గోల్‌మాల్‌పై దర్యాప్తు చేస్తున్న టీటీడీ విజిలెన్స్
బంగారం గోల్‌మాల్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు.. టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం పనులకు.. అసలు కాంట్రాక్టర్‌ను కాదని సబ్ లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం.. ఈ అంశాలన్నింటిపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు? బంగారం ఎంత వాడారు? అనే అంశంపై ఆరా తీస్తోంది. అంతేకాదు.. బంగారు తాపడం నాణ్యతపైనా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయ్. గోపురానికి చేసిన బంగారం పూత రంగు మారుతోందని, అక్కడ వాడింది అసలు బంగారమా? లేక తక్కువ నాణ్యత కలిగిన లోహమా అనే సందేహాలు కూడా భక్తులు, హింధూ ధార్మిక సంస్థల ప్రతినిధుల నుంచి వ్యక్తమవుతోంది. కాంట్రాక్ట్ విషయంలో పారదర్శకత లేకపోవడం మరిన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.
సంచలనంగా పరకామణిలో చోరీ వ్యవహారం
కేవలం గోవిందరాజస్వామి ఆలయమే కాదు.. కొంతకాలంగా టీటీడీ అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఆందోళనకు గురిచేసింది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో చోరీ వ్యవహారం కూడా సంచలనంగా మారింది. అందులో పనిచేసే సిబ్బంది.. బంగారం, నగదు మళ్లించారనే ఆరోపణలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇటీవలే.. నాసిరకం వస్త్రాల కొనుగోళ్ల వ్యవహారం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అంతకుముందు.. శ్రీవారి ఆలయానికి చెందిన పురాతన ఆభరణాలు, కిరీటాల విషయంలోనూ.. అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దేవుడి సొమ్ముకే రక్షణ కరువైతే.. అది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. శబరిమల లాంటి ఘటనల తర్వాత.. భక్తులు అన్నీ గమనిస్తున్నారు. కేరళలో ఉన్న ఆలయం గురించే భక్తుల ఇంతలా ఆందోళనకు గురైతే.. తిరుపతి తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఉంది. టీటీడీ పరిధిలో ఉండే గోవిందరాజస్వామి ఆలయంలోనే బంగారం పక్కదారి పట్టిందనే ఆరోపణలు.. భక్తులను మరింత కలవరపెడుతున్నాయ్. ఈ వ్యవహారంలో విజిలెన్స్ విచారణ పూర్తయితేనే.. అసలు నిజాలు బయటపడతాయ్. పారదర్శకమైన విచారణ జరిపి.. దోషులుగా తేలినవారిని కఠినంగా శిక్షించాలని, స్వామివారి సొమ్ముని కాపాడాలను భక్తులు కోరుతున్నారు.
టీటీడీ.. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎందుకు చేయించాలనుకుంది? ఈ కోవెలకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యత ఏంటి? ఏకంగా వంద కేజీల బంగారం కేటాయించాల్సినంత ప్రాధాన్యత ఉందా? అసలు.. కొండ కింద వెలిసిన గోవిందరాజస్వామికి.. తిరుమల కొండపై నెలవైన శ్రీ వేంకటేశ్వరునికి ఉన్న లింకేంటి? పురాణాలు, ఇతిహాసాలు ఏం చెబుతున్నాయ్?
తిరుపతి అనగానే.. ముందుగా అందరికీ గుర్తొచ్చేది తిరుమల కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామి మాత్రమే. కానీ.. కొండపై నుంచి అడుగు కిందకు వేయగానే మనకు దర్శనమిచ్చే మరో అద్భుతమైన క్షేత్రం.. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం. ఈ ఆలయ విమాన గోపురానికి తిరుమల తిరుపతి దేవస్థానం సుమారు 100 కిలోల బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించడం వెనుక.. ఎంతో విశిష్టత, పురాణ నేపథ్యం, చారిత్రక ప్రాధాన్యతలున్నాయి. తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి కోవెలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం.. ఆ శ్రీనివాసుడు.. పద్మావతి దేవిని వివాహం చేసుకున్నప్పుడు, ఆ పెళ్లి ఖర్చుల కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పును లెక్కగట్టడానికి, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి.. తన అన్నగారైన గోవిందరాజస్వామిని ఇక్కడే ఉండమని శ్రీనివాసుడు కోరినట్లు చెబుతారు. అందువల్ల.. గోవిందరాజస్వామిని.. లెక్కల దేవుడని పిలుస్తారు. ఆయన కొలిచే పాత్రను.. తల కింద పెట్టుకొని శేషతల్పంపై పడుకొని ఉంటారు. అంటే.. తమ్ముడైన శ్రీనివాసుడి అప్పు తీరిందో లేదోనని లెక్కలు చూస్తూ నిద్రపోతున్నారని.. భక్తులు నమ్ముతారు.
తిరుమల క్షేత్ర నియమం ప్రకారం.. పురాతన కాలం నుంచి ఓ ఆచారం ఉంది. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా కింద ఉన్న గోవిందరాజస్వామిని దర్శించుకుని, ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే కొండపైకి వెళ్లాలి. ఎందుకంటే.. ఆయన ఈ ప్రాంతానికి యజమానిగానూ, శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతినిధిగానూ కొలువై ఉన్నారు. ఇంకొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. చిదంబరంలో ఉన్న స్వామివారే ఇక్కడికి వచ్చారని చెబుతుండగా.. పురాణాల ప్రకారం మాత్రం గోవిందరాజస్వామి.. స్వయానా శ్రీనివాసుడికి అన్నగారని చెబుతున్నారు. కుబేరుడు ఇచ్చిన అప్పుని కొలిచేటప్పుడు.. గోవిందరాజస్వామి ఆ బంగారాన్ని తూకం వేస్తూ అలసిపోయి.. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారని.. క్షేత్ర పురాణం వివరిస్తోంది. ఈ గోవిందరాజస్వామి ఆలయానికి 900 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీని వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది. 12వ శతాబ్దంలో.. తమిళనాడులోని చిదంబరంలో వైష్ణవులపై దాడులు జరిగినప్పుడు.. అక్కడి గోవిందరాజస్వామి విగ్రహాన్ని రక్షించేందుకు.. భగవత్ రామానుజాచార్యులు ఆ విగ్రహాన్ని తిరుపతికి తీసుకొచ్చారు. అలా.. 1130వ సంవత్సరంలో.. రామానుజాచార్యులు ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి.. ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. దీనివల్ల.. తిరుపతి నగరం ఆ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది.
వంద కేజీల బంగారాన్ని ఎందుకు కేటాయించాల్సి వచ్చింది?
50 కేజీల బంగారం మాయమైందనే ఆరోపణలు సంచలనంగా మారిన ఈ సమయంలో.. మరో చర్చ కూడా జరుగుతోంది. గోవిందరాజస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయించేందుకు వందకోట్ల బంగారాన్ని ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్. ఎందుకంటే.. వంద కేజీల బంగారం అంటే సామాన్యమైన విషయం కాదు. కాకపోతే.. దీని వెనుక టీటీడీకి కొన్ని బలమైన కారణాలు ఉండొచ్చంటున్నారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం.. అత్యంత పురాతనమైన, మహిమాన్వితమైన ఆలయాల గోపురాలకు.. బంగారు తాపడం చేయడం వల్ల.. ఆ ఆలయ శక్తి పెరుగుతుందని నమ్ముతారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ఆనంద నిలయానికి ఉన్నట్లే.. కొండ కింద కొలువైన గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి కూడా బంగారు మెరుపులు అద్దడం ద్వారా.. ఈ క్షేత్రానికి సైతం ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావాలన్నది టీటీడీ లక్ష్యం.
Also Read: బిర్యానీలా కుళ్లిన మాంసం.. దుర్గా గ్రాండ్యూర్ హోటల్‌లో కస్టమర్ల రచ్చ!
అంతేకాదు.. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఇదీ ఒకటి. విజయనగర రాజులు, చోళులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు, భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు.. ఎన్నో దానధర్మాలు చేశారు. ఆ వైభవాన్ని పునరుద్ధరించే ఉద్దేశంలో భాగంగానే.. స్వర్ణ తాపడం పనులు చేపట్టి ఉంటారని చెబుతున్నారు. గోవిందరాజస్వామి కేవలం ఓ విగ్రహం మాత్రమే కాదు.. తిరుపతి నగరానికి సైతం ఆయనే రక్షకుడని భక్తులు నమ్ముతారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, అంతే స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ భావిస్తోంది. అందుకోసమే.. వంద కేజీల ఆలయంతో బంగారు తాపడం పనులు చేపట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే.. ఈ వ్యవహారంలో సగానికై పైగా బంగారం పక్కదారి పట్టిందనే ఆరోపణలే.. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
Story By Anup, Bigtv