BigTV English

CHINA: మరింత దారుణంగా దిగజారిపోయిన చైనా.. చివరకు చిన్న పిల్లలను కూడా..?

CHINA: మరింత దారుణంగా దిగజారిపోయిన చైనా.. చివరకు చిన్న పిల్లలను కూడా..?

CHINA: ప్రపంచం అసహ్యించుకునే స్థాయిలో చైనా అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. స్వతంత్ర టిబెట్‌ను, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆస్తిగా భావిస్తున్న చైనా… చివరికి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. ముక్కపచ్చలారని చిన్నారుల్ని తమ కుటుంబాల నుండి దూరం చేస్తోంది. ప్రతి నలుగురు టిబెటియన్ చిన్నారుల్లో ముగ్గుర్ని చైనా బోర్డింగ్‌ స్కూళ్లకు తరలిస్తోంది. నిర్భంద విద్యను అందిస్తూ… వారికి, టిబెటియన్ సంస్కృతిని, భాషను దూరం చేస్తోంది.


చైనా దౌర్జన్యాలకు హద్దూ పొద్దూ లేకుండా పోయింది. తన సామ్రాజ్యవాద కాంక్ష తీర్చుకోడానికి పసిపిల్లల బాల్యాన్ని కూడా బలితీసుకుంటోంది. ముక్కుపచ్చలారని చిన్నారుల్ని తమ కుటుంబాల నుండి దూరం చేస్తోంది. నిర్భంధ విద్య కోసం బోర్డింగ్ స్కూళ్లలో బంధిస్తోంది. చైనా భ‌విష్యత్ అవ‌స‌రాలు, ప్రపంచంలో వ‌చ్చే మార్పులు, భార‌త్‌తో చైనాకున్న స‌రిహ‌ద్దు స‌మ‌స్యల నేప‌థ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. చైనా పశ్చిమ ప్రాంతంలో ఉన్న టిబెట్‌‌లో పిల్లల‌కు ప్రత్యేక త‌ర‌గ‌తులు నిర్వహిస్తూ… వారికి ప్రత్యేక శిబిరాలు, మిల‌ట‌రీ శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్లు ఆ మధ్య ఐక్యరాజ్య సమితి నివేదికలు కూడా వెల్లడించాయి.ఈ ప్రత్యేక శిబిరాల్లో ఉన్న పిల్లలంతా ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వ‌య‌స్సున్న పిల్లలే. భారత్‌తో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్యలు, ప్రపంచ రాజ‌కీయాలు, చైనా ముందున్న స‌వాళ్లు… వీట‌న్నింటిపై ఆ పిల్లల‌కు ప్రత్యేకంగా బోధిస్తున్నట్లు నివేదిక తెలిపాయి.

చైనా చేస్తున్న ఇలాంటి రహస్య చర్యలపై ఇటీవల పలు అంతర్జాతీయ నివేదికలు వెలువడ్డాయి. ఈ నివేదికల ప్రకారం… టిబెటియన్ పిల్లలంద‌ర్నీ వారి త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉంచుతూ, వారి కోసం ప్రత్యేక‌మైన హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టిబెట్‌లోని నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లల్ని చైనా బోర్డింగ్ స్కూళ్లలో పెడుతోంది. వారిని టిబెట్ సంస్కృతికి, సంప్రదాయాల‌కు దూరంగా ఉంచుతున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ పిల్లలంద‌ర్నీ చైనా క‌మ్యూనిస్టు పార్టీకి… చైనాకు వీర విధేయులుగా తీర్చి దిద్దడ‌మ‌న్న ఏకైక ల‌క్ష్యంగా ఈ ట్రైనింగ్ సెంట‌ర్లు కొన‌సాగుతున్నట్లు తెలుస్తోంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన కుట్రలో భాగంగా… టిబెట్‌లో ఒక తరాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి, వారిని పార్టీకి విధేయులైన పౌరులుగా మలచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


అయితే, దీనిపై టిబెట్ హక్కుల కార్యకర్తలు, ఐక్యరాజ్యసమితి కోసం పనిచేస్తున్న నిపుణులు తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రపంచంలో టిబెటన్ గుర్తింపును తుడిచివేయడానికి, చారిత్రాత్మకంగా చైనా పాలనను ప్రతిఘటించిన టిబెటన్ ప్రజలపై చైనా నియంత్రణను మరింతగా పెంచడానికి… జిన్ పింగ్ ప్రభుత్వం పిల్లలను వారి కుటుంబాల నుండి క్రమపద్ధతిలో వేరు చేస్తోందని అన్నారు. ఆరు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న టిబెటన్ విద్యార్థులలో దాదాపు మూడొంతుల మంది… మాండరిన్‌లో ఎక్కువగా బోధించే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డింగ్ స్కూళ్లలో ఇంకా తక్కువ వయసున్న పిల్లలు కూడా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా టిబెటన్ పిల్లలు.. వాటి ఇంట్లో, గ్రామీణ పాఠశాలల్లో ఒకప్పుడు నేర్చుకున్న టిబెటన్ భాష, సంస్కృతి, బౌద్ధ విశ్వాసాలను తుడిచేయడానికి చైనా ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్… గతేడాది జూన్‌లో, ఇలాంటి ఒక పాఠశాలను సందర్శించారు. అక్కడ, ఆర్మీ బ్యారక్ లాగా ఏర్పాటు చేసిన హాస్టళ్లను కూడా జిన్‌పింగ్ తనిఖీ చేశారు. అలాగే, కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలపై టిబెటన్ విద్యార్థుల ఉపన్యాసం విని, టిబెటన్ విద్యార్థులు కొట్టిన చప్పట్లకు మురిసిపోయారు. క్వింఘై ప్రావిన్స్‌లో ఉన్న ఈ పాఠశాల సందర్శనం తర్వాత జిన్‌పింగ్‌… అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కున్నారు. అయినప్పటికీ… ఈ కార్యక్రమానికి చైనా బలంగా ఆమోదం తెలిపింది. “చిన్నప్పటి నుండే పిల్లల్లో చైనీస్ జాతీయతకు సంబంధించిన స్పృహను నాటాలి” అని ఈ సందర్భంగా జిన్‌పింగ్ అన్నారు. టిబెటన్ పిల్లలు త్వరగా చైనీస్ భాషలో నిష్ణాతులుగా మారడానికి… ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వారిని సిద్ధం చేసే నైపుణ్యాలను నేర్చుకోవడానికి పాఠశాలలు సహాయపడతాయని చైనా అధికారులు కూడా చెబుతున్నారు. ఇక, టిబెటన్ కుటుంబాలే స్వచ్ఛందంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ బోర్డింగ్ స్కూల్ విద్య అంతా ఉచితమనీ… విద్యార్థులకు టిబెటన్ సంస్కృతి, భాషలో కూడా తరగతులు ఉంటాయని వెల్లడించారు.

అయితే, చైనా చర్యలపై అంతర్జాతీయంగా వచ్చిన నివేదికలు, పలు పరిశోధనల ప్రకారం… టిబెటన్ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో నమోదు చేసుకోవడం కోసం… చైనా అధికారులు ప్రత్యేకంగా సెలక్షన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, పిల్లల తల్లిదండ్రులకు, తమ పిల్లల్ని పంపడం తప్ప వేరే మార్గం లేదని నిపుణులు, తల్లిదండ్రులు, న్యాయవాదులు, మానవ హక్కుల పరిశోధకులు పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. పిల్లల్ని బోర్డింగ్ స్కూళ్లకు పంపిన తర్వాత చాలా మంది తల్లిదండ్రులు తమ కన్నపిల్లల్ని నెలల తరబడి చూడకుండానే ఉండాల్సి వస్తుందని నివేదికలు వెల్లడించాయి. ఈ పరిస్థితిపై కొందరు చైనీస్ నిపుణులు, ఉపాధ్యాయుల నుండి డజన్ల కొద్దీ పరిశోధనా పత్రాలు, నివేదికలు వెలువడ్డాయి. ఇందులో, పాఠశాలల్లో టిబెటన్ పిల్లలు ఆందోళన, ఒంటరితనం, నిరాశ, ఇతర మానసిక ఇబ్బందులకు గురౌతున్నట్లు పేర్కొన్నాయి. టిబెటన్ బోర్డింగ్ పాఠశాలల గురించి… టిబెటన్ మీడియా, స్థానిక ప్రచార సంస్థలు చైనీస్ సోషల్ మీడియా సైట్‌ల్లో పోస్ట్ చేసిన వందలాది వీడియోలు బయకొచ్చాయి. వీటిల్లో, ఈ నిర్భంద పాఠశాలలు ఎలా పనిచేస్తాయో, కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యాలకు ఎలా ఉపయోగపడతున్నాయో చూపించాయి.

ఈ పాఠశాలల్లో విద్యార్థులకు రాజకీయ బోధనలు చేస్తున్నారు. ఈ పాఠశాలలు చైనా “సెర్ఫ్‌ల విముక్తి దినోత్సవం” జరుపుకుంటాయి. ఇందులో, టిబెటన్ తిరుగుబాటు విఫలం కావడం… దలైలామాను బహిష్కరించి, 1959లో కమ్యూనిస్ట్ పార్టీ టిబెట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న వార్షికోత్సవం జరుగుతుంది. ఇక, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కుటుంబాల నుండి బలవంతంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంచడంపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కున్నాయి. 1800ల ప్రారంభం నుండి 1960ల చివరి వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్వదేశీ పిల్లలను ఉంచడం గురించి, అమెరికా ప్రభుత్వం తరపున అధ్యక్షుడు జో బైడెన్ గత అక్టోబర్‌లో క్షమాపణలు చెప్పారు. దీనిని “అమెరికా ఆత్మపై చేసిన పాపంగా” బైడెన్ అభివర్ణించారు. ఇప్పుడు, చైనా కూడా ఇలాగే బాల్యాన్ని ఛిదిమేస్తూ.. బోర్డింగ్ పాఠశాలలను పెంచుకుంటూ పోతోంది. టిబెటన్ పిల్లలు తాము చైనీయులమని గర్వంగా ప్రకటిస్తున్నారని ప్రపంచానికి చూపించడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read:HMFW Jobs: రూ.35,000 జీతంతో ఉద్యోగం.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. వీళ్లందరూ అర్హులే..

చైనా చేపట్టిన ఈ నిర్భంద విద్య వల్ల టిబెటన్ పిల్లలు వారి సొంత భాషా, సంస్కృతి దూరమవుతున్నారే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ స్కూళ్లలో చదువుతున్నవారు వారి సొంత భాష అయిన టిబెటన్ కాకుండా మాండరిన్ మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. నాలుగైదు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ల తల్లిదండ్రులతో వచ్చీరానీ టిబెటన్‌లో మాట్లాడాల్సి వస్తోంది. ఇప్పుడు టిబెట్‌లోని చాలా ప్రాంతాల్లో పిల్లలు “తమ సొంత ఇంట్లో అపరిచితుల్లా” ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. అయితే, వారిని బోర్డింగ్ స్కూల్‌కు పంపడం తప్ప తల్లిదండ్రులకు కూడా వేరే మార్గం లేదు. తమ పిల్లలకు మెరుగైన ఉద్యోగాల కోసం చైనీస్ నేర్చుకోవాల్సి వస్తుందని అంగీకరిస్తున్నారు. అయితే, అంతర్జాతీయంగా ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపధ్యంలో… టిబెటన్ పిల్లలు తమ తాతామామల నుండి, వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాల్సిన స్థానిక భాష, వస్తువుల పేర్లు, సంప్రదాయాలు, విలువలు మర్చిపోతున్నారు. ఇక, జిన్‌పింగ్ పాలనలో, టిబెటన్‌ భాషల్లో విద్యను భారీగా తగ్గించారు. బదులుగా, చైనీస్‌లోనే బోధన పెరిగింది. టిబెటన్ పిల్లలపై చైనీస్‌ను బలవంతంగా రుద్దుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×