Vidadala Rajini: చేసుకున్న వారికి చేసుకున్నంత మహేదేవ అంటారు. పేటలో ఒకప్పుడు పేటరాప్ వేసిన వైసీపీ మహిళా మంత్రిణి రజనీ మేడంగారు అప్పుడెంత హైలెట్ అయ్యారో.. ఇప్పుడూ అంతేగా హైలెట్ అవుతున్నారా? మేడంగారు నాడు చేసిన పాపాలు నేడు శాపాలుగా వెంటాడుతున్నాయా? ఒకదాని వెంట మరో సమస్య ఆమెను వెంటాడుతూనే ఉందా? మరి మేడంగారు ప్రత్యర్ధులను పడగొట్టే దారేది? పార్టీని తిరిగి గాడిన పెట్టుకునే తెన్ను ఏది? ఇప్పుడు చూద్దాం..
స్టోన్ క్రషర్ వంటి కేసుల్లో భారీగా చిక్కిన రజనీ మేడం
ఒకప్పుడు ఎమ్మెల్యే అయిన తొలిసారే మినిస్టరై పేరు సాధించిన రజనీ మేడం.. ఇప్పుడు.. స్టోన్ క్రషర్ వంటి కేసుల్లో భారీగా చిక్కి పెద్ద ఎత్తున చెడ్డ పేరు సాధిస్తున్నారట. సాగినంత కాలం నా అంతటి వారు లేరందురు.. సాగకపోతే ఊరక చతికిల పడిపోవుదురు.. అన్న పాతకాలం నాటి పాట.. తిరిగి గుర్తుకు తెస్తున్నారట.
అప్పట్లో ఫ్యాన్ పార్టీ లక్కీయెస్ట్ లో ఫస్ట్ బెస్ట్ రజనీ మేడంగారే
మరీ ముఖ్యంగా మాజీ మహిళా మంత్రిణి.. రజనీ మేడం వ్యవహారం మరీ ఘోరం గా తయారైందట. అప్పట్లో ఫ్యాన్ పార్టీ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సనాల్టీస్ ఎవరా అని చూస్తే.. ఫస్ట్ కనిపించె బెస్ట్ ఫేస్ కట్ మేడంగారిదే అన్న టాకుండేది. అప్పట్లో మేడం సార్ మేడం అంతే అన్న కామెంట్ చేసేవారట ఆమె అనుచరులు. అంత సడెన్ స్టార్ గా ఆమె తెర మీదకు రావడం- గెలవడం- ఆపై లక్కీగా- మంత్రి పదవి పొందడం.. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా.. ఆమెను పొగుడుతూ కాంప్లిమెంట్లు.. ఇచ్చేవారట పేట వ్యాప్తంగా. మొదటి సారి ఎమ్మెల్యే ఎవరైనా అవుతారు. మంత్రి పోస్టు కొట్టేసిన కొందరంటే కొందరు అదృష్టవంతుల్లో రజనీ మేడం ద బెస్ట్ అనే టాక్ కేవలం పేటలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారు మోగిన విషయం తెలిసిందే. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టి రజనీకి ఆరోగ్య శాఖ ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందీ విధితమే.
అందివచ్చిన అవకాశాలను అవినీతి మయం చేసిన పేరు
ఎవరికో తప్ప సాధ్యం కాని ఈ ప్రత్యేకతలతో ఒక మంత్రిగా ఎంతో మంచి పేరు సాధించాలి. కానీ, రజనీ మేడం గారు అందివచ్చిన అవకాశాలను అవినీతి మయంగా మార్చేయడంతో.. ఇప్పుడు కూడా ఆమె పేరు మారు మోగటంలో ఎంత మాత్రం బీటు తప్పడం లేదట. అదే టెంపో మెయిన్ టైన్ చేస్తున్నారట మేడంగారు.
అప్పట్లో.. మనల్ని ఎవర్రా ఆపేదంటూ చెలరేగిన రజనీ
ఒకటీ రెండు కాదు.. వరుస వెంబడి కేసులు.. స్టోన్ క్రషర్ యజమానుల కంప్లయింట్ తో మొదలైన కేసుల పరంపర.. రజనీ అవినీతి చిట్టా బయటకు తీస్తే చేంతాడంత అవుతోందట. అధికారంలో ఉన్నంత సేపు.. మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో చెలరేగిపోయిన మేడంగారు.. ఇటు అధికారుల నుంచి అటు సామాన్యుల వరకూ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారట. ఈ విషయంలో ఆమె, ఆమె అనుచరులు అస్సలు కాంప్రమైజ్ కాలేదనీ అంటారు. ఇందుకు సొంత పార్టీ కార్యకర్తలు సైతం.. అతీతం కాదని కూడా చెబుతుంటారు. వారినీ వదలక వేధింపులకు గురి చేశారనీ అంటారు.
నలుగురు అనుచరులతో కోటరీ కట్టిన రజనీ
పవర్ లో ఉండగా మేడం గారి పనితనం పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ.. ఇప్పుడే ఒక్కో తెర తొలుగుతోందట. మేడంగారి రేంజ్ ఏంటంటే.. పార్టీకి ఎన్నేళ్ల పాటు మీరు పని చేశారు? ఎంత నిబద్ధతతో పని చేశారని అస్సలు చూడరట. తాను చెప్పింది చెప్పినట్టు చేయకుంటే.. బాహుబలి శివగామీలా శివాలెత్తిపోయేవారట. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే కోటరీ మెయిన్ టైన్ చేయడంలో రజనీ మేడం రేంజే వేరట. ఇక మంత్రిగానూ జాక్ పాట్ కొట్టడంతో.. మేడంగారి మాయలు మరింత ముమ్మరంగా తయారయ్యాయట. అంతగా తన చుట్టూ ఓ నలుగురితో కూడిన కోటరీ ఏర్పరుచుకుని.. తద్వారా ఒక ఆట ఆడేసుకున్నారట. ఆనాటి రజనీ మేడంగారి లీలలు నేటి కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయట. ఆమె పై కఠిన చర్యలు తీస్కోమంటూ.. సామాన్యుల నుంచి కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయట. ఒక సమయంలో కొందరు అనుచరులు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చంటారు.
తాజాగా పత్తిపాటిపై విసిరిన సవాళ్ల పైనా పెద్ద ఎత్తున చర్చ
దీంతో వైసీపీ మాజీ మంత్రుల్లోనే భారీ ఎత్తున కేసులు ఎదుర్కుంటున్న టాప్ మోస్ట్ పర్సనాల్టీగా రజనీ మేడం సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నారట. అసలు మేడంగారు ఏ విషయంలోనైనా తగ్గేదే లే అంటారనీ.. దీంతో ఆమె అవినీతి బాగోతాల్లోనూ కొత్త చరిత్ర లిఖిస్తున్నారనీ పార్టీ వర్గాలవారే చెవులు కొరుక్కుంటున్నారట.
రజనీ గుంటూరుకు వెళ్లడంతో రోడ్డున పడ్డ కార్యకర్తలు
అధికారంలో ఉండగా చేసిన తప్పులతో చేసినట్టు ఉండక.. ఒకప్పటి రాజకీయ గురువు, ప్రస్తుత ప్రత్యర్ధి పత్తిపాటి పుల్లారావుకు విసిరిన సవాళ్లు సైతం ప్రస్తుతం పేటలో కొత్త చర్చకు తెరలేపాయట. రజనీ పేటలో గెలిచి తిరిగి అక్కడ పోటీ చేయలేక పోవడానికి గల కారణం ఆమె సాధించిన చెడ్డ పేరేనట. దీంతో మూటా ముల్లె సర్దుకుని.. గుంటూరుకు వెళ్లడంతో ఆమెను నమ్ముకున్న కార్యకర్తలు రోడ్డున పడ్డారట. దీంతో వీరు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారట. అంతే కాకుండా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖరరెడ్డి సైతం పార్టీకి దూరం కావడంతో.. ఆ వర్గం ద్వారా మరో కొత్త సవాల్ ఎదురవుతోందట.
మర్రి పార్టీకి దూరం కావడంతో మరో సమస్య
ప్రెజంట్ చిలకలూరిపేట రాజకీయ స్థితిగతుల రీత్యా.. పత్తిపాటి ఎంతో బలంగా ఉన్నారు. ఆయన్ని ఎదుర్కోవడం ఒక సవాల్ అయితే.. తమ సొంత పార్టీ లీడర్ మర్రి రాజీనామా చేయడం మరో ఛాలెంజింగా తయారైందట. వీటన్నిటికి తోడు.. గతంలో రజనీ, ఆమె అనుచరగణం చేసిన అరాచకాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండటంతో.. ఒకరకంగా ఆమె పద్మ వ్యూహంలో చిక్కారట. రజనీ ఇద్దరు పీఎస్ లపైన అవినీతి ఆరోపణలు వెలుగు చూడ్డంతో పాటు.. సొంత కుటుంబంలోని మరిది, మావయ్య పై కూడా అనేక కేసులు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. వీటన్నటితో రజనీమేడం.. అధినేతకన్నా ఎక్కువ కష్టకాలాన్ని ఫేస్ చేస్తున్నట్టు ఫీలవుతున్నారట.
సొంత మరిది, మావయ్య పై కూడా అనేక కేసులు, ఆరోపణలు
అప్పటికీ మేడంగారు ఎంతో నేర్పుగా.. పాత కాపురం చక్క దిద్దే పనిలో పడ్డారట. అందులో భాగంగా దూరమైన పార్టీ కార్యకర్తలను దగ్గరకు చేర్చే యత్నం చేస్తున్నారట. ఈమె వారిని నమ్మినా.. వారు మాత్రం ఈమెను నమ్మడం లేదట. దీంతో మేడంగారికి ఇది మరో సవాల్ గా తయారైందట.
సోషల్ మీడియా ఇంఛార్జ్.. దొడ్డ గాంధీ సైతం అరెస్టు
ఇటీవల విడదల రజనీ.. సోషల్ మీడియా ఇంఛార్జ్.. దొడ్డ గాంధీ సైతం అరెస్టు కావడం, తనపై కూడా అనేక కేసులు నమోదవ్వడంతో.. ఎటు నుంచి ఎటు చూసినా ఉచ్చు బిగుస్తోందట. దీనంతటికీ కారణం మేడం గారి స్వయం కృతాపరాధమేనంటున్నారు పార్టీలోని ఒక వర్గం నేతలు. అధికార దుర్వినియోగం.. పార్టీ కార్యకర్తలను సైతం లెక్క చేయకపోవడం.. ఆనాడు ఆమె చేసిన స్వైర విహారంతో నేడీ దుస్థితి దాపురించిందని అంటున్నారు. చేసుకున్న పాపం- నెత్తికింద దీపంగా మారడం ఖాయమనీ చెబుతున్నారట.. పేట పొలిటికల్ వర్గాల్లో. మరి చూడాలి.. వీటన్నిటి నుంచి మేడంగారు ఎలా బయట పడతారో.. తెలియాల్సి ఉందంటున్నారు.