బంగ్లాదేశ్ క్రికెట్ లో విషాదం:
Tamim Iqbal: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ {36} గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ సందర్భంగా సోమవారం సావర్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తమీమ్ కి ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తమీమ్ ఇక్బాల్ కి గుండెపోటు వచ్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ డేబాషిష్ చౌదరి ధ్రువీకరించారు.
Also Read: deepak chahar: దీపక్ చాహర్ ను కొట్టిన ధోని…ఫన్నీ వీడియో ఇదిగో
ప్రస్తుతం తమీమ్ ఇక్బాల్ కి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాడు. ఢాకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినెపుకర్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మదన్ క్లబ్ కెప్టెన్ గా ఉన్న తమీమ్ ఇక్బాల్ టాస్ కోసం మైదానంలోకి వచ్చాడు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా అతడు ఉన్నట్టుండి చాతిలో నొప్పితో బాధపడ్డాడు. దీంతో స్థానికంగా ఉన్న ఫజిలాతున్నెసా ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో అతడికి స్వల్ప గుండెపోటు వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే ఢాకా లోని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ ని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్దకి వెళుతుండగా మరోసారి గుండేపోటు రావడంతో తిరిగి మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమీమ్ ఇక్బాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొదట జూలై 2023లో తమీమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. కానీ అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకొని.. రిటైర్మెంట్ ప్రకటనని వెనక్కి తీసుకోవాలని కోరడంతో తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఏడాదిన్నర తరువాత ఈ ఏడాది ప్రారంభంలో మళ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులోకి తిరిగి రావాలని కోరినప్పటికీ బంగ్లాదేశ్ మేనేజ్మెంట్ అభ్యర్థనను తమీమ్ తిరస్కరించాడు.
Also Read: Harbhajan Singh – Jofra Archer: ఆర్చర్‌పై భజ్జీ జాత్యహంకార కామెంట్స్… బ్లాక్ టాక్సీ మీటర్!
తాను ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని.. ఇక జాతీయ జట్టుకు ఆడేది లేదని స్పష్టం చేశారు. తనని మళ్లీ జట్టులోకి తీసుకోవాలని ఆలోచించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమీమ్ ఇక్బాల్ తన కెరీర్ లో బంగ్లాదేశ్ కి 70 టెస్ట్ లు, 243 వన్డేలు, 78 టీ-20 లు ఆడాడు. టెస్టుల్లో 5134 పరుగులు, వన్డేల్లో 8,357 పరుగులు, టి-20 ల్లో 1778 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ నుండి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో తమీమ్ ఇక్బాల్ ఒకరు. అయితే తమీమ్ ఇగ్బాల్ గుండెపోటుకు గురయ్యాడు అన్న విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న అతడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.