Adala Reddy: నెల్లూరు పెద్దారెడ్లు.. ఈ పేరు వినని తెలుగు ప్రజలు ఉండరు. ఆ పెద్దా రెడ్లలో ఒకరు అనిపించుకున్న నెల్లూరు వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చక్రం తిప్పే ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా గెస్ట్ రోల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఓటమి తర్వాత ఆయన సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ఆదాల వైసీపీ స్టైల్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఆదాల వారు ఎప్పుడో ఒకసారి ఆ జిల్లాకు వచ్చి తన ముఖ్యమైన సన్నిహితులతో కాసేపు మాట్లాడి తిరిగి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారంట. అలా వచ్చి అలా గెస్ట్ లా వెళ్ళిపోతున్న ఆ నేతను మళ్ళీ యాక్టివ్ చేసేందుకు మరో నెల్లూరు పెద్దారెడ్డి మాజీ మంత్రి కాకాణి ప్రయత్నం చేస్తున్నారట. ఎంపీగా పోటీ చేయమని ఆ మంత్రి సలహా కూడా ఇచ్చారట.. మరి ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు పాలిటిక్స్‌లో తిరిగి యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందా?
రాజకీయాలకు పురిటి గడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్లు ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారు. అప్పుడెప్పుడో వచ్చిన ఓ సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డి పేరు మార్మోగింది. అప్పటినుంచి ఇప్పటివరకు నెల్లూరు పెద్దారెడ్లు అంటే రాష్ట్రంలోనే ఫేమస్. వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకరు.. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా జాతీయ, ప్రాంతీయ పార్టీలలో పనిచేసిన ఆయన ఇప్పుడు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నే అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంటును ఆదాలను ఓడించడం ద్వారా గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రేక్ చేశారు.
ఓటమి తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి పాలిటిక్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా మూడు పార్టీల్లోనూ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ హోదాల్లో ఆదాల నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాంతో ఆయన ఎన్నికల ప్రచారం కూడా జోరుగానే కొనసాగించారు. ఓ రోజు ఉదయం ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో .. ఓ ఫోన్ కాల్ రాగానే ప్రచారాన్ని పక్కనపెట్టి, అమరావతికి వెళ్లి సాయంత్రానికి టీడీపీ కండువా తీసేసి వైసీపీ కండువాతో నెల్లూరులో ఎంట్రీ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి గా మారిపోయారు.
దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆదాల అనుచరులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇంతలో టీడీసీ అధిష్టానం అప్పటి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపి ఓటమిపాలైం. అటు నెల్లూరు నుంచి వైసిపి ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.. కట్ చేస్తే… ఎంపీగా ఆదాల బాధ్యతలు తీసుకున్నాక తన నమ్ముకున్న కార్యకర్తలకు ఆయన పెద్దగా అండగా నిలబడలేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అప్పటి రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆదాలకు మధ్య గట్టి వార్ నడిచింది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసిపితో విభేదించి, జగన్‌పై నిప్పులు చెరుగుతూ ఎన్నికలకు 16 నెలలు ముందు టీడీపీలోకి వచ్చేసారు. ఆయన బాటలోనే ముఖ్య అనుచరులంతా పసుపు కండువా కప్పుకున్నారు. ఆదాలతో వెళ్లిన కొంతమంది వైసీపీ నేతలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై రకరకాల పోస్టింగులు పెట్టడం, వ్యతిరేకంగా పనిచేయడం చేశారు. 2024 ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. వాస్తవానికి అంతకుముందే ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాలు గట్టిగా చేశారట. కానీ ప్రస్తుత మంత్రి, యువనేత నారా లోకేష్ అందుకు పూర్తిగా వ్యతిరేకించారట.
గత ఎన్నికలలో గత్యంతరం లేక వైసీపీ తరఫున రూరల్ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి..టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. గత ఎన్నికల సమయంలో తనని నమ్ముకొని పనిచేసిన వారిని నట్టెట్ట ముంచేశారన్న అపవాదును సైతం మూట కట్టుకున్నారు. గత ఎన్నికల్లో తనను నమ్ముకున్న అనేకమందిని నడిరోడ్డుపై వదిలేసి, ప్రస్తుతం గెస్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అనుచరులు కొందరు ప్రస్తుత రూరల్ ఇంచార్జ్ విజయ్ కుమార్ రెడ్డితో కలవలేక.. దిక్కుతోచని స్ధితిలో ఉండిపోయారంట. అన్ని రాజకీయ పార్టీలతో పరిచయాలున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పొలిటికల్ గా సైలెంట్ గా ఉండడంతో అతని అనుచరులు తీవ్ర ఆవేదనలో ఉన్నారట.
వైసీపీలోనే కొనసాగుతున్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాలకి హాజరు కాకపోవడం పై ఆయన పొలిటికల్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పరామర్శలు, శుభకార్యాలకి ఆయన పరిమితమైపోయారట.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో బీజేపీలోకి వెళ్తారని మొదట్లో ప్రచారం జరిగింది.. కానీ ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.. అప్పుడప్పుడు గెస్ట్‌లా నెల్లూరు జిల్లాకి వస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి.. తన వర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలను కలిసి వెళ్లిపోతున్నారంట. వారితోనే టచ్‌లో ఉంటున్నారంట. నెల్లూరుకు వచ్చినా పార్టీ నేతలను ఎవరిని కలవడం లేదని, ఆయన్నే నమ్ముకున్న తాము .. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అనుచరులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ క్రమంలో మాజీమంత్రి కాకాణిగోవర్ధన్‌రెడ్డిని ఆయన కలవడం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జిల్లా రాజకీయాలలో దూకుడుగా వ్యవహరిస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకి పూర్తిగా దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఆయనకు ఉందా..లేదా అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరోవైపు వైసీపీలోనే కొనసాగుతూ ఈసారి ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆదాల ఆలోచిస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో వైసీపీని యాక్టివ్ చేయడంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలకంగా పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్‌గా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. దాంతో రూరల్ సీటు ఆదాలకు లేనట్లే అని స్పష్టమైంది. మరోవైపు ఇదే రూరల్ నియోజకవర్గానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వస్తారనే ప్రచారానికి కూడా కాకాణి బ్రేక్ వేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైసీపీ కి అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలు ఉన్నారు. అయితే నెల్లూరు పార్లమెంటుకు మాత్రం ప్రస్తుతానికి ఇన్చార్జి ఎవరు లేరు. ఈ క్రమంలో మాజీ మంత్రి కాకాణి భేటీ సమయంలో ఆదాలను మళ్లీ యాక్టివ్ కావాలని కోరారట..రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని కాకాణి వ్యక్తం చేశారట..
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ఆదాలకు బంధుగణం, అనుచర గణం ఉంది. ఈ క్రమంలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశంలో వైసీపీ జిల్లా నాయకత్వం ఉందట. అందులో భాగంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని ఆదాలకు సూచించారంట. ఈ సమయంలో ఆదాల తాను వైసీపీలోనే కొనసాగతానని.. కానీ తమ కూతురుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని.. తన రాజకీయ వారసురాలిగా ప్రమోట్ చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలలో రూరల్ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి.. మరోసారి ఎక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిని చూపక పోవడం..తమ కూతుర్ని రాజకీయ వారసురాలుగా తీసుకురావాలన్న కోరిక బలంగా ఉండడంతో ఆదాల పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వైసిపిలో ఎవరు సరైన అభ్యర్థి కూడా లేకపోవడంతో పాటు..విస్తృతమైన పరిచయాలు, ఆర్ధికంగా బలమైన నేత కావడంతో మరోసారి వైసీపీ ఆదాలనే నమ్ముకుందన్న టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి వారిద్దరి భేటీలో ఆదాల పార్టీలోనే ఉంటారన్న క్లారిటీ మాత్రం వచ్చిందని వైసీపీ శ్రేణులు ఆనందపడాల్సి వస్తోందంట. నెల్లూరు పెద్దారెడ్లు అంటే రాజకీయాల్లో తలపండినవారు. అలాంటి పెద్దారెడ్డిలలో ఒకరైన ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సింది పోయి… పరాజయం తర్వాత తెరమరుగు అవడం సరైన పద్ధతి కాదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కూతురి పొలిటికల్ కెరీర్ కోసం కలలు కంటున్న ఆదాల క్యాడర్‌కు ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి.
Story by: Apparao, Big Tv