Ambati Mounika: ప్రస్తుతం వైసీపీలో హీరో అనిపించుకుంటున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె.. తండ్రి అరెస్ట్ సమయంలో గట్టిగా వాయిస్ వినిపించారు. బూతులతో చెలరేగిన తండ్రిపై ఎన్ని విమర్శలు వచ్చినా సింగిల్‌గా నిలబడి కౌంటర్ ఇచ్చింది. ఆమె వాక్చాతుర్యం, ధైర్యసాహసాలు చూసి వైసీపీ క్యాడర్ పొంగిపోయింది. నెక్స్ట్ ఎమ్మెల్యే చిన్నమ్మే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా స్టార్ట్ చేసేసింది. కట్ చేస్తే.. జైల్ నుంచి బెయిల్ పై వచ్చిన అంబటి తన కుమార్తె ఫ్యూచర్‌పై చేసిన వ్యాఖ్యలతో కంగుతిన్నారట కార్యకర్తలు. ‘మనం ఏదో ఊహించుకుంటే ఈయనేంటి ఇలా అంటున్నారు’అంటూ అయోమయంలో పడిపోయారట. ఇంతకీ అంబటి తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పై ఆయన చేసిన వ్యాఖ్యలేంటి?
గుంటూరు జిల్లా వైసీపీలో ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నాయంట. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం వైసీపీ శ్రేబుల్లో గుబులు పుట్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో ఈ ఏడాది జనవరి 31 న అర్ధరాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరులో ఆయన నివాసం వద్దే నాటకీయ పరిణామాల నడుమ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ తెలిసిందే. దాదాపు 18 రోజులు పలు కేసుల్లో అంబటి రిమాండ్ ఖైదీగా జైల్ లో గడిపారు. ఎట్టకేలకు బెయిల్ పై బయటకు వచ్చారు.
అయితే అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన రోజు నుంచీ ఆయన కుమార్తె అంబటి మౌనిక తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ పొలిటికల్‌గా బానే ఫోకస్ అయ్యారు. అంబటి అరెస్ట్ తర్వాత మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చి తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ ధ్వజమెత్తారు. ఇక ఆరోజు నుంచీ మౌనిక మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా అంబటి రాంబాబు అరెస్ట్ చేసిన రోజు గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి ఇంటి వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు అంబటి మౌనిక ఎమ్మెల్యే గల్లా మాధవి పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. “ఓ మహిళ అయి ఉండి ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా దగ్గరుండి దాడి చేయిస్తావా” అంటూ ఫైర్ అయ్యారు.
ఆ తర్వాత మౌనిక చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి కూడా ఘాటుగానే స్పందించారు. అలా కొద్దిరోజుల పాటు ఎమ్మెల్యే మాధవి వర్సెస్ అంబటి మౌనికల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో అంబటి రాంబాబు జైల్లో ఉండగానే అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ పై చర్చ మొదలయ్యింది. సోషల్ మీడియాలో కూడా అంబటి కుటుంబం నుంచి మరో ఫైర్ బ్రాండ్ వచ్చేసింది అంటూ ప్రచారం ఊపందుకుంది.
వాస్తవానికి టీడీపీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బలమైన స్థానం. గడచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ జెండానే ఎగిరింది. 2024 ఎన్నికల్లో గల్లా మాధవి.. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన విడదల రజనీ పై పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మాధవి దూకుడుగా ముందుకెళ్తున్నారు. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరింత బలంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవాలి అంటే కచ్చితంగా బలమైన మహిళా అభ్యర్థినే దించాలి అనే టాక్ మొదలయింది.
గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన వైసీపీ మాజీ మంత్రి తిరిగి చిలకలూరిపేట ఇన్చార్జ్‌గా వెళ్లిపోయారు. దాంతో గుంటూరు పశ్చిమ వైసీపీ ఇంచార్జిగా గంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి కొనసాగున్నారు. అంబటి అరెస్ట్ వ్యవహారంతో ఆమె కుమార్తె మౌనిక ఫ్రేమ్ లోకి రావడంతో ఇపుడు కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో గల్లా మాధవి పై అంబటి మౌనిక ను బరిలో దింపితే కచ్చితంగా గెలుస్తాం అని ఫీల్ అవుతున్నారట వైసీపీ కార్యకర్తలు. క్యాస్టు ఈక్వేషన్స్ కూడా కలిసొస్తాయి కాబట్టి మౌనిక నే కరెక్ట్ అనే వాదనను తీసుకొస్తున్నారట కేడర్.
వాస్తవానికి అంబటి రాంబాబు ముందు నుంచీ తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. గతంలో ఎన్నికల సందర్భంలో ఆయన కుమార్తెలు తండ్రి తరఫున సత్తెనపల్లిలో ప్రచారం చేయడం మాత్రమే చూశాం. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ పేర్లు వినిపించలేదు. రాంబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో కూడా మౌనిక తమ కుటుంబంపై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు తప్ప అందులో ఎక్కడా రాజకీయ కోణం కనిపించలేదు.
అయితే ఆమె ధైర్యసాహసాలు, వాక్చాతుర్యం చూసి అంబటి వారసురాలు మౌనికే అనే టాక్ మొదలయింది. అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నేతలు కూడా మౌనిక ను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ చర్చ మరింత ఊపందుకుంది. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. రాంబాబు జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి అయోమయంలో పడ్డారట కార్యకర్తలు.
రాంబాబు జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలుసార్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. “నేను రాజకీయాల్లో ఉన్నా కదా.. నేను లేకపోతే అప్పుడు చూద్దాం.. ఇప్పటికైతే నేనే” అంటూ బదులిచ్చారు. దీంతో అంబటి మౌనిక పొలిటికల్ ఎంట్రీ పై ఆశలు పెట్టుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులకు షాక్ తగిలినట్లైంది. నిజానికి అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మౌనిక పేరు వినిపించలేదు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కోరుకున్నా ఆమె రాజకీయాల్లోకి రావడానికి సుముఖంగా ఉన్నారా లేదా?.. అసలు అంబటి రాంబాబు కు కుమార్తెలను రాజకీయాలోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా లేదా? అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇటీవల అంబటి చేసిన వ్యాఖ్యలు బట్టీ చూస్తే .. దాదాపు 68 ఏళ్ల వయసున్న అంబటి ఇంకొన్నాళ్లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది.
ఇప్పటికే వైసీపీ 2029 ఎన్నికలకు వ్యూహ రచనలు చేస్తోంది. అంబటి అరెస్ట్ వ్యవహారం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుంటూరు వెస్ట్ లో గెలిచి చూపించాలని కంకణం కట్టుకుంది వైసీపీ. మరి రాబోయే ఎన్నికల్లో మరోసారి మళ్ళీ అంబటికే అవకాశం ఇస్తారా? లేదా పొలిటికల్ ఈక్వేషన్స్ లో అందరూ అనుకున్నట్టు మౌనికను బరిలో దించుతారా? అందని ద్రాక్షగా మారిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియాలి అంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Also Read:
Story by: Apparao, Big Tv