CM Progress Report: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలి మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌ని సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి.. వారికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. జరిగిన విషాదం మర్చిపోలేనిదని, కలిగిన నష్టం భర్తీ చేయలేనిదని అన్నారు. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సైతం పరామర్శించారు. ప్రభుత్వపరంగా అందించాల్సిన సాయం అందిస్తామని తెలిపారు.
విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో.. 14 ఏళ్ల బాలికలకు అందించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు దీనిని ఇస్తున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు రావివలసలోని పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితులు, ఆదాయ మార్గాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించారు. మరో కుటుంబానికి ఉద్యాన పంటల సేద్యంలో తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. రావివలస గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని, ఇప్పటికే సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డుల నమోదు చేపట్టామన్నారు. త్వరలో ఏఐ డాక్టర్ ద్వారా రోగులకు ప్రాథమిక అంశాల్లో సందేహాలు తీరుస్తామని, అవసరమైతే చికిత్స కూడా జరిగేలా చూస్తామన్నారు. ఇక.. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయన్నారు సీఎం. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తయితే.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పీ-4 రూపొందించినట్లు సీఎం మరోసారి స్పష్టం చేశఆరు. అధికారులు ఎంపిక చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శితో సీఎం ప్రజావేదికపై మాట్లాడారు. చీపురుపల్లి మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు హారిక, అఖిల రెండేళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయారు. వాళ్లిద్దరూ.. తాత, నానమ్మ సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్నారు. వీరికి ఉద్యోగం లభించే వరకు మార్గదర్శిగా ఉండేందుకు సాయిరాజు ముందుకొచ్చారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల పేరిట చెరో 3 లక్షల చొప్పున బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను చాటి చెప్పే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, టీవీ, థియేటర్ అవార్డులను త్వరలోనే ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి జ్యూరీ ఏర్పాటు, వేదికలు, తేదీలపై.. సీఎం చంద్రబాబుతో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించేలా నూతన ఫిల్మ్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో.. ఆయా పర్యాటక ప్రాంతాల పేర్లను తెరపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోనున్నారు. సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ స్టూడియోల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం సహకారం అందించనుంది. స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డేటా బ్యాంక్ రూపొందించనున్నారు.
రాజధాని అమరావతిలో ఆర్-1జోన్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్-1 జోన్‌లో భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి సీఆర్డీఏ గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీలో కొన్ని సవరణలు చేసింది. గతంలో ఆర్-1జోన్‌లో ఇళ్లు, భవనాలు సహా స్థలాలు కోల్పోయిన వారికి.. ఆయా కట్టడాల విలువకు రెట్టింపు పరిహారం ఇచ్చేవారు. అలాగే, సీఆర్డీఏ స్థలానికి బదులుగా, దాని విస్తీర్ణానికి దగ్గరగా ఉన్న స్థలాన్ని ఎల్‌పీఎస్ లేఔట్‌లో ఇచ్చేవారు. దీనివల్ల.. వాళ్లందరికీ నష్టం జరుగుతోంది. ఇకపై.. ఆర్-1జోన్‌లో కోల్పోయిన స్థలానికి సమాన విస్తీర్ణంలో స్థలం కేటాయించేలా నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్-1జోన్‌లో కోల్పోయిన స్థలం చిన్నదైతే.. ఎల్‌పీఎస్ లేఔట్లలో అంత చిన్న స్థలాలు ఇవ్వలేకపోతే మరో నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక స్థలాన్ని కేటాయించేలా వెసులుబాటు కల్పించారు. ల్యాండ్ టు ల్యాండ్ విధానంలో గరిష్ఠంగా 3 ప్లాట్ల వరకు పొందే అవకాశాలున్నాయంటున్నారు. స్థలం వద్దని భావిస్తే టీడీఆర్ బాండ్లూ తీసుకోవచ్చు. ఆర్-1 జోన్‌లో కమర్షియల్, ఇండస్ట్రియల్ భవనాలు కోల్పోతున్నవారికి.. ఆ కట్టడాల విలువకు రెట్టింపు చెల్లిస్తారు.
శ్రీకాకుళంలో మంచినీరు కలుషితం అవడం వల్ల ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా కొందరు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ వారం రివ్యూ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. కలుషితం కాని, సురక్షిత తాగునీటి సరఫరాకు మున్సిపల్ శాఖ నిర్దిష్ట ప్రమాణాలను జారీ చేసింది. పట్టణాలు, నగరాల్లో తాగునీరు కలుషితమైతే ఉపేక్షించేది లేదని, మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తాగునీటి పైపులైన్లు తనిఖీ చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు.. ఈ వారం మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. 456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నమూనా పరిశీలన తర్వాత.. పనులపై అధికారులతో రివ్యూ చేశారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. మార్కాపురం ప్రజావేదిక సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని.. పూర్తి చేసే అవకాశం కూడా తనకే వచ్చిందని చెప్పారు. రైతులు పండ్ల తోటలు పెట్టేలా ప్రోత్సహిస్తామని, మార్కాపురంని ఉద్యానవనంగా మారుస్తానని తెలిపారు చంద్రబాబు. రాయలసీమలో హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని అన్నారు సీఎం. 13 వందల కోట్లతో మార్కాపురం జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పునర్వైభవం రావాలంటే అంతా సహకరించాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. మార్కాపురం, పోలవరంని జిల్లాలుగా చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ వారం జరిగిన క్యాబినెట్ భేటీలో.. మొత్తం 55 అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో టూరిజం ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే.. సోలార్, హైడ్రో, హైబ్రిడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. ఇక.. రాజమండ్రిలో కల్తీ పాలు, శ్రీకాకుళంలో డయేరియా ఘటనల్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలను అభివృద్ధి చేయాలని నిర్ణయిచారు. విశాఖలో 2 వేల 387 కోట్లతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం రివ్యూ చేశారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా మంచినీటి పైపు లైన్లు దెబ్బతిని డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు.
ప్రభుత్వ సేవలను సులభతరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు, అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఈవారం సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో చక్కగా పని చేస్తూ ప్రజల మెప్పు పొందిన ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. బాగా పనిచేస్తున్న ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు ఇవ్వడమే కాకుండా, వారి వ్యక్తిగత రికార్డుల్లో కూడా వీటిని నమోదు చేయాలని ఆదేశించారు.
Story by: Anup, Big Tv