Amaravathi: అమరావతి అంటే ఎవ్రీథింగ్ అనేట్లుగా నిర్మాణాలు రాబోతున్నాయి. గత ఐదేళ్లు పనులు మూలన పడడం, తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. తాజాగా కార్యాలయం ఏర్పాటుకు ఆర్బీఐ మళ్లీ కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బిల్డింగ్ పనులూ క్లైమాక్స్ కు చేరుతున్నాయి. అటు కొత్త రైల్వే లైన్, ఐకానిక్ బ్రిడ్జి విషయంపై మంతనాలు జరుగుతున్నాయి. అమరావతికి రైల్వే కనెక్టివిటీకి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఓఆర్ఆర్ అలైన్ మెంట్, డీపీఆర్ పై కసరత్తు జరుగుతోంది.
2028లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమరావతి రూపురేఖలన్నీ మారిపోవడం ఖాయమైంది. వరల్డ్ క్లాస్ సిటీగా కనిపిస్తుంది. ఇది నిజమే అని చెప్పడానికి వస్తున్న నిధులు, జరుగుతున్న పనులే నిదర్శనం. ఇంకోవైపు కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్. రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పం ఉంది. ఇంకేం కావాలి. అమరావతిలో బిల్డింగ్ లే కాదు.. అన్ని రకాల కనెక్టివిటీకి రూట్ క్లియర్ అవుతోంది. మొన్నటికి మొన్న రైల్వే కనెక్టివిటీకి కేంద్ర రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర 2245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పనులు వేగంగా పట్టాలెక్కనున్నాయి.
ఓవైపు భూసేకరణ మొదలు పెట్టడంతో పాటు, మరోవైపు టెండర్లు పిలిచి, పనులు మొదలుపెట్టేందుకు వీలు కలిగినట్లయింది. ఇప్పటికే డీపీఆర్‌కు రైల్వే బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఈ లైన్‌కు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలోని దాదాపు 450 హెక్టార్ల భూసేకరణ చేయనున్నారు. 160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వే లైన్ రాబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు. దాములూరు- వైకుంఠపురం మధ్య వంతెనను నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జిని ఐకానిక్ గా నిర్మించాలని కేంద్రాన్ని కోరారు సీఎం చంద్రబాబు. అమరావతి రైల్వే స్టేషన్‌ను దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా, మోడల్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. అమరావతి స్టేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
అమరావతిలో కొత్త రైల్వేలైను వెళ్లే వడ్డమాను, వైకుంఠపురం తదితర గ్రామాల రైతులు తమ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లాలా, లేక సేకరణ ద్వారా తీసుకోవాలా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో నిర్ణయించినట్టు ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఈస్ట్, వెస్ట్ బైపాస్ ల నిర్మాణం చేయనున్నారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్‌రోడ్- ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ ఖరారుతో పాటు, డీపీఆర్ తయారీ పనులు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో.. భూసేకరణ సహా ఖర్చంతా భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
Also Read: పిఠాపురంపై పవన్ స్పెషల్ ప్లాన్.. అదే జరిగితే ఊరంతా పండగేనట.. అదేమిటో తెలుసుకుందాం!
సర్వేలు పూర్తిచేసి ఏడాదిలో డీపీఆర్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 189 కిలోమీటర్లు ఉన్న ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ ను 2018లో రూపొందించారు. ఇప్పటికే ఆరేళ్లు కావడంతో.. ఎలైన్‌మెంట్ ను మరోసారి పరిశీలించేందుకు డ్రోన్ వీడియోలు తీస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, మచిలీపట్నం, అనంతపురం.. నుంచి వచ్చే వాహనాలు.. ఓఆర్‌ఆర్‌లో ఎక్కడ ప్రవేశించి, ఎంత దూరం వెళ్లి.. ఇతర మార్గాల్లోకి మళ్లే అవకాశాలు ఉన్నాయనేది చూసేందుకు ఆరిజన్ అండ్ డెస్టినేషన్ సర్వే చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌పై రోడ్లు దాటేచోట చేపట్టాల్సిన నిర్మాణాలు, కృష్ణానదిపై 2 భారీ వంతెనలు, రైల్వేక్రాసింగ్స్ వద్ద వంతెనలు, 2 సొరంగాలు, కాల్వలు, వంటి వివరాలన్నీ డీపీఆర్‌లో రెడీ చేయనున్నారు. ఏడాదిలో డీపీఆర్ రెడీ అయ్యే నాటికి 90% భూసేకరణ పూర్తయితే, వెంటనే టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.
మొన్నటికి మొన్న క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్.. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై చర్చించారు. విశాఖపట్నంలో గోల్ఫ్ క్లబ్ ఇప్పటికే ఉంది. అయితే ఇలాంటిదే రాజధాని అమరావతిలోనూ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైనే కపిల్ దేవ్ ఉండవల్లి వచ్చి చర్చించారు. దేశంలో ఇప్పటికే క్రికెట్ బాగా డెవలప్ అయిందని, మిగితా క్రీడలు కూడా డెవలప్ కావాల్సి ఉందంటున్నారు. సో అమరావతిలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
అటు అమరావతిలో ఆర్బీఐ రీజినల్ ఆఫీస్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2022 ఆగస్టు 22 నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తోంది. అయితే అంతకు ముందే.. అంటే 2016లోనే నాటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఆర్బీఐ రీజినల్ ఆఫీస్, నివాస సముదాయాల ఏర్పాటుకు 11 ఎకరాల భూముల్ని కేటాయించింది. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటే ఆర్‌బీఐకి కూడా అప్పట్లో నిర్ణీత ధరపై 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. కానీ వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణాలు ఆగిపోవడంతో అనిశ్చితి ఏర్పడింది. ఒక దశలో విశాఖకు ఆర్బీఐ రీజినల్ ఆఫీస్ వెళ్లేందుకు ఏర్పాట్లు జరిగాయి. కానీ అమరావతి నిర్మాణాలపై స్పీడప్ పెరగడంతో ఆర్బీఐ ఇక్కడే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆఫీసులు, ప్రఖ్యాత సంస్థలన్నీ తమ శాఖల ఏర్పాటులో బిజీ అవుతున్నాయి. మూడేళ్లలో అమరావతి కథ మారడం కన్ఫామ్ అవడంతోనే ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి.