AP Rajya Sabha elections 2026: ఏపీలో త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల కోసం కూటమి నేతలు ఇప్పటి నుండే కర్చీఫ్‌లు వేసుకుంటున్నారంట.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల్లో రాజ్యసభ ఆశావాహనులు ఉండడంతో ఈసారి పెద్దల సభకి ఎవరు వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది.. జనసేన రాజ్యసభ కోసం ఎవరిని బరిలో దింపబోతోంది? బిజెపి కూడా ఓ సీటు ఇవ్వాలని బలమైన ప్రతిపాదన పెట్టబోతుందా? ..ఇంతకీ రాజ్యసభ స్థానాలపై టీడీపీ వ్యూహం ఏంటి ?
ఏపీలో రాజ్యసభ కోలాహాలం మొదలైంది..ఈ ఏడాది జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఇప్పటి నుండే కూటమి నాయకులు రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతున్నారు. సాధారణంగా లోక్ సభ కంటే… రాజ్యసభ సీటుపైన ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు .. నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయని చాలామంది, రాజ్యసభ ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంటారు.. ఏపీలో కూటమికి భారీ మెజార్టీ ఉండడంతో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలని కూటమి అభ్యర్థులే కైవసం చేసుకోనున్నారు..
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నలుగురు సభ్యులకి ఆ పార్టీ రాజ్యసభ అవకాశం కల్పించింది.. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీ , మోపిదేవి వెంకటరమణ పదవులు దక్కించుకున్నారు… అయితే మోపిదేవి వెంకటరమణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయడంతో ఆస్థానాన్ని సానా సతీష్ కి కూటమి ఇచ్చింది.. ఇప్పుడు సతీష్‌తో సహా నలుగురు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. దీంతో ఏపీ నుంచి ఎవరికి రాజ్యసభ అవకాశం ఉంటుంది అనే చర్చ మొదలైంది..
అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ట్రెండ్స్ ను బట్టి నాలుగు స్థానాల్లో రెండు మళ్ళీ పాతవారికే తిరిగి ఇవ్వొచ్చు అనే చర్చ నడుస్తోంది.. పరిమల్ నత్వాని, సానా సతీష్‌లను తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.. వాస్తవంగా పరిమల్ నత్వాన్ని వైసీపీ హయాంలో ఏపీ నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు… ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీనికి సన్నిహితుడైన పరిమల్ నత్వాని పదవీకాలం జూన్‌తో ముగుస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపి తరఫున తిరిగి నత్వాని రాజ్యసభకు వెళ్లొచ్చనే ప్రచారం సాగుతుంది.. ఈ వ్యవహారంలో బీజేపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండటంతో ఆయనకి తిరిగి రాజ్యసభ సీటు దక్కడం ఖాయమంటున్నారు.
ఇక వాటితో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తరవాత… మోపిదేవి వెంకటరమణ స్థానంలో రాజ్యసభ స్థానాన్ని పొందిన సానా సతీష్ మరోసారి రాజ్యసభ పంపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.. కేవలం ఏడాదిన్నర మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడంతో, మళ్లీ సానా సతీష్‌కి అవకాశం ఇవ్వాలని లోకేష్, చంద్రబాబు నిర్ణయించారంటున్నారు. సానా సతీష్ విషయంలో మొదటి సారి రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పుడే, తర్వాత రెన్యూవల్ ఉంటుందన్న హామీ ఇచ్చారన్న టక్ నడుస్తోంది.. మొత్తం ఉన్న నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్లో పరిమల నత్వానీ, సానా సతీష్ పేర్లు దాదాపుగా ఖరారు అయ్యే అవకాశం ఎక్కువ శాతం కనపడుతుంది..
ఇక మిగిలిన రెండు రాజ్యసభ స్థానాలపైనే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. రెండు స్థానాల్లో జనసేన పార్టీ ఒక స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం… 2024 ఎన్నికల్లో శాసనసభ, శాసనమండలి, లోక్ సభల్లో ఒకేసారి అడుగుపెట్టిన జనసేన పార్టీకి.. రాజ్యసభ అందరి ద్రాక్ష లాగా ఉంది.. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా పూర్తిస్థాయిలో అన్ని చట్టసభల్లో ప్రవేశ పొందిన పార్టీగా గుర్తింపు కోసం జనసేన ప్రయత్నిస్తోది.. అందులో భాగంగా రాజ్యసభ స్థానం కోసం కర్చీఫ్ వేసినట్టు ప్రచారం నడుస్తోంది.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రాజ్యసభ సీటు వ్యవహారంపై ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది.
ఒక సీటు జనసేనకు ఇవ్వడానికి , చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా ప్రచార జరుగుతోంది.. అయితే జనసేన నుంచి రాజ్యసభ సభలో అడుగుపెట్టేది ఎవరన్న చర్చ నడుస్తోంది… జనసేన నుండి వ్యాపారవేత్త లింగమనేని రమేష్, జనసేన కార్యదర్శిగా ఉన్న సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌లతో పాటు మరొకరి పేరు కూడా వినపడుతోంది.. అయితే 2014 తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా జనసేన పార్టీకి, పవన్ కి అండదండలుగా ఉన్న లింగమనేని రమేష్ వైపే జనసేనాని మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ విషయంలో ఇప్పటికే కూటమిలో చర్చ కూడా జరిగినట్టు సమాచారం.
వాస్తవానికి నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకముందు, 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానాన్ని త్యాగం చేసిన సమయంలో… అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడిచింది.. అయితే నాగబాబుని ఎమ్మెల్సీని చేయడంతో పాటు, త్వరలోనే మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో…. ప్రస్తుతం ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్‌కే రాజ్యసభ స్థానం దక్కే అవకాశముందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
ఇక మిగిలిన మరో స్థానాన్ని టీడీపీ తీసుకోవడం ఖాయమైందంట .. దాంట్లో భాగంగా టీడీపీ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయలు విజయ్ పేరు టిడిపి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. ఎన్నికల సమయంలోనే చింతకాయల విజయ్‌కి టిడిపి అధిష్టానం ఆ మేరకు హామీ ఇచ్చిందని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే టీడీపీ లో అనేక మంది సీనియర్స్ సైతం రాజ్యసభ సభ్యత్వం కోసంఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పని చేసిన సీనియర్స్ సైతం ఈసారి మాకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరుతున్నట్టు తెలుస్తుంది.. రాజ్యసభ కోసం పోటీ పడుతున్న వారిలో యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య లాంటి వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారంట..
రేసులో ఎంతమంది ఉన్నా అల్టిమేట్‌గా చంద్రబాబు, లోకేష్ నిర్ణయం తర్వాత.. రాజ్యసభ అభ్యర్థులు పేర్లు బయటికి వచ్చే అవకాశం కనబడుతోంది.. సాధారణంగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలో చాలా కసరత్తు తర్వాత మాత్రమే చంద్రబాబు అభ్యర్థులు ఎంపిక చేస్తూ ఉంటారు.. ఇప్పుడు ఖాళీ అవుతున్న అభ్యర్థుల పదవీకాలం ఇంకా 5 నెలలు ఉన్న నేపథ్యంలో… ఎక్కువ కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనబడుతుంది.. మరి ఈసారి రాజ్యసభకు వెళ్లే నాయకులెవరన్నది కూటమి పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.
Story by: Apparao, Big Tv