vizianagaram politics: ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచిన నేతలు తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటి అమలు కోసం అంతో ఇంతో కృషి చేస్తారు. అయితే విజయనగరం జిల్లాలో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం గెలుపు తర్వాత జనంలోకి రావడమే మానేశారంట. ఒకవైపు ప్రజలు హామీల అమలు కోసం ఎదురు చూస్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం ముఖం చాటేస్తున్నారంట. ఇక మాజీలైతే ప్రజలతో తమకేమీ పనిలేనట్లు వ్యవహరిస్తున్నారంట. కీలక సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పించి అలా కనపడకుండా పోవడంపై జనం ఆగ్రహంతో రగిలి పోతున్నారంట. అసలు సదరు నాయకుల లెక్కలేంటి?
ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయాలపై ప్రజలు విస్మయం
ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయాలపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు . ఈ ఎమ్మెల్యే పని తీరు బాగుంది అని కానీ… ఈ ఎమ్మెల్యే కంటే గత ఎమ్మెల్యే పని తీరు భేష్ అని మచ్చుకు కూడా ప్రజలు చర్చించుకోవడం లేదు.. ఎటు చూసినా జనంలో అసహనమే కనిపిస్తోంది. ఏ నియోజకవర్గంలో చూసినా తాజా, మాజీలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదని ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఓట్లు వేసి గెలిపిస్తే వీరు కూడా ఒకే తాను ముక్కల్లా తయారయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. అసలు గెలిచాక కొంతమంది ఎమ్మెల్యేలు గడప దాటి బయటకు రావడం లేదట. మరికొంతమంది పింఛన్లు పంపిణీ రోజున తప్ప మిగతా రోజుల్లో అడ్రస్ కూడా దొరకడం లేదట .
ప్రజలు నిలదీస్తారన్న భయంతో ముఖం చాటేస్తున్న తాజా, మాజీలు
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. అలా అని అందరి సమస్యలు తీర్చలేరు రాజకీయ నాయకులు .. మరి కొన్ని ముఖ్యమైన సమస్యలైనా తీర్చాలి కదా అంటున్నారు ప్రజలు . ప్రజలు ఎక్కడ సమస్యలతో వచ్చి పరిష్కరించమని నిలదీస్తారన్న భయంతోనే తాజా , మాజీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళడం లేదనే చర్చ జోరుగా నడుస్తోంది . ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కాస్త హడావిడి చేస్తుంటే .. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసలు మీతో మాకేంటి సంబంధం అన్నట్లు చూస్తున్నారట. సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం లేదంట. పార్వతీపురం, గజపతినగరం , నెల్లిమర్ల ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీలు గుప్పించారు. తాము ఆ హామీలు మర్చిపోలేదని, ఉపాధి కోసమే ఓట్లేసి వారిని గెలిపించామని జనం అంటున్నారు
సాప్ట్ వేర్ కంపెనీలు తీసుకొస్తానని హామీ ఇచ్చిన లోకం మాధవి
నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకొస్తామని అప్పట్లో ఆమె హామీ ఇచ్చారు. కంపెనీలు తెచ్చి నియోజకవర్గ రూపురేఖాల్ని మారుస్తానని చెప్పారు కదా, ఇప్పుడు కనిపించడం మానేసారేంటని ప్రజలు నిలదీస్తున్నారు. గజపతినగరం ఎమ్మెల్యే , మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై కూడా ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారట . ముఖ్యంగా ఎన్నారై వ్యవహారాలు కూడా చూసేది మన మంత్రే కాబట్టి కంపెనీలకు, ఉపాధికి కొదవ ఉండదని వారు ఆశగా ఎదురు చూస్తుంటే… ఆయన ఆ ఊసే ఎత్తడం లేదంట.
అక్రమాల వెలికి తీస్తామన్న విజయనగరం, పార్వతీపురం ఎమ్మెల్యేలు
విజయనగరం , పార్వతీపురం నియోజకవర్గాల ప్రజల ముచ్చట మరోలా ఉందట . అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతల తాట తీస్తామని ఇచ్చిన హామీ ఏమైందని సదరు నియోజకవర్గ కార్యకర్తలు , ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, వాటిని వెలికితీస్తామని ఎన్నికల ప్రచారాల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యేలకు జనం గుర్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ భూ కబ్జాలు, చెరువుల కబ్జాలకు పాల్పడ్డారని , వాటిని మళ్ళీ ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకువస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు అసలు ఆ మామీలను మర్చిపోయినట్లే వ్యవహరిస్తున్నారంట. దాంతో వైసీపీ వారితో మిలాఖత్ అయ్యారా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంట.
Also Read: ఆకాశంలో గూఢాచారి.. భారత్ న్యూ ప్లాన్.. పాక్‌కు చుక్కలే
విజయవాడలో ఉంటున్న సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణి
ఎస్. కోట , చీపురుపల్లిలో అసలు ఎమ్మెల్యేలు ఉన్నట్టా, లేనట్టా అన్నట్లు తయారైందంట పరిస్థితి. సాలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎక్కువగా విజయవాడలో ఉండడంతో అక్కడి గిరిజనం సైతం తమ మేడమ్ ఎపుడు వస్తున్నారో, ఎపుడు వెళ్తున్నారో తెలీక ఇబ్బంది పడుతున్నారంట. అదిలా ఉంటే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ , ఎమ్మెల్యే బేబీ నాయన , ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తప్ప మిగిలినవారు హాజరుకాకపోవడంపై కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు . జిల్లా అభివృద్ధి గురించి చర్చించాల్సిన సమావేశానికి కూడా హాజరుకాకపోతే , అసలు ఇలాంటి ఎమ్మెల్యేలు అవసరమా? అని మండిపడుతున్నారు.