India New Plan: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు పీక్స్‌లో ఉన్నాయి. పాకిస్తాన్, చైనాలు భారత్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి మరింత నిఘా వ్యవస్థలు అవసరంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే.. నిఘా ఉపగ్రహాల సంఖ్యను మరింత పెంచడానికి భారత్ చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు భద్రత, తీరప్రాంత నిఘాను పెంచడంలో భాగంగా రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం దేశాన్ని కవర్ చేయడానికి శాటిలైట్‌లను రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. భారతదేశం, మరో 100-150 ఉపగ్రహాలను తీసుకొస్తుందని తాజాగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. ఇంతకీ, ఈ శాటిలైట్‌లు ఏం చేయబోతున్నాయి. ఇప్పటి వరకూ.. భారత్ ఎన్ని నిఘా ఉపగ్రహాల సహాయం తీసుకుంటుంది..? వాటి పనితనం ఎలా ఉంది..?
100-150 కొత్త ఉపగ్రహాలకు భారత్ ప్లాన్
భారతదేశం తన సరిహద్దు రక్షణ, తీర ప్రాంత నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి రాబోయే మూడు సంవత్సరాల్లో 100 నుండి 150 కొత్త ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. ఏప్రిల్ 23న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం భారతదేశం 55 ఉపగ్రహాలను నిర్వహిస్తోంది. అయితే, 15 వేల కి.మీ. సరిహద్దు, 7 వేల 500 కి.మీ. తీర ప్రాంతాన్ని కవర్ చేస్తూ సమర్థవంతంగా నిఘా నిర్వహించడానికి ఈ సంఖ్య సరిపోదని నారాయణన్ పేర్కొన్నారు.
సరిహద్దు రక్షణకు చాలా ఉపగ్రహాలు అవసరం
అందుకే, ఈ కార్యక్రమంలో.. భారత అంతరిక్ష శాఖ కార్యదర్శి నారాయణన్ ఆధ్వర్యంలో వీటిని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. రాకెట్లు, ఉపగ్రహాలను నిర్మించడంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. భారతదేశ సరిహద్దుల్ని రక్షించుకోవడానికి చాలా ఉపగ్రహాలు అవసరంగా కనిపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం భారత నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇస్రో SpaDeX మిషన్లలో భాగంగా…
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. దేశ రక్షణ కోసం ఇస్రో ఇలాంటి చర్యలు చేపట్టడం కీలకంగా మారింది. ఇక, భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఇటీవల విజయాలను అందుకున్నాయి. ఇస్రో SpaDeX మిషన్లలో భాగంగా ఉపగ్రహాల రెండవ డాకింగ్‌ను కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచంలోనే దీనిని సాధించిన నాలుగు దేశాలలో ఒకటిగా భారత్ నిలిచింది.
ప్రపంచంలోనే దీనిని సాధించిన 4వ దేశంగా భారత్
అయితే, ఇక, ఇప్పుడు చేపట్టబోయే మరో 150 ఉపగ్రహాలు దేశ సరిహద్దు, తీరప్రాంత రక్షణలో రియల్-టైమ్ నిఘాను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఉగ్రవాద చొరబాటు, సైనిక కదలికలు, రాడార్ స్థానాలు, నౌకా కదలికలపై నిఘా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. ఈ ప్రాజెక్ట్ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని మరింత భద్రతను కల్పించడానికి రూపొందించబడినట్లు తెలుస్తోంది.
ఉపగ్రహాలలో కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణలు
అయితే, ఈ ఉపగ్రహాలలో కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణలు, సింథటిక్ అపెర్చర్ రాడార్, అధిక రిజల్యూషన్ ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లు, అన్ని వాతావరణ పరిస్థితులలో ఇమేజింగ్ సామర్థ్యాలు వంటి టెక్నాలజీని జోడిస్తున్నారు. ఇవి శత్రు సైనిక కదలికలు, క్షిపణి మోహరింపులు, మొబైల్ లాంచర్లను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. ఇక, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్‌లలో ఈ ఉపగ్రహాలు మోహరించే ఆలోచన చేస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కు 27 వేల కోట్ల రూపాయల బడ్జెట్
ఇది సమగ్రమైన కవరేజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఇక, ఈ 150 ఉపగ్రహాలలో భాగంగా, SBS-III ప్రాజెక్ట్ కింద 52 గూఢచార ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 27 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించారు. కాగా, ఇది 2027-28 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.
మొదటి 21 ఉపగ్రహాలను తయారు చేస్తున్న ఇస్రో
ఇక, ఇందులో భాగంగా.. ఇస్రో, మొదటి 21 ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించనుంది. మిగిలిన 31 ఉపగ్రహాలను దక్షిణ భారతదేశంలోని మూడు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేస్తాయి. ఫ్రాన్స్‌తో సహకారంతో కొన్ని ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇందులో ప్రైవేట్ సహకారం కూడా లేకపోలేదు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన అంతరిక్ష రంగ సంస్కరణల కారణంగా… రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యం కావడానికి అవకాశం వచ్చింది. ఇస్రో ఈ సంస్థలకు సాంకేతికంగా మార్గనిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైసిస్, IRNSS నావిక్ వంటి ఉపగ్రహాల నిర్వహణ
అయితే, ప్రస్తుతం, భారతదేశం.. GSAT-7 రుక్మిణి, GSAT-7A యాంగ్రీ బర్డ్, కార్టోశాట్ సిరీస్, రిసాట్ సిరీస్, ఎమిసాట్, మైక్రోసాట్-ఆర్, హైసిస్, IRNSS నావిక్ వంటి ఉపగ్రహాలను సరిహద్దు రక్షణ కోసం ఉపయోగిస్తోంది. ఈ ఉపగ్రహాలు సమాచార సేకరణ, నావిగేషన్, సురక్షిత మెసేజ్ వ్యవస్థలను అందిస్తున్నాయి.
చైనాకు 120 సైనిక ఉపగ్రహాలు, పాకిస్తాన్‌కు 5 ఉపగ్రహాలు
భారతదేశానికి.. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. అయితే, చైనాకు 120 సైనిక ఉపగ్రహాలు ఉండగా… పాకిస్తాన్, 5 ఉపగ్రహాలుతో పనిచేస్తుంది. ఈ రెండు దేశాలతో పోలిస్తే, భారతదేశం తన ఉపగ్రహాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకా కదలికలు, చట్టవిరుద్ధ మత్స్య సంపద, సముద్ర దొంగతనాల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ ఉపగ్రహాలు కీలకంగా మారనున్నాయి.
క్వాంటం ఉపగ్రహాల అభివృద్ధికి భారత్ ప్రణాళికలు
ఇక, ఇప్పటికే.. స్పాడెక్స్ మిషన్‌లో రెండవ సారి ఉపగ్రహాల డాకింగ్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సాంకేతికత భవిష్యత్ ఉపగ్రహ సేవలకు, అంతరిక్ష రక్షణ సామర్థ్యాలకు ఉపయోగపడుతుంది. అలాగే, భారతదేశం.. క్వాంటం ఉపగ్రహాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇవి మరింత సురక్షిత సమాచార మార్పిడిని సాధ్యం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
2019లో భారత్ యాంటీ-శాటిలైట్ సామర్థ్యం ప్రదర్శన
2019లో మిషన్ శక్తి ద్వారా భారతదేశం యాంటీ-శాటిలైట్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాలను నాశనం చేయగల సామర్థ్యానికి అద్దం పడుతుంది. అయినప్పటికీ, చైనా, పాకిస్తాన్‌తో పోటీలో ఉండటానికి భారతదేశం తన అంతరిక్ష సామర్థ్యాలను మరింత వేగంగా విస్తరించాల్సి ఉంది. అలాగే, ఉపగ్రహాలను సైబర్ దాడులు, జామింగ్, యాంటీ-శాటిలైట్ దాడుల నుండి రక్షించడానికి అధునాతన సాంకేతికతలు కూడా అవసరం ఉంది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేయడానికి ఇస్రో, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయం కీలకంగా మారింది.
సమాచార సేకరణ, మెసేస్ వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్..
భారతదేశం తన జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి.. సరిహద్దులు, సముద్ర ప్రాంతాల్లో నిఘా, సమాచార సేకరణ, సైనిక సమన్వయం కోసం ఇప్పటికే కొన్ని ఉపగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ ఉపగ్రహాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. అలాగే, సైనిక, నౌకాదళ, వైమానిక దళాల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు.. సమాచార సేకరణ, మెసేస్ వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, నిఘా కోసం ఉపయోగించబడుతున్నాయి.
2,000 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో నిఘా సామర్థ్యం
వీటిలో.. ఆగస్టు 2013లో ప్రయోగించిన GSAT సిరీస్.. సైనిక సందేశ ఉపగ్రహం GSAT-7 రుక్మిణి కీలకమైనది. భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఉపగ్రహం… హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, భూ స్థావరాల మధ్య సురక్షిత, రియల్-టైమ్ సమాచార మార్పిడిని సులభతరం చేస్తుంది. ఇది UHF, S-బ్యాండ్, Ku-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఈ ఉపగ్రహం 2,000 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో నిఘా సామర్థ్యాన్ని అందిస్తుంది.
GSAT-7A ఆంగ్రీ బర్డ్, డిసెంబర్ 2018లో ప్రయోగం
ఇక, GSAT-7A ఆంగ్రీ బర్డ్ ఉపగ్రహాన్ని… డిసెంబర్ 2018లో ప్రయోగించారు. ఇది, భారత వైమానిక దళం కోసం రూపొందించిన ఈ ఉపగ్రహం. గ్రౌండ్ రాడార్ స్టేషన్లు, ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానాల మధ్య సమన్వయాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే, ఇది Ku-బ్యాండ్‌లో పనిచేస్తూ, డ్రోన్‌లు, యుద్ధ విమానాల సమన్వయానికి సహాయపడుతుంది. ఇక, భవిష్యత్తులో ప్రయోగించడం కోసం GSAT-7B ఉపగ్రహాన్ని కూడా రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. భారత సైన్యం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఉపగ్రహం ఇది. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మెరుగుపరచడానికి, సైనిక సమాచార వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.
కార్టోశాట్-2 సిరీస్ 0.6 మీటర్ల రిజల్యూషన్‌తో వస్తువుల గుర్తింపు
దీని ద్వారా సైన్యం నెట్‌వర్క్-సెంట్రిక్ యుద్ధ సామర్థ్యం పెరుగుతుంది. 2005 నుండి వివిధ కార్టోశాట్ ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు. కార్టోశాట్ సిరీస్‌లో భాగంగా వీటిని రూపొందిస్తున్నారు. ఈ ఉపగ్రహాలు అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి సైనిక నిఘా, సరిహద్దు మ్యాపింగ్, శత్రు కదలికలను గమనించడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, కార్టోశాట్-2 సిరీస్ 0.6 మీటర్ల రిజల్యూషన్‌తో వస్తువులను గుర్తించగలదు. 2016లో జరిగిన భారత సరిహద్దు దాడుల సమయంలో కార్టోశాట్-2C ఉపయోగించారు. ఈ ఉపగ్రహాలు రిమోట్ సెన్సింగ్ ద్వారా సైనిక లక్ష్యాలను గుర్తించడంలో, భౌగోళిక సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
RISAT-2 ఉపగ్రహాన్ని 2009లో ప్రయోగం
అలాగే, రిసాట్ సిరీస్ ఉపగ్రహాలు కూడా కీలకంగా ఉన్నాయి. ఈ సిరీస్‌లో… RISAT-2 ఉపగ్రహాన్ని 2009లో… 2019లో RISAT-1, RISAT-2B, RISAT-2BR1 ఉపగ్రహాలను ప్రయోగించారు. రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలైన ఈ రిసాట్ సిరీస్… మేఘావృత వాతావరణం, రాత్రి సమయంలో కూడా నిఘా సామర్థ్యాన్ని అందిస్తాయి. RISAT-2, ఇజ్రాయెల్ నుండి సేకరించిన ఎక్స్-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను ఉపయోగిస్తుంది. ఇది సరిహద్దు నిర్వహణ, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడింది. అలాగే, RISAT-2B, RISAT-2BR1 సిరీస్ 35 సెం.మీ. వస్తువులను కూడా గుర్తించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత RISAT-2ను వెంటనే ప్రయోగించారు. ఇది, భారతదేశ భద్రతా అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించింది.
ఏప్రిల్ 2019లో ఎమిసాట్ అనే ఉపగ్రహం ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏప్రిల్ 2019లో ఎమిసాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఉపగ్రహం. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసం ఉపయోగపడుతుంది. శత్రు రాడార్‌ల స్థానాలను గుర్తించడం, వాటి సామర్థ్యాలను అంచనా వేయడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. ఇది భారత సైనిక దళాలకు సిగ్నల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే, 2019 జనవరిలో ప్రయోగించిన మైక్రోసాట్-ఆర్ ఉపగ్రహం… భారత సైనిక దళాల కోసం ఇమేజింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. 2019లో జరిగిన మిషన్ శక్తి -ASAT టెస్ట్‌లో.. ఈ ఉపగ్రహాన్ని లక్ష్యంగా ఉపయోగించి.. భారత్ తన యాంటీ-శాటిలైట్ కూడా సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది భారతదేశ అంతరిక్ష రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.
2018లో హైసిస్ అనే ఉపగ్రహం ప్రయోగం
అలాగే, 2018లో హైసిస్ అనే ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించింది. ఈ డ్యూయల్-యూజ్ ఉపగ్రహం భారత నౌకాదళం ఉపయోగిస్తోంది. ఇది విజిబుల్ నీర్ ఇన్‌ఫ్రారెడ్, షార్ట్‌వేవ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రల్ రేంజ్‌లలో పనిచేస్తూ, సముద్ర నిఘా, శత్రు నౌకల కదలికలను గమనించడంలో సహాయపడుతుంది. అలాగే, 2013-2018 మధ్య ప్రయోగించిన 7 ఉపగ్రహాలు.. IRNSS – నావిక్.. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌గా పేరుపొందింది. భారతదేశం, దాని చుట్టూ 1500 కి.మీ. విస్తీర్ణంలో ఖచ్చితమైన నావిగేషన్, టైమింగ్ సేవలను అందిస్తుంది. ఇది సైనిక ఆపరేషన్లలో మిస్సైల్ గైడెన్స్, జలాంతర్గామి నావిగేషన్, యుద్ధ విమానాల సమన్వయానికి ఉపయోగపడుతుంది. ఇది GPS లేదా GLONASS వంటి విదేశీ నావిగేషన్ వ్యవస్థలపై ఆధారపడకుండా భారతదేశానికి స్వతంత్ర నావిగేషన్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
2025-2030 మధ్య 52 కొత్త గూఢచార ఉపగ్రహాలు
అయితే, భారత్… 2025-2030 మధ్య 52 కొత్త గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రణాళిక వేస్తోంది. ఇవి AI-ఆధారిత టెక్నాలజీతో రూపొందించబడతాయి. ఈ ఉపగ్రహాలు చైనా, పాకిస్తాన్ సరిహద్దులు, హిందూ మహాసముద్రంలో నిఘాను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం, భారత్ తన సైనిక ఉపయోగం కోసం 13-15 ఉపగ్రహాలను ఉపయోగిస్తోంది. వీటిలో కొన్ని డ్యూయల్-యూజ్ ఉపగ్రహాలు. ఈ ఉపగ్రహాలు అధిక రిజల్యూషన్ ఇమేజింగ్, రాడార్ సెన్సింగ్, సురక్షిత సమాచార మార్పిడి, నావిగేషన్ సామర్థ్యాలను అందిస్తాయి.
చైనా, పాకిస్తాన్ సరిహద్దులు, హిందూ మహాసముద్రంలో నిఘా
ఇవి ఆధునిక యుద్ధంలో కీలకమైనవిగా పరిగణిస్తున్నారు. అయితే, ఇక్కడ కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. ముందుగా చెప్పుకున్నట్లు… చైనా దగ్గర 120 సైనిక ఉపగ్రహాలు, పాకిస్తాన్ దగ్గర 5 ఉపగ్రహాలు ఉన్న తరుణంలో… భారత్ ఇంకా తన ఉపగ్రహాల సంఖ్యను పెంచాల్సి ఉంది. అలాగే, స్పేస్ వార్‌లు జరుగుతాయనే అభిప్రాయాల మధ్య.. మరిన్ని యాంటీ-శాటిలైట్ ఆయుధాల నుండి ఉపగ్రహాలను రక్షించడానికి కొత్త సాంకేతికతలు కూడా అవసరంగా కనిపిస్తోంది.