Nitish Rane Controversy| భారత దేశంలో నివసించే హిందువులందరూ ఏదైనా కొనుగోలు చేసే ముందు ఆ వస్తువుని విక్రయించే షాపు యజమాని మతం గురించి తెలుసుకోవాలని.. షాపు ఓనర్ ని అడిగి మరీ అతని మతం తెలుసుకున్న తరువాతే అతను హిందువైతేనే ఆ వస్తువును అతను కొనుగోలు చేయాలని ఓ రాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో శుక్రవారం ఏప్రిల్ 25న మహారాష్ట్రలో బిజేపీ మంత్రి ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె గతంలోనూ చాలా సార్లు ముస్లింలు, హిందూయేతర మతాలు చెందిన వారిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మృతుల కుటుంబాల కథనం ప్రకారం.. ఉగ్రవాదులు పర్యాటకులన కాల్చే ముందు వారి మతం అడిగారని.. ఇస్లాం కల్మాని పలుకమని, హిందువులను మాత్రమే తుపాకులతో కాల్చి చంపారని తెలిపారు. ఈ విషయమే మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే సభలో నొక్కి చెప్పారు. అయితే ఆయన ఉగ్రవాదులకు బదులు ముస్లిందరినీ తప్పుబట్టారు.
మహారాష్ట్ర రత్నాగిరి జిల్లా దాపోలీ పట్టణంలో మంత్రి నితీశ్ రాణె ప్రసంగిస్తూ.. “వారు మా మతం అడిగి మరీ హత్యలు చేశారు. అందుకే హిందువులు కూడా ఏదైనా కొనుగోలు చేసే ముందు షాపు ఓనర్ మతం ఏది అని ప్రశ్నించాలి?.. వాళ్లు చంపే ముందు మిమ్మల్ని మతం అడిగితే.. మీరు కూడా ఏదైనా కొనుగోలు చేసే ముందు వారి మతం గురించి అడగండి. హిందూ సంస్థలు ఈ డిమాండ్ దేశంలో లేవనెత్తాలి. షాపు ఓనర్లు అబద్ధం కూడా చెప్పే అవకాశం ఉంది. తాము హిందువులమే అని చెప్పే అవకాశం ఉంది. అందుకే వారిని హనుమాన్ చాలీసా పఠించమని అడగండి. వారు హనుమాన్ చాలీసా పఠించకపోయినా.. లేదా సరిగా చెప్పలేకపోయినా వారి నుంచి ఏదీ కొనుగోలు చేయకూడదు.” అని ఆయన అన్నారు.
Also Read: పహల్గాంలో ఉగ్రదాడికి భద్రతా లోపమే కారణం.. తప్పు ప్రభుత్వానిదే.. కాంగ్రెస్ విమర్శలు
ఆ తరువాత కూడా ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గురించి విమర్శలు చేశారు. “మీరు కావాలంటే చూడండి ఆ చక్రవర్తి ఔరంగజేబు. అతను తన తండ్రి, సోదరుడిని గౌరవించలేదు. తండ్రిని, సోదరుడిని గౌరవించని వాళ్లు ప్రజలను ఎలా గౌరవభావంతో చూస్తారు. వాళ్లు మతం గురించి ఈ విధంగా ప్రవర్తిస్తే.. మనం ఆ మతానికి చెందిన వారి నుంచి ఏదైనా ఎందుకు కొనాలి? వారిని ధనవంతుల్పి చేయడానికా?.. ఈ రోజే అందరూ ప్రమాణం చేయండి. హిందువుల దుకాణం నుంచే ఏ వస్తువైనా కొనుగోలు చేస్తామని” అని మంత్రి నితీశ్ రాణె సభనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
గతంలో కూడా బిజేపీకి చెందిన మంత్రి నితీశ్ రాణె కేరళను మినీ పాకిస్తాన్ అని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని, హలాల్ ఆహారం హిందువులు తినకూడదని వివాదాస్పందగా ప్రసంగాలు చేశారు.