BigTV English
Advertisement

Avanthi Srinivas: బాబు గ్రీన్ సిగ్నల్.. టీడీపీలోకి అవంతి..?

Avanthi Srinivas: బాబు గ్రీన్ సిగ్నల్.. టీడీపీలోకి అవంతి..?

నాయకులకు అగ్ని పరీక్ష పెడుతున్న విశాఖ రాజకీయాలు

ప్రస్తుత విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చేయాలంటే పార్టీలకే కాదు నాయకులకు కూడా అగ్ని పరీక్ష లాగానే కనిపిస్తున్నాయి. ఒక్కో రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పదవి పోయిన తర్వాత రాజకీయ మనుగడ కోసంమరో విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి సరైన సమయంలో నిర్ణయం తీసుకుని, ముందడుగు వేసే నాయకుడు మాత్రమే విశాఖ రాజకీయాల్లో మనగలడు అనేది ఎంతో మంది రాజకీయ నాయకుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.


పార్టీలు మారినా 15 ఏళ్లు పదవిని కాపాడుకున్న అవంతి

అలా రాజకీయ జీవితం ముగిసిపోయింది అని చర్చ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మళ్లీ తెరమీదకి వచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల వరకు ఓటమి తెలియని నాయకుడిగా, 2009 నుంచి ఎన్ని పార్టీలు మారినా 15 ఏళ్లు పదవిని మాత్రం కోల్పోకుండా వచ్చారు. 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు.

ఓటమి తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన మాజీ మంత్రి

2024 ఎన్నికల్లో వైసీపీ నుండి బరిలో నిలిచి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలవ్వడం, వైసీపీ అధికారాన్ని కోల్పోవడం రెండు చకచక జరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయిన కొద్ది కాలానికే మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసి రాజకీయాల నుండి తాత్కాలిక విరామం తీసుకున్నారు. అవంతి శ్రీనివాస్ రాజకీయాలకు దూరమని ప్రకటించడంతో ఆయన గురించి చర్చలు, రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు గాని వినిపించడం ఆగిపోయాయి. బహుశా వైసీపీలో కొనసాగి ఉంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అవంతిపై కూడా కేసు నమోదు చేసి, అరెస్టుల వరకు దారితీసేదని అయన సన్నిహితులే అంటున్నారంట.

వ్యాపారాలు చూసుకుంటూ గడిపేసిన అవంతి శ్రీనివాస్

వైసీపీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ కొద్దిరోజుల తర్వాత బీజేపీలో జాయిన్ అవుతారు, టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగింది. రోజులు గడుస్తూ వస్తున్నాయి కానీ అవంతి శ్రీనివాస్ ఏ రాజకీయ పార్టీలోనూ జాయిన్ కాకుండా తన వ్యాపారాలను చూసుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతుంది. గత సంవత్సర కాలంగా సైలెంట్‌గా ఉన్న అవంతి శ్రీనివాస్ మళ్ళీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

త్వరలోనే టీడీపీలో జాయిన్ అవుతారని ఊహగానాలు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడైన అవంతి త్వరలోనే టీడీపీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ఊహాగానాలు భీమిలి నియోజకవర్గంతో పాటు విశాఖలో చెక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 25 ఏళ్లుగా.. ఓటమి అంటే తెలియని నాయకుడిగా పేరుపడ్డ మాజీ మంత్రి.. ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యతే.. అవంతి శ్రీనివాస్‌ టీడీపీ వైపు అడుగులు వేయడానికి కారణమంటున్నారు.

సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్

గంటా శ్రీనివాస్ ఐదోసారి ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గం నుండి గెలిచినా.. ఎలాంటి మంత్రి పదవి ఇవ్వకుండా టీడీపీ అధిష్టానం సాధారణ ఎమ్మెల్యేగానే ఉంచడం.. భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గంట శ్రీనివాస్ చేపడుతున్న కొన్ని పనులు.. టీడీపీ అధిష్టానం దృష్టిలో నెగిటివ్‌గా మారుతుండడంతో అవంతి శ్రీనివాస్‌కు.. టీడీపీతో మళ్లీ రాజకీయ ప్రయాణం మొదలు పెట్టడానికి కారణం అయిందంటున్నారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన వెంటనే అవంతి టీడీపీలో జాయిన్ అవ్వడానికి.. రంగం సిద్ధం చేసుకుంటే గంటా శ్రీనివాస్ అడ్డుకున్నారంట. ప్రస్తుతం టీడీపీలో గంటా శ్రీనివాస్ మాట ప్రస్తుతం చెల్లుబాటు కావడం లేదు అనే ప్రచారం నేపథ్యంలో.. అవంతి శ్రీనివాస్ సైకిల్ ఎక్కబోతున్నారన్న ప్రచారానికి బలాన్నిస్తుంది.

విశాఖ మేయర్ కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం

ఒక్కటి అంటే ఒక్క సంఘటన రాజకీయ నాయకుల తలరాతలను మార్చేస్తుంది. అలా విశాఖ మేయర్ ఎన్నిక అవంతికి కలిసి వచ్చిందంట. రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన అవంతి శ్రీనివాస్ టీడీపీలో జాయిన్ అవ్వడానికి.. ఎన్నో విధాలుగా ట్రై చేసినా అవకాశం దక్కకపోవడంతో.. వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా గడిపేస్తున్న టైంలో.. విశాఖ మేయర్‌పై కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. అప్పుడు అవంతి శ్రీనివాస్ కూతురు ఆరవ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక పార్టీ మారి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో.. అవిశ్వాసం నెగ్గిన టీడీపీ మేయర్ పదవి కైవసం చేసుకోగలిగింది. ఆ క్రమంలో అవంతి కుటుంబంపై టీడీపీ అధిష్టానానికి నెగిటివ్ ఒపీనియన్ పోయిదంట.

టీడీపీకి అనుకూలంగా ఓటు వేసిన అవంతి కుమార్తె ప్రియాంక

కీలకమైన సమయంలో టీడీపీకి అండగా నిలిచి ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక.. చేసిన సహాయం అవంతి శ్రీనివాస్ టీడీపీలో జాయిన్ అవ్వడానికి దారి చూపించిందని ప్రచారం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం సమయంలో తన కూతురుతో పగడ్బందీగా ప్లాన్ చేసి.. టీడీపీకి అండగా నిలిచిన అవంతి శ్రీనివాస్.. ఫ్యామిలీ టీడీపీలో ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వడానికి అవంతి శ్రీనివాస్.. ఇంట్రెస్ట్ చూపించిన సమయంలో దూరం పెట్టిన టీడీపీనే.. ఇప్పుడు ఆయనకు మార్గం సుగమం చేసిందంటున్నారు.

తన కొడుకు రవితేజను బరిలో దించడానికి ప్రయత్నించిన గంటా

2029 ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి.. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే భీమిలి నియోజకవర్గం కచ్చితంగా.. రెండు నియోజకవర్గాలుగా మారిపోతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులుగా గంటా, అవంతి ఉన్న రానున్న నాలుగేళ్లు పార్టీలోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు అనే దానిబట్టే భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల్లోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో నుండి తప్పుకుని తన కొడుకు గంటా రవితేజను భీమిలి నియోజకవర్గం నుండి బరిలోకి దించాలని ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది.

భీమిలిలో సంబరపడిపోతున్న అవంతి వర్గం

అప్పట్లో చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గంటానే బరిలో ఉండాలని సూచించడంతో ఆయన వారసుడి పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుండి నియోజకవర్గ కార్యకలాపాలన్నీ గంటా శ్రీనివాస్ కాకుండా అతని కొడుకు గంటా రవితేజ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ బరిలో ఉండే అవకాశం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండడం.. నియోజకవర్గాలు పెరిగితే రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలవంతుడైన అవంతి శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి.. నాలుగేళ్ల ముందే అవంతిని టిడిపిలో జాయిన్ చేసుకోవడానికి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందంటున్నారు.

గంటా శ్రీనివాస్ అధిపత్యాన్ని తగ్గించడానికా?

విశాఖ మేయర్ ఎన్నికల్లో కూతురు ద్వారా అవంతి శ్రీనివాస్ నడిపిన మంత్రాంగం ఫలించడంతో ఆయన రీఎంట్రీ ఇవ్వడానికి అవకాశం దొరికిందని నియోజకవర్గంలో అయన అనుచరగణం సంబరపడిపోతోంది. గంటా శ్రీనివాసుకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ను టిడిపిలోకి తీసుకు రావడం వెనక గంటా శ్రీనివాస్ ఆధిపత్యాన్ని తగ్గించడమే టీడీపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. మరి అవంతి విషయంలో గంటా ఎలాంటి రాజకీయం చేస్తారో? ఒకే గూటికి చేరితే ఆ రాజకీయ గురుశిష్యుల ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.

-Story By Apparao, Bigtv Live

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×