Bandi Sanjay – Kishan Reddy: వీళ్లు ఎంపీస్ కాదు ఎంప్టీస్.. బాబోయ్ ఇది మన మాట కాదు. జనం మాట. వీళ్లకు ఓట్లేసిన ఓటర్లంటోన్న మాట. అయినా మీకు పదవులిచ్చింది మెల్లగా వెళ్లి చల్లగా పార్లమెంటులో కూర్చోడానికి కాదు. ఒళ్లు వంచి పని చేసి ప్రాజెక్టులు పట్టుకు రావడానికి. మీకేం పని చెప్పారు? మీరేం చేస్తున్నారు? పైపెచ్చు ఏదైనా రాష్ట్రానికి వచ్చేదుంటే మోకాలడ్డుతారా? భయం భక్తి ఉండక్కర్లా.. ఇదెక్కడి పార్టీ. వీళ్లెక్కడి ఎంపీలు, కేంద్ర మంత్రులు? ఇదీ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఎంపీల మీద వినిపిస్తోన్న కామెంట్లు. ఆ వివరాలేంటో తెలియాలంటే వీళ్ల నిర్వాకమేంటో మీరు చూడాల్సిందే.
బాధ్యతుండక్కర్లా బండన్నా.. చెప్పవేమి కిషనన్నా- జనం కామెంట్లు
బాధ్యతుండక్కర్లా బండన్నా.. చెప్పవేమి కిషనన్నా.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి విషయంలో ఈ ఇద్దరు కేంద్ర మంత్రులపై జనం చేస్తున్న కామెంట్. వీరు మాత్రమే కాదు.. వీరితో పాటు మిగిలిన బీజేపీ ఎంపీలపైనా తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటీ రెండు కాదు మొత్తం 8మంది ఎంపీలు, వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు. కానీ ప్రయోజనమేంటి? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో నిర్లక్ష్యం సహించరానిదిగా భావిస్తున్నారట వీరిని ఎన్నుకున్న ఓటర్లు. మీరు అనుభవించడానికి కాదీ MP పదవులు. మాకేదైనా చేస్తారని.. మీకీ పట్టం కట్టబెట్టామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట సామాన్యులు.
కిషన్ సీనియర్ మంత్రే.. కానీ ఏం ఫాయిదా?
బండి సంజయ్ సంగతి అలా ఉంచితే కిషన్ రెడ్డి గత కొంత కాలంగా కేంద్రమంత్రిత్వం వెలగబెడుతున్నారు. ఇద్దర్లోకీ సీనియర్ మంత్రి. కానీ ఏం ఫాయిదా? ఇదీ కిషన్ మార్క్ డెవలప్మెంట్ అంటూ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు తెచ్చారా? ఆయనకు రాష్ట్రం మీదున్న బాధ్యత ఇదీ అంటూ ఫండ్స్ ఏమైనా సాధించుకొచ్చారా? ఆయన్ను చూసి.. నేర్చుకోండని వాళ్లు వీళ్లు చెప్పుకునే విధంగా.. ఒక్కటంటే ఒక్క మచ్చుతునక ఏదీ?
ఫ్లడ్ లైట్లు పెట్టి వెతికినా కనిపించని కిషన్ రెడ్డి పనితనం..
వాళ్లూ వీళ్లూ అనకుంటే పోయారు.. కనీసం తనకు తానైనా నేనిది తెచ్చా. ఇది నా సాధన. రాష్ట్రంపై నాకున్న అక్కర ఇదీ.. అంటూ ఏదైనా ఒక్క ఉదంతం. ఫ్లడ్ లైట్లు వేసుకుని వెతికినా కనిపించదే? కనీసం.. మీ చరిత్ర మీరు రాసుకోడానికైనా ట్రై చేయాలి కద్సార్? అంటూ కొందరు బాహటంగానే అంటున్నారట.
ప్రధాని మోడీతో మంచి సంబంధ బాంధవ్యాలు గల కిషన్
దానికి తోడు కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా ఉన్న వెసలుబాటుతో పాటు.. మరో అదనపు క్వాలిఫికేషన్ కూడా ఉంది. ప్రధాని మోడీతో ఎంతో మంచి సంబంధాలున్నాయి. ఇరువురికీ అంతటి స్నేహ బాంధవ్యాలున్నాయి. వీటిని వాడుకుని.. రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి కదా? అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలి కదా? ఏదీ? అన్న ప్రశ్న ఖంగు మంటోందట.
రేవంత్ సర్కార్ చేస్తున్న యత్నాలకు తీవ్ర అడ్డంకిగా కిషన్
ఇక్కడ మరో సీన్ రివర్స్ వ్యవహారమేంటంటే.. అమ్మ పెట్టదూ అన్న సామెతలాగా.. ఆయన రాష్ట్రాభివృద్ధికి పూనుకోడు. ఇతరులు చేస్తే ఒప్పుకోడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి యత్నాలను దగ్గరుండి సహకరించాల్సిన కిషన్ రెడ్డి.. భారీ ఎత్తున అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయ్. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల ఆమోదానికి తీవ్ర యత్నాలు చేస్తుంటే.. కిషన్ రెడ్డి కేబినేట్ సమావేశాల్లో ఆ విషయాన్ని కనీసం ప్రస్తావించరన్న ఆరోపణలున్నాయి.
కేంద్ర మంత్రిగా ప్రమోషన్ పొందిన బండి సైతం ఇదే ఫార్ములా
ఇక ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా ప్రమోషన్ పొందిన బండి సంజయ్ వంతు. ఈయన కూడా ఇంతే. కేంద్ర మంత్రిత్వం ద్వారా రాష్ట్రానికి ఏదైనా చేద్దామన్న కనీస ఉద్దేశం కనబరచరన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మా దేవుడన్నా అంటూ కాకాలు పట్టడం కాదు అభివృద్ధి బాకాలేవీ బండీ?
బండి సైతం ఏమంత మామూలోడు కాడనీ. ఆయనకు కూడా ఇటు కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీతోనూ సత్సంబంధాలు భారీగానే ఉన్నాయనీ అంటారు. మోడీ మా దేవుడన్నా అంటూ వేదికలపై కాకాలు పట్టడం కాదు.. అభివృద్ధి బాకాలేవీ? అంటూ బండిని నేరుగానే నిలదీస్తున్నారట ఓటర్లు. ఎన్ని విమర్శలు వినవస్తున్నా.. ఎన్నేసి ఆరోపణలు హోరుమంటున్నా.. మీ పని మీదే- మా పని మాదే అంటూ లైట్ తీస్కుంటున్నారట ఫ్లవర్ పార్టీ లీడర్లు. పార్టీ గుర్తు పువ్వు కాబట్టి ఎన్నికలప్పుడు జనం చెవుల్లో పూలు పెట్టడం ఆపై వారడిగే మాటలను చెవికి ఎక్కించుకోక పోవడం. మాకిది అలవాటేనని అంటున్నారట.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాలేవీ?
కావాలంటే చూడండీ.. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించవచ్చా. కానీ ఈ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ విషయంలో.. పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెడ్డ పేరు సాధించారు. కేంద్రం ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే ఛాన్సే లేదని గతంలో పార్లమెంటు వేదికగా తేల్చి చెప్పింది. అయితే, పోలవరం విషయంలో ఏపీ, మరికొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇటు మహారాష్ట్ర అటు కర్ణాటక పోరాడి నిధులు, హోదాలు సాధిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలు ఇంతగా సాధిస్తోంటే.. వీరికేమైంది? అన్న మాట వినిపిస్తోంది. ఓట్ల నాడేమో కాట్లాడి.. తీరా పదవులు పొందాక.. తెలంగాణ అభివృధ్ధితో మాకేం సంబంధం అంటూ ఎదురు తిరుగుతున్నారట. దీంతో ఇదేం పాడుబుద్ధి అంటూ వీరిని గెలిపించిన జనం తిట్టుకుంటున్నారట.
కాజీపేట రైల్వే ఫ్యాక్టరీపై కేంద్రం ఇప్పటికీ మీనమేషాలు
విభజన హామీల్లో భాగంగా 2014లో కాజీపేటకు రైల్వే ఫ్యాక్టరీ ప్రకటించారు. దీనిపై కేంద్రం ఇప్పటికీ మీన మేషాలు లెక్కిస్తోంది. కాజీపేట డివిజన్ ఇచ్చితీరాల్సిందేనని.. కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. అయినా సరే, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయం రావడమే లేదు. ఇక మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు సాయం చేయాలని సీఎం రేవంత్ ఎన్నిసార్లు అభ్యర్ధిస్తున్నా.. కేంద్రం నుంచి సహకారం అందడం లేదు. పైపెచ్చు మూసీకి తమకూ సబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోందట కేంద్రం. పైపెచ్చు మూసీ బురద బురదగా ఉండటమే బాగుందన్న ధోరణి కనబరుస్తోందట. కారణం కమల వికాసం ఈ బురదలోంచి జరుగుతుంది కాబట్టి.. వీరిలాగే ఆలోచిస్తారన్న మాట వినిపిస్తోంది.
దేశంలో చిన్న చిన్న నగరాల మెట్రో నిర్మాణం చేస్తున్నారుగా?
అదేంటి దేశంలోని చిన్న చిన్న నగరాల మెట్రోల నిర్మాణానికి సహకరిస్తున్నారుగా.. తెలంగాణ విషయానికి వచ్చేసరికి.. ఎందుకంత వెనకడుగు. చేతులెందుకలా వెనక్కు లాగేసుకుంటున్నారు? అన్న ప్రశ్నలకు అటు వైపు సమాధానమే లేదట. కేంద్ర పెద్దలంటే ఈ రాష్ట్రం వారు కారు. మరి మీ ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రుల సొంత రాష్ట్రమిది. మరి మీ స్టేట్ మీద మీకున్న ప్రేమ ఇంతేనా? బాధ్యత లేనట్టేనా? వీరినెంత ప్రశ్నించినా.. నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారట.
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రారంభించింది ఒక్క లిఫ్ట్ మాత్రమే..
ఇప్పటి వరకూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సాధించింది ఏదైనా ఉందంటే ఒకే ఒక్క లిఫ్ట్. సీతాఫల్ మండీలో ఆయన ద్వారా ప్రారంభానికి నోచుకున్నది ఏదైనా ఉందంటే అది ఇదే. అంతకన్నా మించి ఆయనకున్న కేంద్ర మంత్రిత్వం ఎందుకూ పనికిరాలేదని అప్పట్లో బీఆర్ఎస్ సైతం ఎద్దేవా చేసింది. అవకాశం లేని వాటి గురించి అటుంచితే.. ఛాన్సున్న వాటిని కూడా తీసుకురావడం లేదట బీజేపీ ఎంపీలు.
కేంద్రీయ విద్యాలయాలు సైతం తీసుకురాని బీజేపీ ఎంపీలు
కేంద్రీయ విద్యాలయాలు రాష్ట్రానికి తీసుకురావచ్చు. అయినా సరే ఇందులోనూ బీజేపీ ఎంపీలు చేతులెత్తేస్తున్నారట. ఏపీ, ఎంపీ, కర్ణాటక, మహారాష్ట్ర బీజేపీ ఎంపీలు.. ఎన్నో నిధులు, ప్రాజెక్టులను కేంద్రంతో పోరాడి సాధిస్తుంటే.. ఇక్కడి ఎంపీలు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారట.
బయట మైకు దొరికితే ఊకదంపుళ్లు.. పార్లమెంటులో నోటికి తాళాలు
నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుగా బీజేపీ ఎంపీల ధోరణి తయారైందని అంటున్నారు. ఎన్ని మాటలంటున్నా వారికిదేమీ పట్టడం లేదని చెప్పుకుంటున్నారు. మైకు దొరికితే చాలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే వీరు పార్లమెంటులో మాత్రం.. నోళ్లకు తాళాలేసుకుని కనిపిస్తారట. అధిష్టానాన్ని నిలదీయడం. కేంద్ర మంత్రుల నుంచి మాకిది కావాలన్న డిమాండ్లు చేయడం. తామెంత అడిగినా వారు చేయడం లేదన్న ఆరోపణలు గుప్పించడం. వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటారట. కేంద్ర పెద్దల ముందు వినయ విధేయతలు ప్రదర్శించడమే పరమావధిగా భావిస్తారట.
పసుపు బోర్డు తెచ్చారనుకుంటే.. అది పదేళ్లకు కాని ఉపయోగం లోకి రాదంటోన్న రైతులు
తెలంగాణలో బీజేపీ ఎంపీగా తమను గెలిపిస్తే.. నియోజకవర్గ అభివృద్ధికి.. భారీగా సహకరిస్తామని హామీలు గుప్పించిన వీరు.. గెలవగానే.. హామీలకు తిలోదకాలిచ్చేశారట. ఇదెక్కడ విడ్డూరమో అర్ధం కావడం లేదని ఆయా నియోజకవర్గ ప్రజలు నొచ్చుకుంటున్నారట. ఈ మధ్య కాలంలో బీజేపీ ఎంపీల ద్వారా ఒరిగింది ఏదైనా ఉంటే అది పసుపుబోర్డు. అయితే ఈబోర్డు అందుబాటులోకి రావడానికిపదేళ్లు పడుతుందట.. దీంతో ఎలాంటి లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట పసుపు రైతులు.
జనం మాట వినిపిస్తోందా కమలం లీడర్లూ
జనం మాట వినిపిస్తోందా కమలం లీడర్లూ.. అన్ని కాలాలూ మీవి కావు. అన్ని రోజులు మీవి కావు. ఒకవేళ అలా జరగాలంటే జనానికి మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి. రాష్ట్రాభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించాలి. మీరు మెల్లగా వెళ్లి చల్లగా కూర్చుని రావడానికి కాదు- మీకీ ఎంపీ పదవులిచ్చింది. కాస్త చూస్కోండన్న హెచ్చరికలు అందుతున్నాయ్. మరి ఇకనైనా ఈ కమలం గ్యాంగ్ లో కదలిక వస్తుందా? మేము సైతం రాష్ట్రాభివృద్ధికి ప్రాజెక్టులను తీసుకొస్తామన్న భరోసా లభిస్తుందా? చూడాలి.