E-Paper
Advertisement

BJP: ఢిల్లీలో ఢీ.. గల్లీలో దోస్తీ? బీజేపీ ‘డబుల్ గేమ్’పై రాజకీయ రచ్చ!

BJP: ఢిల్లీలో ఢీ.. గల్లీలో దోస్తీ? బీజేపీ ‘డబుల్ గేమ్’పై రాజకీయ రచ్చ!

BJP: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చాయి… అర్బన్ ఓటర్లపై నమ్మకంతో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ వేసుకున్న లెక్కలు తల్లకిందులయ్యాయి… గుడ్డిలో మెల్లలా కాషాయపార్టీకి ఓటింగ్ శాతం ఒకింతపెరిగినా ఆశించిన సీట్లకు మాత్రం ఆ పార్టీ ఆమడ దూరంలో ఉండిపోయింది. కేవలం ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాల్టీకి పరిమితమవ్వడంతో దిమ్మతిరిగి పోయిన పరివారులు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టానికి సమీక్షా సమావేశాలు మొదలుపెట్టారంట.. మరి పార్టీ లోటుపాట్లు సరిచేసుకుని, భవిష్యత్తు ఫలితాలను ఆశాజనకంగా మార్చుకోవడానికి పరివార్‌ల ప్లాన్ ఏంటి?

తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ డబుల్ గేమ్?

తెలంగాణలో 116 మున్సిపార్టీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని సొంతగా కైవసం చేసుకోగలిగింది. మరికొన్ని చోట్ల కుమ్మక్కు రాజకీయాలతో వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా… మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో బీజేపీ పదవులను పంచుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అధికారికంగా ఎవరితో ఎలాంటి పొత్తులు ఉండవని చెబుతున్న బీజేపీ… గ్రౌండ్‌ లెవల్లో మాత్రం ఇతర పార్టీలకు మద్దతు పలకడం పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టి వేసిందన్న టాక్ నడుస్తోంది.

మాటల్లో నో పొత్తు.. చేతల్లో పొత్తు?

కొన్ని చోట్ల కాంగ్రెస్‌తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్‌తో కలిసి పదవులు పొందిన ఘటనలు రాష్ట్ర రాజకీయల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఎవరితో పొత్తు ఉండదు, ఎవరికి మద్దతు ఇవ్వం, మద్దతు తీసుకోం అన్న రాష్ట్ర బీజేపీ ఉన్న ఫలంగా ప్లేట్ ఫిరాయించడం ఏంటన్న చర్చ జరుగుతోంది. అధికారిక పొత్తు లేదని చెబుతూనే, గ్రౌండ్‌ లెవల్లో అడ్జెస్ట్‌మెంట్ పాలిటిక్స్‌కు దిగడంతో .. అసలు కమలనాథుల స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.

క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ కఠిన వైఖరి

అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని,
విప్ జారీ చేసిన తర్వాత కూడా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలుంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఘాటైన వార్నింగులు ఇస్తున్నారు. పార్టీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకుండా మద్దతు ఎలా ఇస్తారు..?అంటూ జిల్లా నేతలను నిలదీస్తోంది రాష్ట్ర నాయకత్వం. కొన్ని మున్సిపాలిటీల్లో అధికారిక పొత్తు లేకపోయినా, స్థానిక నేతలు సొంత నిర్ణయాలతో ప్రత్యర్థి పార్టీలకు మద్దతు ఇచ్చినట్లు పార్టీ గుర్తించిందంట. దీంతో క్రమశిక్షణ అంశం హాట్ టాపిక్ గా మారింది.

వైస్ చైర్‌పర్సన్ పదవులపై హాట్ చర్చ

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విప్ ధిక్కరణపై ఇప్పటికే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసిన వారిపై ఆరు సంవత్సరాల బహిష్కరణ వేటు పడింది. అయితే పార్టీకి, పార్టీ నాయకత్వానికి తెలియకుండా మున్సిపాలిటీలలో ప్రత్యర్థి పార్టీలతో జత కట్టడంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీలతో కలిసి వైస్ చైర్‌పర్సన్ పదవులు పంచుకున్నా పార్టీకి పెద్దలకు తెలియకపోవడం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీ యూటర్న్?

ఏపీలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కూటమి పక్షాలైన టీడీపీ, జనసేనలకు తెలంగాణలో అభిమానులు, క్యాడర్ ఉన్నారు. అయినా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎవరితో పొత్తు ఉండదని బీజేపీ ప్రకటించింది. ఎన్నికలయ్యాక కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వం, తీసుకోబోమని స్పష్టం చేసింది. తీరా ఫలితాల తర్వాత ఎవరైనా మద్దతిస్తే ఇస్తే తీసుకుంటామని ప్లేటు తిరగేశారు. దానిపై అధికారిక నిర్ణయం ఏదీ వెలువడకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో కలిసి పదవులు పంచుకోవడం ఆ పార్టీలో రచ్చ రేపుతోంది. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీలో ఈ రకమైన వ్యవహారాలు నడవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ వ్యూహాల్లో లోపాలా

పొత్తులు, మద్దతులు, పదవులు పంపకాలు పక్కన బెడితే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా, సీట్లు మాత్రం దక్కలేదు. అంటే అర్బన్ ఓటర్లపై వేసుకున్న అంచనాలు తప్పాయా..? బూత్ మేనేజ్‌మెంట్ లోపాలున్నాయా..? అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరిగాయా..? లోకల్ లీడర్‌షిప్ బలహీనతా? అసంతృప్తి నేతలు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం నష్టం చేసిందా? ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో మార్చుకోవాల్సిన పద్దతులేంటని కాషాయనేతలు అంతర్మధనంలో పడ్డారంట.

మున్సిపల్ ఫలితాలు షాక్.. బీజేపీకి ఎమర్జెన్సీ అలర్ట్ బెల్

మొత్తం మీదా ఈ మున్సిపల్ ఫలితాలు బీజేపీకి ఎమర్జెన్సీ అలర్ట్ బెల్ మోగించాయన్న చర్చ జరుగుతున్న నేపధ్యంలో రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తుంది? దారుణ ఓటమిపై అంతర్మథనంలో ఉన్న బీజేపీ, ఇక ముందు ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో కానుంది.? అన్నదే ఇప్పుడు కాషాయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Story by: Apparao, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×