Nizamabad Politics: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మౌనం వీడారు.. కేసులకు భయపడి సైలెంట్ ఉన్నారని అందరూ అనుకుంటే.. ఆయన మాత్రం అబ్బే అదేం లేదంటున్నారు … ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆయన.. ఇటీవలే నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. క్యాడర్‌కు నేనున్నా అనే నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తూ మళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. ఇంతకీ ఆయన ఇంతకాలం మౌనంగా ఉండటం వెనుక వ్యూహాం ఉందా? ఇన్నాళ్లు కేసులకు భయపడే దుబాయ్ లో ఉండిపోయారా.. ?
ఎట్టకేలకు బోధన్‌లో ఎంట్రీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే షకీల్
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత షకీల్ ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. నియోజకవర్గానికి ముఖం చాటేశారు. సుమారు 16 నెలల పాటు దుబాయ్ లోనే ఉండిపోయారు. వివిధ కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఆయన అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవల షకీల్ తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో షకీల్‌ను అదుపులో తీసుకుని విచారించిన పోలీసులు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయనకు అనుమతిచ్చారు.
అంత్యక్రియలు ముగిసిన వెంటనే అరెస్ట్ చేస్తారని ప్రచారం
దాంతో షకీల్ బోధన్ లో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన మాత్రం బోధన్, హైదరాబాద్ లో ప్రజలు, నాయకులకు అందుబాటులో ఉంటుండటం అందరిలో ఆసక్తి రేపుతోంది. పైగా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసి మౌనం వీడారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పోలీసు కేసులపై క్లారిటీ ఇచ్చారు. తనను తన కుమారున్ని అక్రమంగా కేసుల్లో ఇరికించి.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. కేసులకు భయపడి దుబాయ్ కి వెళ్లలేదని, అనారోగ్య సమస్యలతో దుబాయ్ లో ఉండాల్సి వచ్చిందని క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారట షకీల్. పైగా కక్ష సాధించడానికి తనతో పాటు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శులు గుప్పించారు
పంజాగుట్ట స్టేషన్‌లో షకీల్ కుమారుడిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. షకీల్ దుబాయ్ కి వెళ్లి అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు కాగా.. కుమారున్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ పైనా పోలీసులు కేసు పెట్టారు. దాంతో కేసుల భయంతోనే షకీల్ దుబాయ్‌లో ఉండిపోయారని ప్రచారం జరిగింది. అంతకు ముందు ప్రభుత్వం ధాన్యం మాయం చేశారనే ఆరోపణలపై, పౌరసరఫరా శాఖ సైతం షకీల్ పై పలు కేసులు పెట్టింది. మొత్తానికి పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న షకీల్.. నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది
నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూసిన షకీల్ భార్య
షకీల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా అండటంతో నియోజకవర్గ పార్టీ బాధ్యతలను ఆయన భార్య చూశారు. ఆమె అందర్నీ సమన్వయం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ సైతం తమకు దిక్కెవరంటూ.. పార్టీ పెద్దలను కలిసి మోర పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దాంతో కొత్త ఇన్చార్జ్‌ని నియమిస్తామని పార్టీ పెద్దలు సైతం సూచప్రాయంగా చెప్పారట. బోధన్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ మార్పు తథ్యం అనుకుంటున్న సమయంలో.. నేనున్నానంటూ షకీల్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. తాను అవినీతికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.
సుదర్శన్ రెడ్డి తనపై కుట్రలు చేశారని షకీల్ ఆరోపణలు
తనను తన కుటుంబాన్ని జైలు పెట్టించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుట్రలు చేశారని షకీల్ ఆరోపిస్తున్నారు. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని క్యాడర్‌కి భరోసా ఇచ్చారు. అయితే ఆయన సడన్‌గా మౌనం వీడటం వెనుక .. పెద్ద వ్యూహాం ఉందని చెబుతున్నారంట ఆయన అనుచరులు. స్థానికంగా అందుబాటులో ఉండి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారట. పార్టీ పెద్దలు సైతం వెనుక మేమున్నామని ఆయనకు భరోసా ఇచ్చారట. దీంతో ఆయన బోధన్ కేంద్రంగానే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: తండ్రుల స్పాట్ డెసిషన్.. కొడుకుల ఫ్యూచర్‌పై ఎఫెక్ట్..!
అదే సమయంలో షకీల్ తనపై నమోదైన కేసులను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారట. ఒక వేళ అరెస్టు చేసినా.. ప్రజల్లో సానుభూతి వస్తుందని భావిస్తున్నారట. అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారంట. మరి చూడాలి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో షకీల్ వ్యూహాలు ఎంతవరకు కలిసి వస్తాయో.