Airports Health Hazard| ఎయిర్‌పోర్టులకు సమీపంలో ఉంటున్నారా? నిత్యం విమాన ఇంజెన్ శబ్దాలను వింటున్నారా? అయితే.. మీరు రిస్కులో పడ్డట్టే. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ శబ్దాల ప్రభావం గుండెపై అధికంగా ఉన్నట్టు తేలింది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, గుండె చలనంలో మార్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు అధ్యయనకారులు తేల్చారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
హీత్రో, గాట్విక్, బర్మింగ్‌హమ్, మాంచెస్టర్ ఎయిర్‌పోర్టులకు సమీపంలో నివసిస్తున్న వారిలో 10 శాతం నుంచి 20 శాతం మందికి గుండె కండరాలు, కదలికల్లో మార్పులు వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. గుండె కండరం మరింత మందంగా మారడం, కదలికలు తగ్గడం వంటి పరిణామాల్ని గుర్తించారు. ఈ మార్పులు కారణంగా గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గుతున్నట్టు తేలింది. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఏకంగా నాలుగు రెట్లు పెరిగినట్టు పరిశోధకులు తేల్చారు. ప్రధాన ఎయిర్‌పోర్టుల సమీపంలో ఉంటున్న సుమారు 3600 మంది వ్యక్తుల ఎమ్మారైలను అధ్యయనం చేశారు. ఎయిర్‌పోర్టులకు దూరంగా ఉంటున్న వారి ఎమ్మారై స్కాన్‌లో పోల్చి శబ్దాల కారణంగా గుండెలో వస్తున్న మార్పులను అధ్యయనం చేశారు. మొత్తం 21,400 ఎమ్మారై స్కాన్‌లను పరిశీలించారు.
ఈ అధ్యయనం ప్రకారం, ఉదయం వేళల్లో 50 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వినేవారు, రాత్రిళ్లు 4 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వినేవారి గుండె కండరాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం, పగటి పూట శబ్దాలు 45 డెసిబెల్స్, రాత్రి పూట శబ్దాలు 40 డెసిబెల్స్ మించకూడదు. ఇక ఎయిర్‌పోర్టు సమీపంలో నిరంతరం అధిక శబ్దాలు వింటున్న వారి గుండె గోడలు 4 శాతం మేర, బరువు 7 శాతం మేర పెరిగినట్టు తేలింది. ఈ మార్పుల వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్స్, గుండె చలనాల్లో మార్పు ప్రమాదం పెరిగింది.
Also Read: 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. పెద్ద కథే!
ఇక రాత్రిపూట అధిక శబ్దాలు మరింత ప్రమాదకరమని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. దీని వల్ల రాత్రి నిద్ర చెడి మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. రాత్రిళ్లు అధిక శబ్దాల కారణంగా బీపీ పెరుగుతుందని, ఒత్తిడి కలుగజేసే కార్టిసాల్ హార్మోన్ విడుదల అవుతుందని అన్నారు. అంతిమంగా ఇది ఊబకాయానికి కూడా కారణమవుతుందని హెచ్చరించారు. ఎయిర్‌పోర్టు ఇంజెన్ శబ్దాల కారణంగా జరుగుతున్న అదృశ్య మార్పులను తమ పరిశోధన తేటతెల్లం చేసినట్టు అధ్యయనకారులు పేర్కొన్నారు. అధిక శబ్దంతో కలిగే ప్రమాదాలను మరోసారి తమ అధ్యయనం హైలైట్ చేసినట్టు ప్రస్తావించారు.
ప్రమాద నివారణకు ఏం చేయాలి..
శరీరంపై పెద్ద శబ్దాల ప్రభావం పడకుండా ఉండేందుకు సౌండ్ ప్రూఫ్ కిటికీలు, నాయిస్ క్యాన్సిలేషన్ పరికరాలు వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకర జీవనశైలి పాటించాలని చెబుతున్నారు. ఇక ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉంటున్న వారు నిత్యం హెల్త్ చెకప్‌లు చేయించుకుంటూ తమ ఆరోగ్యంలో వస్తున్న మార్పులపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు.