Prakasam Politics: తమ భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు పార్టీలు మార్చేసే నాయకులు సరైన జడ్జ్‌మెంట్ తీసుకోకపోతే వారి పొలిటికల్ కెరీరే ప్రశ్నార్ధకంగా మారుతుంది. ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిందని గోడ దూకేసే ఎమ్మెల్యేలు అయిదేళ్లు తర్వాత ఎటూ కాకుండా పోయిన ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. అధికారం విషయంలో తిరుగుండదన్న ధీమాతో పార్టీ మార్చిన మహామహా సీనియర్లు అనుకున్న లెక్కలు తప్పితే రాజకీయంగా ఎంత అనామకులుగా మిగిలిపోతారో ఆ ఇద్దరు లీడర్లను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తన వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం స్పాట్ డెసిషన్ తీసుకున్న మాజీ మంత్రి కరణం బలరాం, శిద్దా రాఘవరావుల పరిస్థితి అలాగే తయారైందంట. అందుకే ఆ ఇద్దరు సీనియర్లు బిడ్డల ఫ్యూచర్‌పై తెగ బెంగ పెట్టేసుకుంటున్నారంట
అధికారం లెక్కలతో పార్టీ మార్చేస్తున్న నేతలు
రాజకీయాలు అంటేనే అనూహ్యంగా ఉంటాయి. ఎవరూ ఊహించలేనివి జరుగుతుంటాయి. ఉన్న పార్టీ ఓటమి పాలైతే.. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్చేసే నాయకులు ఎక్కువవుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది .. ఇక ఫ్యూచర్‌కి దిగులుండదని ఓవర్ నైట్ డెసిషన్ తీసేసుకుని కండువా మార్చేసిన టీడీపీ నాయకులు.. గత ఎన్నికల్లో ఊహించని పరాజయం చవిచూసి దిక్కులు చూడాల్సి వస్తోంది ఇప్పుడు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీలో మాజీలుగా మిగిలిపోయి మళ్లీ ఎన్నికల నాటికి తన భవిష్యత్తు ఏంటా అని తెగ బెంగ పెట్టుకుంటున్నారంట.
వైసీపీ తీర్థం పుచ్చుకున్న కరణం బలరాం, శిద్దా రాఘవరావు
తమకు అన్నీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇక జీవిత కాలంలో అధికారం దక్కదని లెక్కలేసుకుని.. మరీ 2019 ఎన్నికల తర్వాత అప్పటి చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, టీడీపీకి చెందిన మరో సీనియర్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావులు వైసీపీలో చేరిపోయారు. తమదైన లెక్కలతో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆ ఇద్దరు సీనియర్లు వైసీపీ సీన్ రివర్స్ అవ్వడంతో .. అక్కడ ఉండలేక పాత పార్టీలోకి వద్దామంటే అవకాశం దక్కక నానా పాట్లు పడుతున్నారంట.
వారసుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుకున్న కరణం, శిద్దా
గతంలో రాజకీయాలు వేరు, ఇపుడు పరిస్థితి వేరు అన్నట్లు తయారైంది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినేరియా.. ఏపీలో వైసీపీ ద్వారా ఎందరో రాజకీయ జీవితాలను అందుకున్నారు. ఎందరో మంత్రులు అయ్యారు. అలాగే పార్లమెంట్ గడప తొక్కారు. అదే సమయంలో ఎంతో మంది రాజకీయ జీవితం ఎటూ కాకుండా తయారైంది. అలా తమ రాజకీయ జీవితాలనే కాకుండా తమ వారసుల పొలిటికల్ ఫ్యూచర్‌ని కూడా ప్రశ్నార్ధకంగా మార్చుకున్నారు ప్రకాశం జిల్లాలోని సీనియర్ నాయకులైన శిద్దా రాఘవరావు, కరణం బలరాంలు.
ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన కరణం
ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన వారిలో కరణం బలరామకృష్ణమూర్తి ఒకరు. ఆయన రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడైనా కనీసం మంత్రి కాలేకపోయారు. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు , కరణం బలరాం అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించారు. అయితే ఆయన రాజకీయ నిర్ణయాలలో తడపాటు, అనవసరమైన దూకుడుతో ఎంత సీనియర్ అయినా మంత్రి మాత్రం కాలేకపోయారు. వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన ఆ పార్టీలో ఉండకుండా 2020లో వైసీపీలోకి జంప్ అయ్యారు.
కుమారుడి భవిష్యత్తుకు ఉపయోగపడని బలరాం అనుభవం
అలా ఆయన రాజకీయ జీవితం వైసీపీలో కొంతకాలం సాగినా 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కరణం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఆయన వారసుడు కరణం వెంకటేశ్‌కు కలిసి రాని పరిస్ధితి ఏర్పడింది. గత ఎన్నికల్లో కరణం బలరాం తాను పోటీ నుంచి తప్పుకుని కరణం వెంకటేష్‌ని ఎన్నికల బరిలో దింపి చేతులు కాల్చుకున్నారు. ఓటమి తర్వాత ఆ తండ్రీకొడుకులు వైసీపీ రాజకీయాల్లో ఇమడలేక పోతున్నారంట. కరణం నిలకడ లేని నిర్ణయాలతో ఇపుడు తన రాజకీయ వారసుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తును కూడా డైలమాలో పడేశారు. అసలు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని వైసీపీలోకి వేళ్లారు కరణం.
2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కరణం కుమారుడు
2014, 2024 ఎన్నికల్లో ఆయన వారుసుడిగా అద్దంకి, చీరాల నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కరణం వెంకటేశ్ ఓటమి మూటగట్టుకుని ప్రస్తుతం ఎటూ కాకుండా తయారయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో అద్దంకి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వెంకటేష్ వైసీపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన గొట్టిపాటి రవికుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. గెలిచిన తర్వాత గొట్టిపాటి రవి టీడీపీలోకి రావడంతో సొంత సెగ్మెంట్ అయిన అద్దంకి రాజకీయాల్లో కరణం కుటుంబ హవాకి ఎండ్ కార్డు పడినట్లైంది. 2019 ఎన్నికల్లో అదే అద్దంకి నుంచి గొట్టిపాటి రవి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించి.. పార్టీనే అంటిపెట్టుకుని ఉండి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు.
2019లో బలరాంకి చీరాల టికెట్ కేటాయించిన టీడీపీ
కరణం బలరాం 2019లో అద్దంకి టికెట్ కోసం పట్టుబట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ క్రమంలో వెంకటేష్‌ని కాదని కరణం బలరాంకు చీరాల టీడీపీ టికెట్ కేటాయించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించిన బలరాం వెంటనే వైసీపీ బాట పట్టారు. గత ఎన్నికల్లో వెంకటేష్‌కు చీరాల వైసీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ గెలిపించుకోలేక పోయారు. టీడీపీలో జిల్లా స్థాయి నేతగా వెలుగొందిన ఆయన తిరిగి సొంతగూటికి చేరాలన్న ఆలోచన చేస్తున్నా.. వ్యతిరేకత వ్యక్తం అవుతోందంట.
వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఏం అవుతుందో అని బెంబేలు
టీడీపీలోకి వెళ్ళలేక వైసీపీలో ఉండలేక కరణం కుటుంబం రాజకీయంగా నలిగిపోతోందనే టాక్ నడుస్తోంది. వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఏం అవుతుందో అని కరణం శిబిరం బెంబేలెత్తుతోందంట. అప్పట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్న పరిచయాలతోనే కరణం వైసీపీకి వెళ్లారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం బాలినేని వైసీపీకి కటీఫ్ చేప్పి జనసేనలోకి వచ్చేశారు. దాంతో కరణం ఫ్యామిలీకి ఏ దారి కనిపించడం లేదంటున్నారు.
Also Read: పవన్ యాక్షన్.. వాళ్లు కంట్రోల్‌లో ఉంటారా!
1999 నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న శిద్దా రాఘవరావు
ఇక మరో మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు పరిస్థితి కూడా అలాగే తయారైందంట. ఆయనకు 1999 నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉంది. 2007లో శిద్దాకి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అంతకు ముందు ఏడాది శిద్దా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 2014లో శిద్దా రాఘవరావు దర్శి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబునాయుడు ఆయనపై నమ్మకంతో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే 2019లో ఓటమి తరువాత శిద్దా తన కుమారుడు వెంకట సుధీర్ కుమార్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కానీ ఆయన ఆశించింది ఏమీ అక్కడ దక్కలేదు. జగన్ ఆయనకు సరైన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు.
టీడీపీలో రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అధిష్టానం
శిద్దా కుమారుడు వెంకట సుధీర్ కుమార్‌కి 2024 ఎన్నికల్లో దర్శి టికెట్ ఇవ్వడానికి జగన్ ఒప్పుకోలేదు. కనీసం తనకైనా ఇస్తే పోటీ చేస్తానని శిద్దా మొత్తుకున్నా వైసీపీ ఛాన్స్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన శిద్ధా రాఘవరావు టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. సైకిల్ ఎక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా… అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదంట.
శిద్దా రాఘవరావుపై భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు
కష్టకాలంలో టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లి.. తిరిగి అధికారంలోకి వచ్చింది కదా అని టీడీపీలోకి వస్తామంటే ఎలా అని తెలుగుతమ్ముళ్లు శిద్దాపై భగ్గు మంటున్నారు. అందుకే టీడీపీ అధిష్టానం శిద్దా జాయినింగ్‌పై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టేసిందంట. ఆ క్రమంలో తన వారసుడు శిద్ధా సుధీర్ రాజకీయం భవిష్యత్‌పై మాజీ మంత్రి బెంగ పెట్టేసుకుంటున్నారంట. తమదైన లెక్కలతో ఒక్కసారిగా స్పాట్ డెసిషన్ తీసేసుకుని టీడీపీ నుంచి ప్లేట్ ఫిరాయించిన ఆ ఇద్దరు సీనియర్ల భవిష్యత్తుపై ప్రకాశం జిల్లా రాజకీయవర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. మరి జిల్లా రాజకీయాల్లో వారి ప్రభావం కొనసాగుతుందా? లేకపోతే పొలిటికల్ స్ర్కీన్ మీద నుంచి ఫేడౌట్ అయిపోతారో చూడాలి