BigTV English

King Charles Coronation: రాజు వెడలె.. పట్టాభిషేకం హైలైట్స్ ఇవే..

King Charles Coronation: రాజు వెడలె.. పట్టాభిషేకం హైలైట్స్ ఇవే..

King Charles Coronation: బ్రిటన్ రాజు పట్టాభిషేకం. 70 ఏళ్ల తర్వాత జరుగుతున్న వేడుక. 2 వేల మందికిపైగా అతిథులు. బ్రిటన్ రాజుగా మూడో చార్లెస్ ఇప్పటికే అధికారికంగా నియమితులయ్యారు. వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ అబేలో ఆయనకు కిరీటధారణ జరుగుతుంది. చార్లెస్‌తో పాటు రాణిగా.. భార్య కెమిల్లా కిరీటం ధరిస్తారు. చార్లెస్ వయసు 74 సంవత్సరాలు. అత్యధిక వయసులో బ్రిటన్ వారసత్వాన్ని అందుకుంటున్న తొలి రాజు ఆయనే.


చార్లెస్ పట్టాభిషేకాన్ని 2200 మంది ప్రత్యక్షంగా వీక్షిస్తారు. వారికి కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ తొలుత రాజును పరిచయం చేస్తారు. మీరు చార్లెస్‌ను రాజుగా అంగీకరిస్తున్నారా? అని అడుగుతారు. ఆ తర్వాత రాజు ప్రమాణం ఉంటుంది. చట్టాన్ని కాపాడతానని, న్యాయ పరిరక్షణ కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా చార్లెస్ ప్రమాణం చేస్తారు. 973లో పట్టాభిషేకం సందర్భంగా కింగ్ ఎడ్గర్ చేసిన ప్రమాణ సారాంశం మాదిరిగానే అది ఉంటుంది. చర్చి ఆఫ్‌ ఇంగ్లండ్‌కు నమ్మకస్తుడైన ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌గా ఉంటానంటూ మరో ప్రమాణం కూడా చేస్తారు. చూడటానికి ఇవన్నీ కాస్త పురాతన సంప్రదాయాల్లా కనిపిస్తాయి. ఎందుకంటే గత వెయ్యేళ్లలో ఈ సంప్రదాయాలేవీ పెద్దగా మారలేదు.

ఆ తర్వాత జరిగే కార్యక్రమాలను పరిశీలిస్తే పట్టాభిషేకం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇది మతపరంగానూ ప్రాధాన్యం ఉన్న వేడుక. ప్రమాణాలు చేసిన తర్వాత చార్లెస్‌.. వెయ్యేళ్ల నాటి సింహాసనంపై కూర్చుంటారు. 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ దానిని తయారు చేయించారు. ఇటీవలే దీనికి కొత్త సొబగులు అద్దారు. సింహాసనంపై కూర్చున్న రాజును పవిత్ర నూనెతో ఆర్చ్‌బిషప్‌ అభిషేకిస్తారు. గతంలో పునుగు పిల్లి, తిమింగాల్లో ఓ జాతి అయిన స్పెర్మ్ వేల్స్ నూనెలను ఉపయోగించేవారు. కానీ ఈ సారి మార్పు జరిగింది. చార్లెస్ పట్టాభిషేకం కోసం ప్రత్యేకంగా నూనె తయారు చేయించారు. జంతువుల జోలికి వెళ్లకుండా ఆలివ్‌లతో ఈ నూనె సిద్ధమైంది. శతాబ్దాలనాటి స్పూన్‌తో నుదురు, చేతులు, ఛాతీపై ఈ నూనెను పోస్తారు. ఈ మతపరమైన కార్యక్రమమంతా తెరచాటున జరుగుతుంది. ఆ సమయంలో రాజు శరీరంపై తక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి ప్రైవేటుగా నిర్వహిస్తారు.


అనంతరం చార్లెస్‌కు బంగారు తాపడంతో చేసిన మహారాజ గౌన్‌ను ధరింపచేస్తారు. సిలువతో ఉన్న గోళాకార బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆయనకు ఆర్చ్ బిషప్‌ అందజేస్తారు. ఆ తర్వాత చార్లెస్ కుడిచేయి నాలుగో వేలుకు పట్టాభిషేక ఉంగరాన్ని తొడుగుతారు. ఆపై కిరీట ధారణ జరుగుతుంది. 1661లో తయారైన ఈ కిరీటాన్ని సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటంగా వ్యవహరిస్తారు. దీని బరువు 2.23 కిలోలు. ప్రజలకు దర్శనం ఇచ్చేటప్పుడు ఆయన మరొక కిరీటాన్ని ధరిస్తారు. అలాగే రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు. దాదాపు 2 గంటల పాటు సాగే ఈ ప్రక్రియలతో రాజు మతాధికారి స్థాయికి చేరతారు. అంతే కాదు.. చర్చికి కూడా ఆయనే అధిపతి అని ఈ తతంగం స్పష్టం చేస్తుంది. అంటే.. రాజు సర్వోన్నతమైన పాలకుడని ఈ పట్టాభిషేకం ద్వారా ఇంగ్లండ్ చర్చి అందరికీ గుర్తు చేస్తుంది.

క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్‌ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్‌ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్‌ బైబిల్‌ సూక్తులు చదివి వినిపిస్తారు.

గతంలో రాణి పట్టాభిషేకానికి 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఆ సంఖ్యను ఈ సారి దాదాపు నాలుగోవంతుకు పరిమితం చేశారు. 2200 మందికి మాత్రమే ఆహ్వానం వెళ్లింది. పట్టాభిషేకం అనంతరం జరిగే ఊరేగింపును కూడా కుదించారు. ఎలిజబెత్ రాణి లండన్ వీధుల్లో 8 కిలోమీటర్ల మేర ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సారి దానిని 2 కిలోమీటర్లకు పరిమితం చేశారు. పట్టాభిషేకం కోసం కెమిల్లాతో కలిసి చార్లెస్ స్వర్ణ తాపడపు బగ్గీలో బకింగ్‌హాం పాలెస్ నుంచి అబే చర్చికి వెళ్తారు. 1831 నుంచి ఈ బంగారపు బగ్గీనే వాడుతున్నారు. 1953లో రాణి ఎలిజబెత్-2 పట్టాభిషేకాన్ని తొలిసారిగా టెలివిజన్ ద్వారా ప్రసారం చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో ప్రసారమైన ఆ కార్యక్రమాన్ని అప్పట్లోనే లక్షల మంది వీక్షించారు.

వంద దేశాల నుంచి అతిథులు ఈ పట్టాభిషేకానికి విచ్చేస్తారు. జపాన్ యువరాజు అకిషినో నుంచి స్పెయిన్ వరకు కింగ్ ఫెలిపీ-6 వరకు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ హాజరు కానున్నారు. భారత ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, పుణెకు చెందిన ఆర్కిటెక్ట్ సౌరభ్ ఫడ్కే పట్టాభిషేకానికి హాజరు కానున్నారు. ముంబై డబ్బావాలాలకు కూడా ఆహ్వానం అందింది. బ్రిటన్ రాజకుటుంబంతో ముంబై డబ్బావాలాల సత్సంబంధాలు ఈ నాటివి కావు. 2003లో చార్లెస్ భారత్ వచ్చినప్పుడు ముంబై చర్చిగేట్ స్టేషన్‌లో డబ్బావాలాలను కలిశారు. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన చార్లెస్ వివాహానికి వారు ఆహ్వానం అందుకున్నారు. మళ్లీ ఆయన పట్టాభిషేకానికి పిలుపు రావడంతో డబ్బావాలాల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదంతా తమకు దక్కిన గౌరవమని భావిస్తున్నారు. బ్రిటన్ వెళ్తున్న వారు.. ఉడతాభక్తిగా కానుకలు వెంట తీసుకు వెళ్తున్నారు. పుణెలో వినియోగించే తలపాగా పుణెరీ పగిడీని రాజుకు ఇవ్వనున్నారు. వర్కారీ సంఘం ప్రత్యేకంగా తయారు చేసిన శాలువాను కూడా చార్లెస్‌కు బహుమతిగా అందిస్తారు.

Related News

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Big Stories

×