BigTV English

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Luxury Cars Scam: ఆపరేషన్ నుమ్ ఖోర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం. వయా భూటాన్ హై ఎండ్ కార్లు భారత్ లోకి ఎలా ఇంపోర్ట్ అవుతున్నాయి.. ఎలా ట్యాక్సులు ఎగవేస్తూ తీసుకొస్తున్నారు.. ఎలా కొంటున్నారు? తీగ లాగితే మొత్తం డొంకంతా షేక్ అవుతోంది. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్.. మాజీ మంత్రి కేటీఆర్ వాడే వాహనంపై కామెంట్స్ చేయడం, అదే సమయంలో కేరళలో సినీ స్టార్ల ఇండ్లల్లో కస్టమ్స్ సోదాలతో కథ మొత్తం మారుతోంది. అసలు ఏం జరుగుతోంది? హైఎండ్ కార్ల దందా ఎలా నడుస్తోంది?


బసరత్ ఖాన్ నుంచి కేటీఆర్ దగ్గరికి ఎలా వచ్చింది?

కారు ఎవరి పేరుపై రిజిస్టర్ అయిందా అని చూస్తే ఎట్ హోమ్ హాస్పిటాలిటీ కంపెనీ పేరు ఉంది. ఇందులో కేటీఆర్ భార్య శైలిమ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఈ లింక్ అంతా కేంద్రమంత్రి బండి సంజయ్ బయటపెట్టారు. బసరత్ ఖాన్ ట్యాక్సులు, కస్టమ్స్ సుంకాలు ఎగ్గొట్టి దిగుమతి చేసుకున్న ఈ లాండ్ క్రూజర్ కేటీఆర్ దగ్గరికి ఎలా వచ్చింది? ఎందుకు వాడుతున్నారు.. పేపర్లు సరిగా చెక్ చేసుకోలేదా? ఈ మొత్తం కేసు ఎస్టాబ్లిష్ అయితే ఏం సమాధానం చెప్పుకుంటారు?


8 లగ్జరీ కార్లు ఇంపోర్ట్ చేసిన బసరత్

ఈ బసరత్ అహ్మద్ ఖాన్ మొత్తం 8 లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నాడు. అందులో ఒకటి రోల్స్ రాయిస్, రెండు లెక్సస్ కార్లు, 5 టయోటా లాండ్ క్రూజర్స్ ఉన్నాయి. అందులో ఒక లాండ్ క్రూజర్ ను కేటీఆర్ ఇప్పుడు వాడుతున్నారు. ఈ వాహనం ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు బసరత్ ఖాన్ కేవలం 20 లక్షల 91 వేలుగా అతి తక్కువ అండర్ వాల్యూ చూపించారని DRI ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. కస్టమ్స్, DRI అధికారులు చెబుతున్నదేంటంటే.. ఈ బసరత్ నుంచి కార్లు కొన్న వాళ్లు ట్యాక్సులు ఎగవేయడానికి క్యాష్ లో కొన్నారంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో దర్యాప్తులో తేల్చాలి. మరి లాండ్ క్రూజర్ ను కేవలం 20 లక్షల రూపాయలుగా చూపిన బసరత్ ఖాన్., ఎట్ హోమ్ హాస్పిటాలిటీ కంపెనీ యాజమాన్యానికి ఎంతకు అమ్మాడు అన్నది తేలాల్సిన విషయం.

కేటీఆర్ వాడుతున్న వెహికిల్ పై బండి డౌట్లు

లగ్జరీ కారు స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్‌ ఎందుకు తిరుగుతున్నారు? ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధర చెల్లించారా? లేదా తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా? నకిలీ ఆదాయమా? లేదా మనీలాండరింగ్ ద్వారానా? వాస్తవాలు బయటకు రావాలి.. సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలి అని బండి సంజయ్‌ పోస్ట్ పెట్టారు. వీటికి తోడు DRI, కస్టమ్స్ అధికారులు కేరళ సహా దేశవ్యాప్తంగా హైఎండ్ లగ్జరీ కార్లను రాంగ్ రూట్లలో కొన్న వారి ఇళ్ల దగ్గర సోదాలు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఆపరేషన్ నుమ్ ఖోర్ పేరుతో యాక్టర్లు సల్మాన్ దుల్కర్ సహా ఇతరుల ఇళ్లల్లో సోదాలు చేశాయి దర్యాప్తు బృందాలు. బండి సంజయ్ వేసిన క్వశ్చన్స్ పై బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా జవాబులు చెప్పలేని పరిస్థితి. ఏ షోరూంలో ఎవరు ఏ కారు కొంటున్నారో చూడడానికి బండి సంజయ్ కి కేంద్రమంత్రి పదవి ఇచ్చారా అని ఒకరు.. బండి సంజయ్ తన కార్లను ఏ షోరూంలో కొన్నారో, కేటీఆర్ కూడా అదే షోరూం నుంచే కొన్నారని మరొకరు మాట్లాడారు. సెకండ్ హ్యాండ్ కార్లను ఎవరైనా కొంటారు, ఇదేనా బండి సంజయ్ గొప్పగా కనిపెట్టిన విషయం అని ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి.

బీఆర్ఎస్ హయాంలో కొన్నవే వాడుతున్న మంత్రులు

ఈ మొత్తం మ్యాటర్ సంచలనంగా మారుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ల్యాండ్ క్రూజర్ల దిగుమతి, కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేటీఆర్‌‌‌‌తో పాటు ప్రస్తుత రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్ల కొనుగోళ్లు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్‌‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రస్తుతం మంత్రులు వాడుతున్న ల్యాండ్ క్రూజర్ వెహికల్స్​ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నవి కాదని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వాటిని కొన్నారని పొన్నం గుర్తు చేశారు. ఈ వాహనాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరిగినా, స్మగ్లింగ్ జరిగినట్టు ఆధారాలున్నా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ పైనా విచారణకు ఆదేశించామన్నారు.

లగ్జరీ కార్ల స్కాంలో బసరత్ ఖాన్ పేరు

ఈ లగ్జరీ కార్ల స్కాంలో బసరత్ అహ్మద్ ఖాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇతడు ఎవరంటే.. హైఎండ్ లగ్జరీ కార్ల డీలర్. గచ్చిబౌలిలో హైదరాబాద్ కార్ లాంజ్ పేరుతో షోరూమ్ ఉంది. గత పదేళ్లుగా దీన్ని నడుపుతున్నాడు బసరత్ ఖాన్. మొదట్లో చిన్న కార్లు మాత్రమే అమ్మేవాడు. రాను రాను లింకులు పెంచుకుని, హై ఎండ్ కార్ల దాకా విస్తరించాడు. అయితే బసరత్ ఖాన్ ను అహ్మదాబాద్ ​లో మే 16న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారు. హామ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతోపాటు 30కి పైగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బసరత్​ ఖాన్ అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి లగ్జరీ కార్లను తెప్పించుకుని శ్రీలంక లేదా దుబాయ్ ద్వారా భారతదేశానికి మళ్లిస్తున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.

రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మోడీపై చేసి ఇంపోర్ట్

అమెరికా, జపాన్ ​లో అక్కడి అవసరాల ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే వాటిని దుబాయ్, శ్రీలంకకు తీసుకొచ్చాక.. లెఫ్ట్ సైడ్ డ్రైవ్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మోడిఫై చేసి నకిలీ పత్రాలతో ఇండియాకు దిగుమతి చేసుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఏదైనా వాహనం విలువ సుమారు కోటి రూపాయలు ఉంటే దాన్ని చాలా అండర్ వాల్యూ వేసి అంటే 40 లక్షలు, 50 లక్షలు మాత్రమే చూపుతూ ఇంపోర్ట్ చేయిస్తున్నాడు. ఇది అతడు DRI దర్యాప్తులో ఒప్పుకున్నాడు కూడా. ఇదే విషయాన్ని DRI ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. ఇలా 100 కోట్ల దాకా బసరత్ అహ్మద్ ఖాన్ కస్టమ్స్ ట్యాక్స్ ఎగవేసినట్లు అంచనా వేశారు. హై ఎండ్ లగ్జరీ కార్ల అక్రమ దందా వెనుక పెద్ద మోడస్ ఆపరాండీ ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై కోట్లల్లోనే సుంకాలు ఉంటాయి. ఇక విదేశాల నుంచి సెకండ్ హ్యాండ్ కార్లు అసలే దిగుమతి చేసుకోవద్దు. పూర్తి నిషేధం ఉంది. అయినా సరే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మార్చి గేమ్ నడిపిస్తున్నారు. వీటినే చాలా మంది సెలబ్రిటీలు కొంటున్నారు. ఇరుక్కుపోతున్నారు. అసలు ఈ దందా ఎలా నడుస్తుందో చూద్దాం.

సెకండ్ హ్యాండ్ కార్ల దిగుమతిపై నిషేదం

ఇండియాలో లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఒక పెద్ద సమస్యగా తయారైంది. మన కస్టమ్స్ చట్టాల ప్రకారం సెకండ్-హ్యాండ్ కార్ల దిగుమతిపై నిషేధం ఉంది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ రెసిడెన్స్ అంటే విదేశాల నుంచి భారత్ కు షిఫ్ట్ అయ్యే వారికి మాత్రమే మినహాయింపు ఉంది. అందులోనూ భారీగా ట్యాక్సులు చెల్లిస్తేనే కారు ఇండియాలో ల్యాండ్ అవుతుంది. లేకపోతే లేదు. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పటికీ హైఎండ్ కార్లు విచ్చలవిడిగా, చాటుమాటుగా ఇంపోర్ట్ అవుతూనే ఉన్నాయి. అక్రమ రూట్ల ద్వారా కార్లు తీసుకొచ్చి, ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేసి, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఇది ట్యాక్స్ ఎగవేత, మనీ లాండరింగ్, ఫోర్జరీలు చేసి కథ నడిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ నుమ్ ఖోర్ దేశంలో సంచలనంగా మారింది.

సెప్టెంబర్ 23న కేరళలో పెద్ద ఎత్తున సోదాలు

సెప్టెంబర్ 23న కేరళలో కస్టమ్స్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున లగ్జరీ కార్లపై సోదాలు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. భూటాన్ భాషలో నుమ్ ఖోర్ అంటే వాహనం అని అర్థం. ఎందుకంటే భూటాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా డంప్ చేసి తీసుకొస్తున్నారు. నిజానికి కేరళలో కస్టమ్స్ ఆఫీసర్లు ఒక్కసారిగా మూకుమ్మడిగా చెకింగ్స్ చేయడం వెనుక ఐదారు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. హీరోలు, సెలబ్రిటీలు, పొలిటీషియన్లు ఎవరెవరు హై ఎండ్ లగ్జరీ కార్లు వాడుతున్నారు.. వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు.. అవి వారి చేతికి ఎలా వచ్చాయి.. ఇలాంటి విషయాలపై ఇంటెలిజెన్స్ కూపీ లాగింది. ఈ సమాచారం ఆధారంగా కోయంబత్తూర్ గ్యాంగ్ నెట్ వర్క్ బయటపడిందంటున్నారు. కేరళలో 30కి పైగా ప్రాంతాలు కొచ్చి, తిరువనంతపురం, మలప్పురం, త్రిస్సూర్, కుట్టిప్పురం లాంటి చోట్ల సోదాలు చేశారు. ఇందులో మలయాళ సినిమా స్టార్లు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్లు సహా ఇండస్ట్రియలిస్టులు, లగ్జరీ కార్ డీలర్ షోరూమ్‌లలోనూ తనిఖీలు చేశారు. సల్మాన్ దుల్కర్ కు లగ్జరీ కార్లపై చాలా ఆసక్తి ఉంది. ఆయనకు ప్రత్యేకంగా ఓ గ్యారేజే ఉంది. అన్ని రకాల హైఎండ్ కార్లు ఉన్నాయి. ఫెరారీ నుంచి BMW దాకా మెయింటేన్ చేస్తున్నారు. సరే అది అతని ఆసక్తి. కానీ విదేశాల నుంచి దిగుమతి అయిన కార్లు ఎలా వచ్చాయన్నది కస్టమ్స్ ఆఫీసర్లు తేల్చబోతున్నారు. కేరళలో వయా భూటాన్ నుంచి వచ్చిన కార్లు మొత్తం 150-200 ఉన్నాయని అంచనా.

తక్కువ ధరకు భూటాన్ ఆర్మీ డీకమిషన్డ్ కార్లు

చాలా డిపార్ట్ మెంట్లలో రూల్స్ వయొలేట్ చేస్తే గానీ.. ఇలాంటి కార్లు మన రోడ్లపై తిరగలేవు. అందుకే ఈ కేసును క్రాక్ డౌన్ చేసే పనిలో దర్యాప్తు బృందాలు ఉన్నాయి. ఏయే ఆఫీసర్లు ఎలా ఈ వాహనాలకు అనుమతులు ఇచ్చారన్నది తేల్చబోతున్నారు. కేరళ ట్రాన్స్‌పోర్ట్ కమిషనరేట్, ATS, స్టేట్ పోలీస్, ఈడీ, GST, ఇన్‌కమ్ ట్యాక్స్, DRI, కస్టమ్స్ ఇలాంటి ఏజెన్సీలు విచారణలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. భూటాన్ ఆర్మీ డీకమిషన్డ్ కార్లను తక్కువ ధరకు కొని ఇండో-భూటాన్ బార్డర్ ద్వారా తీసుకువస్తారు. పార్ట్స్‌గా డిస్‌మాంటిల్ చేయడం, పెద్ద పెద్ద కంటైనర్లలో దాచడం, టూరిస్ట్ పర్మిట్ తో డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చి భారత్ లో వదిలి వెళ్లడం ఇలాంటివి చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ సహా వేర్వేరు చోట్ల మొదట రిజిస్టర్ చేసి, ఆ తర్వాత కేరళకు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈ హైఎండ్ కార్ల స్మగ్లింగ్ ఒక సాఫిస్టికేటెడ్ నెట్‌వర్క్ గా మారింది. భారత్‌తో ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భూటాన్‌లో ఇంపోర్ట్ డ్యూటీలు తక్కువ. ఇలాంటి లూప్ హోల్స్ వాడుకుని దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. సో ప్రస్తుతం చేసిన సోదాల్లో ఇలాంటి కారు ఓనర్లకు డాక్యుమెంట్లు చూపించాలని కస్టమ్స్ నోటీసులు ఇచ్చింది. ఫేక్ పేపర్లు ఉంటే కస్టమ్స్ చట్టాలు, పన్ను ఎగవేత చట్టాల ప్రకారం కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Also Read: సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ 

అసలు విదేశాల నుంచి సెకండ్ హ్యాండ్ కార్లు కొనడమే నిషేధం. అయినా సరే మాయ చేసి దందా నడిపిస్తున్నారు. ఆపరేషన్ నుమ్ ఖోర్‌లో గుర్తించిందేంటంటే.. 200కు పైగా కార్లు భూటాన్ నుంచే వచ్చాయని తేలింది. ఇక బసరత్ ఖాన్ కేసులో దుబాయ్ లేదంటే వయా శ్రీలంక నుంచి తీసుకొచ్చారు. అక్కడే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవ్ కు మార్చి ఇంపోర్ట్ చేశారు. బసరత్ ఖాన్ అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ సాధారణంగా కామన్ మ్యాన్ కు వచ్చే డౌట్ ఏంటంటే.. సెలబ్రిటీల దగ్గర కోట్లకు కోట్లు డబ్బులు ఉంటాయి. బడా వ్యాపారులు కోట్లాది రూపాయల టర్నోవర్ బిజినెస్ లు చేస్తారు. లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు. లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. మరి ప్రశాంతంగా జీవితం సాగాలంటే.. ట్యాక్సులు కట్టి పెద్ద కార్లు కొనుక్కోవచ్చు. కానీ అలా జరగడం లేదు. తక్కువకే వస్తున్నాయి కదా అని ఇలా అక్రమంగా, దొంగచాటుగా, ట్యాక్సులు ఎగ్గొట్టి, వాల్యూ తక్కువ చూపించి దేశాలు దాటి వచ్చిన హై ఎండ్ లగ్జరీ కార్లను కొనుక్కుంటున్నారు. ఇలా సెర్చ్ ఆపరేషన్ జరిగినప్పుడు జవాబులు చెప్పలేక ఇరుక్కుపోతున్నారు. తెలిసి కొన్నా.. తెలియక కొన్నా చట్టానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆ లాజిక్ మర్చిపోతున్నారేమో.

Story By Vidya Sagar, Bigtv

Related News

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Big Stories

×