Telangana: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం తెలంగాణలో ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ఎంపికకు 22 మంది ఏఐసిసి పరిశీలకులను ప్రకటిచింది. ఆ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్ పెట్టాలని క్రమశిక్షణ కమిటీ డిసైడ్ అయిందట. గాంధీ భవన్ లో నేతల బలప్రదర్శనకు చెక్ పెట్టాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందట.
కాంగ్రెస్‌లో విభేదాలు పరిష్కారానికి క్రమశిక్షణ కమిటీ
పదవులు, ఇతరాత్ర కారణాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల మధ్య విబేధాలను పరిష్కారించేందుకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా మల్లు రవిని నియమించింది. ఇక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు కాగానే తన పనిని మల్లు రవి స్టార్ట్ చేశారు చైర్మన్..జిల్లాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. విబేధాలు ఉన్న నేతలను గాంధీ భవన్‌కు పిలుస్తూ వారి ఒపీనియన్ తీసుకుంటున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ విభేదాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పొరుపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రమంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. నేతలు పరస్పరం క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పటికే కొండా మురళీ రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యే తమ వాదనలు వినిపించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయతీని పరిష్కారం చేసేందుకు మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్
ఇక సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి మిగతా నేతలకు పొసగడం లేదు. దీంతో డీసీసీ అధ్యక్షుడిపై క్రమశిక్షణ కమీటీకి ఫిర్యాదులు చేశారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన పూజల హరికృష్ణపై అక్కడి నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పూజల హరికృష్ణ పాల్పడుతున్నారని క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో క్రమశిక్షణ కమిటీ పూజల హరికృష్ణకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
గాంధీభవన్‌కు బలప్రదర్శనగా వస్తున్న నేతలు
మరోవైపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, ఫిర్యాదులపై చర్చించేందుకు క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ కానుంది. అదే విధంగా నేతలు క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తున్నప్పుడు బలప్రదర్శనగా తమ అనుచరులతో గాంధీ భవన్ కు వస్తున్నారు. ఇది పీసీసీకి తలనొప్పిగా మారింది. దీంతో ఇకనుంచి నేతలు బలప్రదర్శన చేయకుండా చర్యలు తీసుకునేందుకు పీసీసీ రెడీ అవుతున్నట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Also Read: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!
మొత్తానికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్యపోరును చెక్ పెట్టాలని ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఎన్నోచేసినా ఇప్పటి వరకి ఫలితం దక్కలేదు. మరి ఈసారి అయినా కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత విభేదాలకు చెక్ పెడతారా ఇలానే చూసి చూడనట్టు వదిలేస్తారా చూడాలి.
Story By Rami Reddy, Bigtv