Pailla Shekar Reddy: గుట్టలు మాయం చేసి వందల కొద్దీ ఎకరాల్లో రియల్ వెంచర్లు, బంధువులైన తన బినామీ కాంట్రాక్టర్లతో వేల కోట్ల రూపాయల పనులు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఆ మాజీ ఎమ్మెల్యేపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భారీ కుంభకోణాలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు విచారణకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటంతో సదరు గులాబీ నేత భయంతో నియోజకవర్గానికి దూరమయ్యారంట.. కారు గుర్తుతో గెలిచి పదేళ్లు ఎమ్మెల్యేగా దందాలు నడిపించిన ఆయన ఇప్పుడు ఎటు పారిపోయారో కూడా అంతుపట్టడం లేదంటున్నారు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే?
భువనగిరిలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత గులాబీ పార్టీని నడిపించే నాయకుడు కనపడకుండా పొయ్యాడు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జాడ లేకపోవడంతో నియోజకవర్గ బీఆరెస్ కార్యకర్తలలో అయోమయం నెలకొంది. దీంతో పార్టీ క్యాడర్ పక్కచూపులు చూడడం మొదలెట్టిందంట.
గత పది ఏళ్లగా తాను ఆడింది ఆట, పాడిందే పాటగా సాగిన పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రస్థానం ఒక్క ఓటమితో కుదేలైంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతల అక్రమాలపైన ఫోకస్ పెట్టడంతో తాను చేసిన ఆక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయం శేఖర్‌రెడ్డిని పట్టుకొని వేధిస్తుందంట. దాంతో ఏం చెయ్యాలో పాలుపోక ఆ మాజీ ఎమ్మెల్యే సైలెంట్‌గా సైడ్ అయిపోయారంట. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేత ముఖం చాటేయడంతో.. పార్టీని నడిపించే నాయకుడు లేక క్యాడర్ మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుందంట.
ఇక అధికారంలో ఉన్నపుడు పైళ్ల శేఖర్‌రెడ్డి అండతో భూవనగిరి నియోజకవర్గంలో పార్టీ నేతలు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి, అందినంత వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గుట్టలను మింగేసి అక్రమ వెంచర్లు వేయడం, వందలాది ఎకరాలు కబ్జా ఆరోపణలుమాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ మైనింగ్ శాఖ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని అనేక అక్రమాలకు తెర లేపారనే పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన వెంచర్లు, జరిగిన రిజిస్ట్రేషన్లపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలని చూస్తుండడంతో .. ఎక్కడ తన గుట్టు బయటపడుతుందన్న భయంతోనే పైళ్ల అడ్రస్ లేకుండా పోయారంటున్నారు.
Also Read: బీజేపీకి వలసల భయం.. గుడ్ బై చెప్పే ఆ నేతలు ఎవరు..?
ముఖ్యంగా తన సొంత బంధువులను కాంట్రాక్టర్లుగా పెట్టి.. దొడ్డి దారిన టెండర్లు దక్కించుకునో? లేకపోతే నామినేటెడ్ పద్దతి ద్వారా పనులు కేటాయింప చేసుకునో? మాజీ ఎమ్మెల్యే వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాయగిరి రెవెన్యూ పరిధిలోని తన 200 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ నుండి త్రిబుల్ ఆర్ రోడ్డు వెళ్లకుండా అలైన్‌మెంట్‌ను మార్చిన పెద్దమనిషి అతనేనని, రైతులను నిలువునా దోపిడీ చేసి వారికి సంకెళ్లు వేయించిన ఘనత కూడా ఫైళ్ల శేఖర్ రెడ్డికే దక్కుతుందని రాయగిరి వాసులు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో పైళ్ల శేఖర్‌రెడ్డి తన అక్రమాలపై ఫైల్స్ రెడీ అవుతున్నాయన్న భయంతోనే నియోజకవర్గం నుంచి పారిపోయారంటున్నారు.