BigTV English

Telangana BJP Leaders: బీజేపీకి వలసల భయం.. గుడ్ బై చెప్పే ఆ నేతలు ఎవరు..?

Telangana BJP Leaders: బీజేపీకి వలసల భయం.. గుడ్ బై చెప్పే ఆ నేతలు ఎవరు..?

తరాలు మారిన తల రాతలు మారలేదన్నట్టు .. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో బీజేపీ పరిస్థితి మాత్రం మారడం లేదు. రాష్ట్రంలో ఆ పార్టీ బలోపేతం అవ్వడం ఏమో కాని.. ఎంత కాలం గడుస్తున్నా ఇంకా అస్థిత్వ పోరాటంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది.. ఉన్న నేతలను కాపాడుకోవడంలోనే రాష్ట్ర నాయకత్వానికి పుణ్యకాలం గడిచిపోతుంది. స్వతహాగా క్యాడర్‌ను, లీడర్లను తయారు చేసుకోలేకపోతున్న బీజేపీ ఇతర పార్టీల నేతల మీద ఆధారపడటం ఆ పార్టీని మరింత అగాధంలోకి నెట్టివేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ వాదనకు ఊతమిస్తున్నాయి.

బీజేపీలో పుట్టి పెరిగిన కాస్తో కూస్తో పేరున్న నేతలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మిగిలిన వారంతా వలస నేతలే.. ఎయిట్ ప్లస్ ఎయిట్(8) కాబినేషన్లో ఉన్న కాషాయ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే.. బీజేపీ టికెట్‌తో గెలిచి మాజీలైన ప్రజాప్రతినిధులు కూడా వలస వచ్చిన నేతలే.. అలాంటి వారిని కాపాడుకోవడంలో బీజేపీ నాయకత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. పరిస్థితులను బట్టి కాషాయ నేతలు పార్టీని వీడుతూ తమ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావ్‌తో పాటు ఆయన బంధు, బలగమంతా కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఇప్పుడు బీజేపీలో చర్చానీయంశంగా మారింది.


బాపూరావ్ బీజేపీకి గుడ్‌బై చెప్పడంతో రాష్ట్రంలో మరోసారి వలసలు ఊపందుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీలను వీడి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మరోసారి బీజేపీ, బీఆర్ఎస్‌లకు వలసల గుబులు పట్టుకుందంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితుల్లో వుంది. పదేళ్లు చేసిన తప్పులకు సమాధానాలు చెప్పలేక, ఓటమిని తట్టుకోలేక, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా బాధ్యతలు నిర్వర్తించలేక కేసీఆర్ ఫామ్ హౌస్‌కే అవుతున్నారు. ఆ ఎఫెక్ట్‌తో ఆ పార్టీ నేతలు, క్యాడర్ సందిగ్దంలో ఉన్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి.

Also Read: కరీంనగర్ కాంగ్రెస్‌లో పురుమల్లు చిచ్చు..

ఇక మరోవైపు మిషన్ 90, బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాష్ట్ర బీజేపీ గత ఎన్నికల్లో ఊహించని విధంగా బొక్కబోర్లా పడింది. గత ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్ వంటి కీలక నేతలంతా బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. రాజకీయ గత్యంతరం లేని కొంత మంది వలస నేతలే బీజేపీని పట్టుకొని ఊగిసలాడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఈ నేఫథ్యంలో తాజాగా ఆ పార్టీ ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపు రావుతో పాటు మరికొంత మంది ఆపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీలో ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. మరికొంత మంది అదే బాటలో రెడీ అవుతున్నారని బీజేపీ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పుకునే ప్రతి సారి నేతలు పార్టీని వీడటం ఆపార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపుతోందంట.

2019 లో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు, ఒకే ఒక్క ఎమ్మెల్లే స్థానం దక్కాయి. ఆ నలుగురు ఎంపీల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు మాత్రమే గత పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి టికెట్ దక్కింది. ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కాదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన గూడెం నాగేష్‌కు బీజేపీ ఆ స్థానం కేటాయించింది. దాంతో ప్రముఖ ఆదివాసి నేత అయిన బాపూరావ్‌తో పాటు ఆదిలాబాద్ బిజేపీ క్యాడర్ అంతా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో… బీజేపీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసిన ముందు రోజే కీలక నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లైంది

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ గత ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నప్పటికీ కీలక నేతలు దూరమయ్యారు. తాజాగా స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి వలసలు మొదలవ్వడంతో ఆపార్టీలో నైరాశ్యం అలుముకుంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు , కొత్త నేతలు, పాత నేతల పంచాయితీలే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. కొత్త నేతలు ఎవరొచ్చినా ఎప్పుడో ఒకసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఉద్దేశంతోనే తట్టాబుట్టా సర్దుకుంటున్నారంట. పాత నేతలు కొత్త నేతలను కలుపుకుని పోవడానికి ఇష్టపడటం లేదని, తాము ముందు నుంచి పోరాటాలు చేస్తే.. భోగాలు మాత్రం కొత్త నేతలు అనుభవిస్తున్నారన్ని ఫీలింగ్‌తో వారు ఉన్నారంట

పార్టీలో కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి, యువతకు పార్టీలో పెద్ద పీట వేయాలనే ఆలోచన ప్రసంగాలకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో కనిపించడం లేదు. అందుకే ఎన్నికల సమయానికి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై ఆధారపడటం, వారికి టికెట్లు కేటాయించడం తమ వెనకబడటానికి ప్రధాన కారణమనే చర్చ ఆ పార్టీలో జరుగుతుంది. ఏదేమైనా పార్టీ అధ్యక్షుడి పంచాయతి, కొత్త పాత నేతల పంచాయితీలు, రాష్ట్ర నాయకత్వం వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్.. ఇలా అసలేం జరుగుతుందో అంతుపట్టకుండా తయారైన బీజేపీలో మళ్లీ వలసల పర్వానికి తెర లెగవడం హాట్ టాపిక్‌గా మారింది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×