– అక్రమాల పుట్టగా వెంకట్రామిరెడ్డి
– చేసిన పాపాల్ని కప్పిపుచ్చుకునేందుకే పొలిటికల్ ఎంట్రీ
– వందల ఎకరాల మాటున వేల కోట్ల సంపాదన
– వందల మంది రైతుల్ని నిండా ముంచేసిన బీఆర్ఎస్ నేత
– ఆధారాలతో మీడియా ముందుకొచ్చిన బీజేపీ నేతలు
– వెంకట్రామిరెడ్డి అక్రమాలపై స్వేచ్ఛ-బిగ్ టీవీ వరుస కథనాలు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం
BRS MLC Venkatrami Reddy Corruption List : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి. ఇప్పుడంటే పొలిటికల్ లీడర్‌గా ఉన్నారు. కానీ, ఈయన ఒకప్పుడు కలెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ అండదండలతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, వేల కోట్లు దండుకున్నారని, కావాల్సిన వారికి అనుకూలంగా పనులు చేసిపెట్టి లబ్ధి పొందారనే విమర్శలున్నాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ దక్కించుకున్నారని ఇప్పటికీ ఇతర పార్టీల నేతలు తిట్టిపోస్తున్నారు. తాజాగా బీజేపీ నేత గురువా రెడ్డి ఆధారాలతో సహా వెంకట్రామిరెడ్డి అవినీతిని బయటపెట్టడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
30 ఎకరాలు అవసరమైతే 300 ఎకరాల స్వాధీనం
బీఆర్ఎస్‌లో చేరకముందు సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నారు వెంకట్రామిరెడ్డి. ఆ సమయంలో కొందరు నేతలతో కలిసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సిద్దిపేట కలెక్టరేట్, వర్గల్ దగ్గర ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్క్, ఒంటిమామిడి దగ్గర ఉన్న ఆర్ఎన్ఆర్ కాలనీ, గజ్వేల్ దగ్గర ఉన్న ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 30 వేల ఎకరాలకు సంబంధించి పేదవాళ్ల భూములు అక్రమంగా లాగేసుకున్నారు. పేదవాళ్లను బెదిరించి, తరతరాలుగా దున్నుకుంటున్న అసైన్మెంట్ భూములే కాకుండా, పట్టాదారుల భూములను కూడా తీసుకున్నారు. గవర్నమెంట్ పర్పస్ అని చెప్పి అక్రమంగా అవసరమైన నోటిఫికేషన్లు లేకుండా 30 ఎకరాలు అవసరం ఉంటే 300 ఎకరాలు, 50 ఎకరాలు అవసరం ఉన్న చోట 400 ఎకరాలు ఇల్లీగల్‌గా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ మాఫియాను కాపాడుకోవడానికి 200 కోట్లు పోసి ఎంపీకి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ప్రజలు నిజాలు గ్రహించి ఆయన్ను ఓడించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా, తన పార్టీ అధికారంలో లేకపోయినా, కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఉన్నకున్న పరిచయాలను పునరుద్ధరించుకొని లోకల్ పోలీసులను ఉపయోగించి వేల ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. వాళ్లను అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై పోరాటం చేసి ఆపామని అన్నారు గురువా రెడ్డి.
ఆధారాలు ఇవే.. ఏం సమాధానం చెప్తారు?
ఈమధ్య గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించిన కుంభకోణాలపై తీవ్ర చర్చ జరిగింది. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో అవినీతి జరిగిందని బీజేపీ విమర్శలు చేసింది. దీనిపై దమ్ముంటే ప్రూవ్ చేయాలని సవాల్ చేశారు ఎమ్మెల్సీ. ఈ నేపథ్యంలో ఆధారాలతో సహా తొమ్మిది ప్రాజెక్టులలో చేసిన అవకతవలను వివరించారు గురువా రెడ్డి.
1. సంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు క్షీరసాగర విలేజ్ సర్వే నెంబర్ 161 ములుగు మండలం సంబంధించి 160 ఎకరాల పట్టా జాగాని రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని బినామీపై కొనుగోలు.
2. గజ్వేల్ మండలం ముట్రాజుపల్లిని సర్వే నెంబర్ 326, సర్వే నెంబర్ 331లో అక్రమాలు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు 331లో 141 ఎకరాలు, 326లో మొత్తం 342 ఎకరాలు ఉంటే, 397 ఎకరాలకు రైతులకు పరిహారం చేసినట్టుగా రికార్డు సృష్టించి దాదాపు 55 ఎకరాలకు సంబంధించిన డబ్బులు గాయబ్ చేశారు. పేదవాళ్లకు ఇస్తానన్న భూమి ఇంకా ఇవ్వలేదు. వాళ్లకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. దాన్ని 22(ఏ) లిస్టులో నుంచి కూడా తీసేయలేదు. బ్యాలెన్స్ 42 ఎకరాలు ఉంటుంది. ఆ 42 ఎకరాలకు సంబంధించి గ్రామస్తులకు ఇంతవరకు పరిహారం అందలేదు.
3. 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద సర్వే నెంబర్ 93లో 20 గుంటలకు గవర్నమెంట్ బిల్డింగ్ పర్పస్ కోసం తీసుకుని దానికి బదులుగా సర్వే నంబర్ 326లో ఎకరం భూమి రైతు దగ్గర తీసుకొని 20 గుంటలకు బదులుగా ఇస్తానని, ఎకరం రైతుకు అన్యాయం చేసి, డబ్బులు ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టారు. ఆ భూమి రింగ్ రోడ్డు పక్కన వస్తుంది కాబట్టి కమర్షియల్ వాల్యూ. 5 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. కానీ, పట్టాదారుకు రూ.7,50,000 మాత్రమే పరిహారం ఇచ్చారు.
4. సర్వే నెంబర్ 356 ప్రజ్ఞాపూర్ గ్రామంలో ల్యాండ్ సీలింగ్ కింద ఓ వ్యక్తి తనకున్న 39 ఎకరాల్లో 10 ఎకరాల 28 గుంటలను సరెండర్ చేశాడు. ఆయన పేరు విజయ్ కుమార్. అయితే, ఆ 10 ఎకరాలను పేదవాళ్లకు అసైన్ చేస్తున్నట్టు రికార్డు క్రియేట్ చేశారు రెవెన్యూ అధికారులు. ఇది వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సదరు భూస్వామి అందులోంచి 7 ఎకరాల 21 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీ రిజిస్టర్ చేశాడు. ఇదంతా వెంకట్రామిరెడ్డికి తెలిసే జరిగింది.
5. సిద్దిపేట కలెక్టరేట్ కోసం 40 ఎకరాలు అవసరం ఉంటే 357 ఎకరాలు తీసుకొన్నారు. 315 ఎకరాలు కమర్షియల్ వ్యాపారానికి. ఇండస్ట్రియల్ పార్క్ అంటూ వరంగల్‌లో తీసుకున్న భూములకు దాదాపు 370 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. అందులో ఉన్న రైతులందరికీ ఇంతవరకు పరిహారం రాలేదు.
6. మల్లన్న సాగర్ కింద 14 వేల ఎకరాలు 12 గ్రామాలకు సంబంధించిన వారు నిర్వాసితులకు ఇంతవరకు కూడా పక్కా ఇల్లు పూర్తి కాలేదు. అందరికీ పరిహారం సరిగ్గా రాలేదు. వాళ్లకు మళ్ళీ ఉపాధి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకట్రామిరెడ్డి అక్రమాలు ఎన్నో. వందల ఎకరాలకు సంబంధించి అక్రమంగా వేల కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారు.
వెంకట్రామిరెడ్డిపై వరుస కథనాలు
కలెక్టర్‌గా పని చేసినప్పుడు వెంకట్రామిరెడ్డి చేసిన బాగోతాలను వివరంగా అందించనుంది స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన వివరాల్ని డీటెయిల్డ్‌గా బయటకు తీసుకురానుంది. దీనిపై పూర్తి వివరాల్ని తర్వాతి కథనంలో చూద్దాం.