GHMC Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరనుంచి వరుస పరాభావాలు ఎదుర్కొంగున్న గులాబీ పార్టీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుకోవాలంటే, గ్రేటర్ బల్దియాపై గులాబీ గురి పెట్టిందంట .. వరుసగా మూడోసారి మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదపాలని చూస్తోందంట. గ్రేటర్‌లో పాగా వేసేందుకు వచ్చేవారం నుంచి ముఖ్యనేతలు, క్రియాశీల నేతలతో సమావేశాలు నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారట. లోక్‌సభ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత జరిగే ఎన్నికలు బీఆర్ఎస్‌కు సవాలుగా మారాయి. మరి బల్దియాలో కూడా బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి?
ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఆఖరి ప్రయత్నంగా గ్రేటర్ హైదదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై ఫోకస్ చేస్తోందట. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు కొత్తగా ఏర్పడిన మరో రెండు కార్పొరేషన్ల మేయర్ పీఠంపై బీఆర్ఎస్ పార్టీ గురి పెట్టిందంట. ఇప్పటికే రెండు పర్యాయాలు సాంత బలంతో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహాలు రచిస్తుందట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్చార్జ్లలతో ఇటీవల నిర్వ హించిన కీలక భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ మేరకు దిశానిర్దేశం చేశారట.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను 150 నుంచి ఇటీవల 300 డివిజన్లుగా విస్తరించారు. దీంతో ఇన్నాళ్లూ ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి.. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లకు పెరిగింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహా విస్తరణ చేపట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీతోపాటు కొత్తగా ఏర్పాటైన మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించిందంట.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే కార్యాచరణకు శ్రీకారం చుడుతోందట. ఇందులో భాగంగా మూడు కార్పొరేషన్ల పరిధిలో వచ్చే వారం మూడు వేర్వేరు సమావేశాలు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందట. ఆయా కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తలు కలుపుకొని సుమారు రెండు వేల మందితో నిర్వ హించే ఈ సమావేశాలకు కేటీఆర్ హాజరవుతారనేది గులాబీ నేతల నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.
జీహెచ్ఎంసీ చరిత్రలో వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ సొంత బలంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ ఫలితాలు సాధించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపిన ఓటర్లు…. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తిరిగి బీఆర్ఎస్ కే మద్దతు పలికినట్లు పార్టీ అంచనా వేస్తోంది. తీరా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోను బీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల ఎన్నికల్లోనైనా సత్తాచాటేలా గులాబీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. నగర ఓటరు బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు పార్టీ వ్యూహారచన చేస్తున్నారట. మూడు కార్పొరే షన్ల ఎన్నికల నాటికి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు…బీఆర్ఎస్ పాలనలో జరిగిన నగర అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయట.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్‌సభ, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లోను ఆశించిన ఫలితాల రాకపోవడంతో గులాబీ నేతలు ఢీలా పడిపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ పురపోరులో విస్తృతంగా గులాబీ నేతలు ప్రచారం చేసినా ఫలితాల సాధించడంలో వెనకబడిన పరిస్ధితి. ఇక గతంలో గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్స్‌లో బీఆర్ఎస్ అత్యధిక స్ధానాలు సాధించింది. ఎన్నికల తర్వాత శివారు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో జరగబోయే బల్దియా ఎన్నికలు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయి.
అభ్యర్ధుల ఎంపిక దగ్గర నుంచి మెజార్టీ డివిజన్‌లను సాధించడంలో ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములాగా మారింది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లకే తిరిగి టికెట్ ఇస్తారా…లేదా కొత్త వారికి ఇస్తారా అనేది పార్టీలో చర్చ నడుస్తుందట. ఎమ్మెల్యేలతో సాన్నిహిత్యం, సిట్టింగ్ కార్పొరేటర్ హోదా టికెట్ కేటాయింపులో ఎంత మాత్రం ప్రాతిపదికగా ఉండబోదని కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పినట్టు పార్టీ నేతలు చెబుతున్నారట. గ్రేటర్, ఇతర కార్పొరేషన్ల ఎన్నికల్లో ప్రజలతో మమేకమై గెలుపు అవకాశాలు ఉన్న వారికే చాన్స్ ఇచ్చేలా కార్యచరణ చేస్తున్నారట.
ఇటీవలి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కొందరు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.ఈ తరుణంలో నేతలు పనితీరుకు బల్దియా ఎన్నికలు గీటు రాయిగా పార్టీ నిర్దేశించే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే నేతలు కసరత్తు చేస్తున్నారట. నేతలు చేస్తున్న కార్యచరణ,వ్యూహాలతో ఎలాంటి ఫలితాల వస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: ధర్మాన కోసం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్.. సీనియర్ నేత మౌనం వెనుకున్న రహస్యం ఇదే!
Story by: Apparao, Big Tv