Chandrababu Govt: ఇల్లేమో దూరం.. పైగా చిమ్మ చీకట్లు.. దారంతా గోతులు.. చేతిలో దీపం లేదు.. కానీ ధైర్యమే ఓ కవచంగా మారింది. సరిగ్గా కూటమి ప్రభుత్వానిది ఇదే కథ. ఏపీ జనం మూకుమ్మడిగా చారిత్రక తీర్పు ఇచ్చి ఏడాది అవుతోంది. మామూలు విజయం కాదు. తమ భవిష్యత్ కోసం నమ్మి పాలనా పగ్గాలు అందించారు. తిరుగులేని విజయం ఇచ్చారు. మరి ఆంధ్రుల ఆశలతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో ఏం సాధించింది? సంచలన విజయాన్ని అందించిన జనానికి ఏం చేసింది?
కూటమికి జనం సంచలన విజయం కట్టబెట్టి ఏడాది
జనం పెట్టుకున్న ఆశలను సజీవంగా ఉంచుతూ.. కూటమి ప్రభుత్వ ప్రస్థానం మొదలైంది. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ఇవి ప్రాధాన్య అంశాలుగా.. ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఏడాది పూర్తయింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11స్థానాలకే పరిమితం అయింది. వేలకు వేలు మెజార్టీలతో కూటమి పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈ విజయం వెనుక జనం ఆశలున్నాయి. ఈ ప్రభంజనం వెనుక జనం ఆలోచన ఉంది. ఈ పగ్గాలు అప్పగించడం వెనుక జనం ఆవేదన ఉంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు
సరిగ్గా జనం ఆశలు, ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సాగింది. అభివృద్ధి, సంక్షేమం, సమన్వయం, కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ 9.4 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించిందంటే మాటలు కాదు. రాజధాని రెడీ కాకపోయినా.. పరిస్థితులు అనుకూలించకపోయినా.. కథ మార్చేసింది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రఖ్యాత సంస్థలను నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల గుంతల పూడ్చివేత
రాష్ట్రంలో రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది. గత వైసీపీ హయాంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వీటిని ముందుగా సరి చేసేందుకు సిద్ధమై గుంతలు పూడ్చేసింది. మెగా డీఎస్సీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. అటు రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, సబ్సిడీలను అందించే కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ భరోసా పథకం మైల్ స్టోన్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీని శరవేగంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెల ఒకటో తారీఖున కచ్చితంగా వేస్తున్నారు. సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. కమిట్ మెంట్ తో 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు.
ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్న సూపర్ సిక్స్ హామీలు
ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తోంది. పంద్రాగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు కేంద్ర సహకారంతో పాటు, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రఖ్యాత సంస్థలను ఆకర్షించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉపయోగంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలపై ఫోకస్ పెంచింది. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెన్షన్ పంపిణీ వంటి కార్యక్రమాలు జనం ఆశలను సజీవంగా ఉంచాయి. రాష్ట్రం సరైన దిశలోనే నడుస్తుందన్న నమ్మకాన్ని పెంచాయి.
సమస్యలను ఎదుర్కొంటూ.. సవాళ్లను అధిగమిస్తూ..
సమస్యలను ఎదుర్కొంటూ.. సవాళ్లను అధిగమిస్తూ.. ఇబ్బందుల్ని దాటుకుంటూ.. కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ విషయంలో కేంద్రంలోని ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడంతో కథ మారిపోతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, జీవనాడి అయిన పోలవరం పూర్తికి కట్టుబడి ఉండడంతో ఇవే రాష్ట్రాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ గా మారబోతున్నాయి.
కూటమి ఏర్పాటుతోనే మారిన దశ
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు చాలా కలిసి వచ్చింది. చెప్పాలంటే ఏపీలో ఏడాదిలోనే ఇంతలా మ్యాజిక్ జరగడానికి కారణం ఈ కూటమి ఏర్పడడమే. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంలో ఏపీ ఎంపీల బలం చాలా పని చేసింది. ఇదే దశ దిశ మారడానికి కారణమవుతోంది. అటు కేంద్రం కూడా రాజధాని లేని రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఏపీకి వరాల జల్లు కురిపిస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే చాలా అద్భుతాలు కూడా జరిగాయి.
పోలవరం, అమరావతికి కేంద్రం చేయూత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు వచ్చేలా వ్యవహారం నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ కోరుకున్న వాటిలో ప్రధానమైనవి రెండే. ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, మరొకటి రాజధాని అమరావతి నిర్మాణం.. ఇవే కీలకం అయ్యాయి. ఈ రెండింటి నిర్మాణమే పూర్తి చేసే లక్ష్యంతో అడుగులు పడ్డాయి.
రాష్ట్రాభివృద్ధిలో పోలవరం గేమ్ ఛేంజర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయ్యే వెయ్యి కోట్ల రూపాయల ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించేలా సీఎం, డిప్యూటీ సీఎం ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు కేటాయించారు. ఇప్పటికే పనులు వేగం పుంజుకున్నాయ్. 2027లోపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని నమ్మకంతో ఉన్నారు.
రూ. 64,721 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
ఇక ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం కూడా గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టును మళ్లీ వేగంగా పట్టాలెక్కించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా, విద్యా కేంద్రంగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 64 వేల 721 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరుగుతోంది. ఇందులో కేంద్రం నుంచి 15 వేల కోట్లు, వరల్డ్ బ్యాంక్, ADB బ్యాంక్ కలిపి మొత్తం 13,500 కోట్లు, హడ్కో 11 వేల కోట్లు నిధులు సమకూరుస్తున్నాయి. 2027 నాటికి రాజధాని నిర్మాణాలను పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే అమరావతి పనులను ప్రధాని మోడీ స్వయంగా రీలాంఛ్ కూడా చేశారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కొప్పర్తి ఎంపిక
ఇక ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవేస్ నిర్మాణం, అభివృద్ధికి కేంద్రం 4,770 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులు రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి వాడుతున్నారు. వీటికి తోడు కడప జిల్లాలోని కొప్పర్తిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 8 వేల కోట్లతో 8 కొత్త స్మార్ట్ సిటీల ప్రాజెక్టుల్లో ఏపీకి కూడా కేంద్రం చోటు కల్పించింది. ఈ ప్రాజెక్టు కింద అత్యాధునిక రవాణా సదుపాయాలు, విద్యుత్, తాగునీరు, మురుగునీటి పారుదల, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇది నెక్ట్ జెనరేషన్ సిటీగా అవుతుందన్న మాట.
2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించే లక్ష్యం
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. అటు విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించింది. రాష్ట్రం ఇప్పటికే డీపీఆర్‌లు కేంద్రానికి పంపించింది. దీని ద్వారా భారీ నిధులు సమకూరే అవకాశం ఉంది. ఇవే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించే లక్ష్యంతో స్వర్ణాంధ్ర విజన్ తో ఉంది. ఒక్క ఏడాదిలోనే ఎంతో జరిగింది.. ఇక రాబోయే సంవత్సరాల్లో ఏమేం చేయాలన్నది కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. ఆ ప్రకారమే ఒక్కో మెట్టు ముందుకెళ్తున్నారు.
విశాఖలో ఎలక్ట్రానిక్స్ ఐటీ హబ్ డెవలప్ కోసం కృషి
ఇవే కాదు.. చాలా లక్ష్యాలను కూటమి ప్రభుత్వం ముందేసుకుంది. ఒకవైపు అభివృద్ధితో పాటే సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్స్ ఐటీ హబ్ డెవలప్ కోసం కృషి చేస్తోంది. 1,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు కూడా. అలాగే 2027 నాటికి 20 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే లక్ష్యంతో పని చేస్తున్నారు. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీని 8 వేల మెగావాట్ల నుంచి 10 వేల మెగావాట్లకు పెంచేలా టార్గెట్ పెట్టుకున్నారు. వృత్తి విద్యను ప్రోత్సహించడం ద్వారా 2027 నాటికి 5 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, రాష్ట్రంలో రోడ్లు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాలను 2027 నాటికి ఆధునీకరించడం మరో ముఖ్యమైన టార్గెట్. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయడం మరో కీలకమైన టార్గెట్ గా ఉంది.
అమరావతి రీలాంఛ్, పోలవరం స్పీడ్
కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో అమరావతి, పోలవరం, పరిశ్రమల అభివృద్ధి, విద్య, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా నడిపించే లక్ష్యంతో పనిచేస్తోంది. 2026-2028 నాటికి అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం, 20 లక్షల ఉద్యోగాల సృష్టి, విద్యా-సంక్షేమ సంస్కరణలు వంటి లక్ష్యాలతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సంపద సృష్టి వంటి విషయాల్లో ముందడుగు వేస్తోంది. ఒకవైపు ఏడాదిలోనే మార్పు స్పష్టంగా కనిపించడం, అమరావతి రీలాంఛ్ అవడం, పోలవరం స్పీడ్ అందుకోవడం, రోడ్లు బాగు చేయడం, మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ కీలకంగా ఉంటే.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నుంచి విమర్శలు కూడా పెరిగాయి.
ప్రతిపక్షానికి ఘాటుగా కూటమి కౌంటర్లు
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు క్షీణించాయన్నది జగన్ విమర్శ. అమరావతి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అతిగా ఖర్చు చేస్తోందని, ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందన్న వాదన వినిపించారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో ఆలస్యం కారణంగా.. రిజల్ట్ వచ్చిన జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుపుతామని పిలుపునిచ్చారు. అయితే వీటికి అధికార కూటమి పార్టీ అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తోంది. గత జగన్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి, మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి స్తంభించిందని ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయిందో ఆలోచించుకోవాలంటున్నారు.
Story By vidya sagar, Bigtv Live