Chandrababu Naidu: ఏపీలో కొందరు మంత్రులపై రకరకాల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వ్యవహార తీరు, అవినీతికి సంబంధించి ప్రచారాలు మొదలయ్యాయి. మంత్రివర్గంలో ఈ సారి చంద్రబాబు సీనియర్లను కాదని మెజార్టీ సభ్యులను కొత్తవారినే తీసుకున్నారు.. పార్టీ ఫ్యూచర్ అవసరాల కోసం కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు. అయినా కొందరు మంత్రులపై ఏడు నెలలకే ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారంట. 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమని అడిగినా కొందరు స్పందించకపోవడంపై అసహనంతో ఉన్నారంట. ఆ క్రమంలో అప్పుడే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలవ్వడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తుంది. అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీ భవిష్యత్తు అవసరాల కోసం కొత్త తరానికి పెద్దపీట వేశారు. అయితే మొదటిసారి కేబినెట్ బెర్త్‌లు దక్కించుకున్న వారిలో కొందరిపై నెగిటివ్ టాక్ మొదలైంది. దాంతో అతిత్వరలోనే కొందరు మంత్రులు మాజీలు అవుతారన్న అంశం టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మంత్రి వర్గంలో చేర్పుల విషయానికి వస్తే.. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబును కెబినెట్లోకి తీసుకుంటారనే క్లారిటీ ఉంది. కెబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశం మీద స్పష్టత లేదు కానీ.. స్వయంగా చంద్రబాబు పేరు మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదే ప్రకటన విడుదలైంది కాబట్టి.. క్యాబినెట్లో నాగబాబు చేరిక ఖాయమే. ప్రస్తుతానికి ఈ విషయంలో వేరే ఆలోచనలకు తావు లేదు. అయితే చర్చ అంతా కెబినెట్టులో మార్పుల మీదే జరుగుతోంది. వేటు పడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్ధసారధి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనిత పీఏ జగదీశ్ వ్యవహారంతో ఆమె కూడా ఆ లిస్టులో చేరిందంటున్నారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈయన్ను కెబినెట్టులో నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని చూస్తే సుభాష్ ను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలు దాదాపుగా కన్పించడం లేదనే చెప్పాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా.. జూనియర్లను.. యువతను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో సుభాష్ కే అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేయించడంలో విఫలమయ్యారు. పార్టీ నిర్దేశించిన టార్గెట్‌ను సుభాష్ రీచ్ అవ్వకపోవడంతో చంద్రబాబు ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారంట. దానికి సంబంధించి లీకైన ఆడియో వైరల్ అయింది.
వైసీపీ కార్యకర్తగా ఉంటూ టీడీపీ ఎమ్మెల్యే అయి.. ఆ తర్వాత అదృష్టం కలసి వచ్చి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. తర్వాత రామచంద్రపురం టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అదృష్టం తన తలుపు తట్టినట్లే.. ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదట. ఏదో ఒక రూపంలో చిక్కులు, చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందట.
సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేసిన ఏదో ఒక వివాదానికి దారితీస్తూనే వస్తుందట. అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజికవర్గం వరకు ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వ్యాపిస్తుందట.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండడం.. వారికి కాకుండా సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వడం ఆ జిల్లాలో ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో క్యాబినెట్ షఫిలింగ్ జరిగితే సుభాష్‌ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. సుభాష్ ను తప్పించడం అంటూ జరిగితే.. పితానికి ఛాన్స్ ఖాయమంటున్నారు.
ఇక మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాం ప్రసాద్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రి వర్గంలో అతి తక్కువ కాలంలో ఎక్కువగా బద్నాం అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డే. రాంప్రసాద్ రెడ్డి పేషీలో జరిగే వ్యవహరాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేసిందని.. ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాం ప్రసాద్ రెడ్డిని తప్పిస్తే.. ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నా.. అదే జిల్లా నుంచి ఆనం ఉన్నారు కాబట్టి.. సోమిరెడ్డికి ఎంత వరకు ఛాన్స్ ఉంటుందో చూడాలి. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు . వాస్తవానికి క్యాబినెట్‌లో కిషోర్ కుమార్ రెడ్డి పేరు కచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ కిషోర్ కుమార్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లింది అధిష్టానం. అలాగే కడప జిల్లా నుంచే అదే సామాజిక వర్గానికి చెందిన మాధవి రెడ్డి పేరును పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు.
Also Read: చిచ్చుపెట్టకు.. విడాకులేం ఉండవు.. లోకేష్ క్లారిటీ
ఇక క్యాబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరూ ఉంది. కొండపల్లి శ్రీనివాస్ పేరు తెర మీదకు రావడానికి కారణం లేకపోలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురుభక్తిని చాటుకుంటూ బొత్స కాళ్లకు మొక్కి.. ఆశీర్వాదం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన టీడీపీలో అందరికీ టార్గెట్ అవుతున్నారు. బొత్సను ఓడించిన సీనియర్ నేత.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి.. అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే.. బొత్సను గురువుగా చెబుతూ.. ఆయన కాళ్లకు మొక్కుతారా..? అని తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అ ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే.. కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కుతుందంటున్నారు. తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో కొండపల్లి మీడియా ముందుకొచ్చి వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది
ఇక మంత్రి పార్ధసారధి వ్యవహరం గురించి కీలకమైన చర్చే జరుగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చినా.. టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ పార్దసారధికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడులో పార్ధసారధి పార్టీలో బాగా డామేజ్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి జోగు రమేష్‌తో కలిసి ఒక జీపులో ర్యాలీలో పాల్గొని అభాసుపాలయ్యారు. దాంతో పార్దసారధిని తప్పించి.. పల్లా శ్రీనివాసును కెబినెట్టులో చేర్చుకుంటారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడుపై చంద్రబాబు, లోకేష్ స్పందించిన తీరు చూస్తుంటే.. పార్దసారధి వికెట్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం కనిపిస్తుంది
మరో వైపు హోం మంత్రి అనిత పీఏ జగదీశ్‌పై తీవ్ర ఆరోపణల నేపధ్యంలో హైకమాండ్ రియాక్ట్ అవ్వడంతో ఆమె అతన్ని పదవి నుంచి తప్పించారు. పదేళ్ల నుంచి తన పీఏగా ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయిన వంగలపూడి అనిత ఇక హోం శాఖను ఏం డీల్ చేస్తరన్న టాక్ వినిపిస్తుంది. ఇక మరోమంత్రి హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రిపైనా విమర్శలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి భర్త డామినేషన్ ఎక్కవైందంట ఎంపీ, ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదంట. కొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బంది అక్రమాలు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు నివేదికలు వెళ్లాయంటున్నారు.
మంత్రులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారంట. ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత కూడా చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారంట. అవినీతి, దందాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారంట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతి ఆరోపణలు రావడంతో ఇద్దరు మంత్రులపై ఏడాది లోపే వేటు వేశారు.2014లోను ఏడాదిలోపే అవినీతి ఆరోపణలు రావడంతోనే ఇద్దరు మంత్రులపై వేటు వేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అలానే చర్యలు తీసుకుంటారనే ప్రచారం మొదలైంది.
మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారంతో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారనే చర్చ నడుస్తోంది. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతుంది. టీడీపీ నుంచే కాకుండా బీజేపీ, జనసేన నాయకులు కూడా లాబీయింగ్‌లు మొదలుపెట్టారంటున్నారు. పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.. అదలా ఉంటే అసలు ఇంత తక్కువ కాలంలో మంత్రి వర్గం నుంచి ఎవర్నైనా ఎందుకు తప్పిస్తారు..? అనేది చర్చల్లో నలుగుతుంది. ఏది ఏమైనా అతి తక్కువ కాలంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై ఈ స్థాయిలో చర్చ జరగడం గతంలో ఎప్పుడూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.