PAC Meeting: ప్రభుత్వానికి- పార్టీకి మధ్య సమన్వయం కచ్చితంగా ఉండాలని తేల్చి చెప్పేశారు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలన్నది సమావేశంలో ప్రధాన హైలైట్. ఏడాది ప్రభుత్వ పాలన బాగుందని, ఇంకా మెరుగ్గా చేయాలన్నారు.
పార్టీ నేతలు, మంత్రుల పని తీరును విశ్లేషించిన ఆయన, చాలామంది నేతలు, మంత్రులు క్షేత్రస్థాయిలో తిరగలేదన్న విషయాన్ని గుర్తు చేశారు కేసీ వేణుగోపాల్. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని, భారీగా పథకాలు అమలు చేస్తున్నా, ప్రజలకు ఎందుకు వివరించలేక పోతున్నారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
కేవలం ముఖ్యమంత్రి సభలు ఒక్కటే సరిపోతుందన్నారు ఏఐసీసీ కార్యదర్శి. బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి 23 మంది కమిటీ సభ్యులు, మంత్రులు, మాజీ పీసీసీలు, మాజీ సీఎల్పీ నేతలు హాజరయ్యారు.
ఈ ఏడాదిని పార్టీ సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా తీసుకోవాలని సూచన చేశారు కేసీ వేణుగోపాల్. ముఖ్యంగా పంచాయితీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. కేవలం నెల రోజుల్లోపు కమిటీలు వేయాలన్నారు. ఇకపై ప్రతీ నెలలా పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ALSO READ: ఏసీబీ ముందుకు కేటీఆర్.. గుట్టు విప్పిన అరవింద్ కుమార్, ఇక మిగిలింది
వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీవర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లేదంటే దీని ప్రభావం ఆయా ఎన్నికలపై పడే అవకాశముందన్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లో సంవిధాన్ బచావ్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు పీసీసీ తెలిపింది.
ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనను వేణుగోపాల్ ప్రశంసించారు. దేవాదాయ శాఖలో కార్యకర్తలకు సముచిత స్థానం ఇకపై ఇవ్వనుంది. ఇటీవల బెల్గాంలో జరిగిన ఏఐసీసీ మావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది పీఏసీ కమిటీ. దాదాపు రెండుగంటలపాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.