Ghee Case: వైసీపీ పాలనలో ఐదేళ్లు తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తనతోనే కాదు.. దేవుడితో సైతం వైసీపీ వాళ్లు పెట్టుకున్నారని, ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారని, సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్‌చిట్ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌తో ఏకాంతంగా సూదీర్ఘ భేటీ జరిగిన మరుసటి రోజే చంద్రబాబు కూటమి ముఖ్యనేతలతో కలిసి మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు సుమారు రెండున్నర గంటలపాటు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారంట. కుల రాజకీయాలను, మత విద్వేషాలను వైసీపీ రెచ్చగొడుతుందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు, ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వారు నిర్ణాయానికి వచ్చారట. కిందస్థాయిలో టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ప్రత్యేకంగా కలిశారు. సీఎం – డిప్యూటీ సీఎంల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల లడ్డూ కల్తీ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాలని, అన్ని అంశాలను బయటపెట్టాలని నిర్ణయించారంట. అది జరిగిన మరుసటి రోజే . కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్‌యాదవ్ తదిరులు మీడియా ముందుకి ఐక్యంగా వచ్చి వైసీపీపై నిప్పులు చెరిగారు.
తిరుమల ప్రసాదాల విషయంలో అపచారం జరిగిందని, లడ్డు ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగించి ఆలయ పవిత్రతను దెబ్బతీసారని కూటమి ప్రభుత్వం ముందు నుంచి ఆరోపిస్తోంది. దానిపై కేంద్ర సీబీఐతో కలిపి నియమించిన సిట్ బృందం విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు కల్తీ జరగలేదని, జంతువుల కొవ్వుతో నెయ్యి తయారుచేసారడం అవాస్తవమని సిట్ తేల్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అంబటి రాంబాబు ఒక్కరే కాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్, సజ్జల సహా అదే పల్లవి వల్లెవేస్తూ ప్రజలను గందరగోళ పరుస్తున్నా.. కూటమి నేతలు దానికి సమర్ధంగా కౌంటర్ ఇవ్వకపోవడం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ నేపధ్యంలో సీఎం, డిప్యూటీ సీఎంలు డ్యామేజ్ కంట్రోల్‌కు నడుం బిగించారు. వారి ఏకాంత చర్చల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు ఒకే వేదికగా మీడియా మందుకొచ్చారు.
తిరుమల లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వినియోగం వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏకసభ్య కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని ఆయన కుండుబద్దలు కొట్టారు. మాజీ సీఎం జగన్ తప్పులు చేసి తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
జగన్ అన్యమతస్తుడు కావడంతో నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి ఆయన తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని విమర్శించారు. రసాయనాలు కలిపారని సీబీఐ చార్జ్‌షీట్‌లో ఉందని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ సైతం ఈ ఉదంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు NDDB నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారన్నారు. నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారన్నారు. సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్‌చిట్ ఇవ్వలేదని, రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉందని, ఇప్పటికైనా వారుచేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలని పేర్కొన్నారు.
శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారని తీవ్రస్థాయిలో మండిపడ్డ జనసేనాని, ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలన్నారు. వైసీపీ వారు భగవంతుడికి మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టబోమని, హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామన్నారు. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరమని, . 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా, అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.
వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు గతంలో పోటు కార్మికులు తమకు ఫిర్యాదు చేశారని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అప్పటి ఈవో ధర్మారెడ్డికి పోటు కార్మికులు ఆ విషయం చెపితే.. ఆర్గానిక్ నెయ్యి అలానే ఉంటుందని బుకాయించారని విమర్శించారు. NDDB రిపోర్టుతో అందరు నివ్వెరపోయారని, కల్తీ జరిగినట్లుగా నివేదిక వచ్చిందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.
Also Read: ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు.. ఎమ్మెల్యే శ్రీధర్‌కు ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం!
మొత్తానికి వైసీపీ చేస్తున్న దుష్ప్రాచరంపై ఇప్పటికైన తమ నేతలు ఐక్యంగా ధ్వజమెత్తడంపై కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా సిట్ రిపోర్టులో అసలు ఏముందనేది ఉత్కంఠ రేపుతోంది.