Chandrababu Warning: చంద్రబాబు హెచ్చరికలు, వన్ టూ వన్ పీకుతున్న క్లాసులతో ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందంట. తాను చేయించుకుంటున్న సర్వేల నివేదికల ఆధారంగా పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలని నేరుగా పిలిచి మాట్లాడతానని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేల్ని పిలిచి క్లాస్ పీకారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు నుండి పిలుపొస్తుందేమోనన్న ఆందోళన పలువురు ఎమ్మెల్యేల్లో నెలకొందంట. అసలు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?
ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు టెన్షన్
ప్రకాశం జిల్లా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు టెన్షన్ పట్టుకుందంట.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.. ఇప్పటికే ఎమ్మెల్యే పని తీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. పని తీరుబాగోలేని ఎమ్మెల్యేలని నేరుగా పిలిచి క్లాస్ పీకుతున్నారు.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలని పిలిచి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారంట… పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలని నేరుగా పిలిచి మాట్లాడతానని చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు.
పార్టీ అధినేతకి తమపై ఏం ఫిర్యాదులు అందాయో అని టెన్షన్
దాంతో ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొందట . పార్టీ అధినేతకి తమపై ఏం ఫిర్యాదులు వచ్చి ఉంటాయోనన్న టెన్షన్ కొంత మంది ఎమ్మెల్యేల్లో నెలకొందట. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 10 నియోజక వర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. నియోజక వర్గాల్లో గెలుపు అందుకున్న ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలు దక్కించుకున్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నియోజక వర్గాల్లో ఆదాయవనరులపై దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో చేసిన అక్రమార్జన బాటలోనే కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని అభియోగాలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు
దాంతో పాటు కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల కుటుంబ పాలన సాగుతోందట.. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారంట. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న కొంత మందికి నేరుగా ఫోన్లు చేసి సీఎం చంద్రబాబు ఇప్పటికే క్లాస్ పీకారట. అయినా పద్దతి మారని ఎమ్మెల్యేల్ని నేరుగా పిలిచి వారి పని తీరుపై క్లాస్ తీసుకుంటున్నారట. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డిలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పిలిచి మాట్లాడారంట. రెండు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరుతో పాటు నియోజక వర్గాల్లో చెయ్యాల్సిన అభివృద్ది పనులపై చర్చించినట్టు తెలుస్తోంది.
సదరు ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి ఆరాలు తీస్తున్న మిగిలిన ఎమ్మెల్యేలు
ఆ రెండు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల కుటుంబ పాలన పై సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందని నలుగురు ఎమ్మెల్యేల్ని పిలిచి వారి పని తీరుపై ముఖాముఖి మాట్లాడనని మంగళగిరి సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేల్ని పిలిచి మాట్లాడతానని సీఎం చెప్పడంతో మిగిలిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైందట. ఆ క్రమంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకి వెళ్లి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి కొంత మంది ఆరా తీస్తున్నారంట.
Also Read: 20 వేల కోట్లతో ఏపీకి వచ్చే భారీ ప్రాజెక్టులు ఇవే.!
సీఎం చంద్రబాబు ఏ ఏ విషయాలు ప్రస్తావించారని అడిగి తెలుసుకుంటున్నారట. సీఎం నుండి పిలుపువస్తే ఏం సమాధానం చెప్పాలా అని కొంత మంది ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నట్లు వారి అనుచరులు అంటున్నారు. మరి సీఎం చంద్రబాబు నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంత మంది ఎమ్మెల్యేలకు పిలుపువస్తుందో చూడాలి.
Story By Rami Reddy, Bigtv