BigTV English

CM Chandrababu Progress Report: 20 వేల కోట్లతో ఏపీకి వచ్చే భారీ ప్రాజెక్టులు ఇవే.!

CM Chandrababu Progress Report: 20 వేల కోట్లతో ఏపీకి వచ్చే భారీ ప్రాజెక్టులు ఇవే.!

CM Chandrababu Progress Report: సీఎం చంద్రబాబు విజన్‌తో.. ఏపీ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు.. నాలుగు పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. 20 వేల కోట్లతో.. భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే ఆగస్ట్ 15 నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్స ప్రయాణం కల్పించాలనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకు అనుగుణంగా.. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.


జులై 21, సోమవారం ( మహిళలకు ఫ్రీ జర్నీ )
వచ్చే పంద్రాగస్టు నుంచి రాష్ట్రంలో మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో.. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని.. సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి.. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రతి ఉచిత ప్రయాణంలో మహిళలకు ఎంతమేర లబ్ధి చేకూరుతుందనే వివరాలతో కూడిన జీరో ఫెయిర్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి.. సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏయే రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది? ఏపీలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై సీఎం చర్చించారు. నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని.. అధికారులకు చంద్రబాబు సూచించారు. లాభార్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.

జులై 21, సోమవారం ( గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ )
ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని, 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ రూపొందించారు.


జులై 22, మంగళవారం ( ఫార్మర్ ఫస్ట్ )
రైతులకు మేలు చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే నిర్వహించాలని.. ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డులను అప్‌డేట్ చేయాలని.. అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయం- అనుబంధ శాఖలు, నీటి నిర్వహణపై.. ఈ వారం సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని కాలువలకు నీళ్లు వదలాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే.. 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఈ-కేవైసీ పూర్తయింది. త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. యాప్‌ ద్వారా మత్స్యకారులకు సముద్ర, మత్స్యసంపద వివరాలు తెలియజేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

జులై 23, బుధవారం ( హెల్దీ ఏపీ )
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా, ముందస్తు జాగ్రత్తతో వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవాలని.. సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ వారం వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. టాటా ట్రస్ట్‌-గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్లను వచ్చే ఏడాది చివరికి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్ల కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామని.. వచ్చే ఏడాది జనవరిలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా టాటా డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్లను ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు ఎలా అందించొచ్చన్న అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో.. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ లాంటి టెస్టులు.. పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాలను గుర్తించేలా కేర్‌ అండ్‌ గ్రో పాలసీని సమర్థంగా అమలు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండాలనే ప్రభుత్వ పాలసీని పక్కాగా అమలుచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని చెప్పారు చంద్రబాబు. వైద్య కళాశాలల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. నేచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని లాంటి సంప్రదాయ వైద్య పద్ధతులను యాక్టివేట్‌ చేయాలని సూచించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ డైరెక్టరేట్‌లో 150 పోస్టులను భర్తీచేసేలా ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు.

జులై 23, బుధవారం ( రైజింగ్ ఏపీ )
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఏపీకి.. కొత్తగా 20 వేల 216 కోట్ల విలువైన నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫి, సత్వా, బివిఎం, ఎఎన్ఎస్ఆర్ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ఈ వారం సచివాలయంలో జరిగిన 9వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో.. ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సంస్థలు డిజిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రెసిడెన్షియల్, సేవల రంగాల్లో.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనితో.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని SIPB ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వారా 50 వేల 600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు SIPB ద్వారా మొత్తం 113 ప్రాజెక్టులకు సంబంధించి 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవి.. రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాలు పెంచుతాయని తెలిపింది.

జులై 23, బుధవారం ( పెట్టుబడుల ఆకర్షణ )
సంవత్సరంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం 15 రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఇన్వెస్టోపియా, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు భాగస్వామ్యంతో.. విజయవాడ నోవోటెల్‌లో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ -2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యూఏఈ నుంచి అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల సాకారం కోసం ఫెసిలిటేటర్‌గా తానే వ్యవహరిస్తానని చెప్పారు. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఏపీఈడీబీ- ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ వ్యాలీని ఏపీలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సీఎం. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల ప్రతిపాదనలను సీఎంవో నేరుగా పర్యవేక్షిస్తుందన్నారు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను చెల్లిస్తామన్నారు. త్వరలోనే విశాఖలో గూగుల్‌ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందన్నారు.

సీఎం చంద్రబాబు.. సింగపూర్ టూర్‌ కొనసాగుతోంది. ఈ వారం ఆయన షెడ్యూల్ మొత్తం బిజీబిజీగా సాగింది. ఏపీలో పేదరిక నిర్మూలనకు సీఎం పిలుపునిచ్చారు. పీ4 పథకంలో భాగంగా కుప్పంలో 250 కుటుంబాలను సీఎం చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఏపీలో వెయ్యి కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా.. ఈ వారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

జులై 24, గురువారం ( రోడ్లకు మహార్దశ )
వర్షాకాలం పూర్తవగానే.. వెయ్యి కోట్లతో 2 వేల కిలోమీటర్ల రోడ్లు కొత్తగా నిర్మించాలని.. అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రోడ్లు భవనాల సంబంధిత అంశాలపై.. ఈ వారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. రోడ్ల అభివృద్ధికి సంబంధించి అంచనాలు రూపొందించి, త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇప్పటికే.. రాష్ట్రమంతటా 20 వేల కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా.. రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేశారు. దెబ్బతిన్న మిగిలిన రోడ్లకు కూడా 500 కోట్లతో మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల విషయంలో.. తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో.. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయని తెలిపారు. రాష్ట్రంలో రోడ్లన్నింటిని.. నేషనల్ హైవేల స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని సీఎం ఆదేశించారు. సరికొత్త టెక్నాలజీతో రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్లపై ట్రాఫిక్ అంచనా వేసేందుకు.. ప్రతి 50 కిలోమీటర్లకు ఓ సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జులై 24, గురువారం ( క్వాంటమ్ కమింగ్ )
దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ.. నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగస్వామిగా ఉన్న.. సుప్రసిద్ధ సమగ్ర క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ సొల్యూషన్స్ సంస్థ క్యూపీఐఏఐ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో క్యూపీఐఏఐ కూడా భాగం కానుంది. అడ్వాన్స్‌డ్.. 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని క్యూపిఐఏఐని సీఎం చంద్రబాబు కోరారు. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో.. డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించటమే లక్ష్యంగా క్యూపిఐఏఐ, నేషనల్ క్వాంటమ్ మిషన్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

జులై 24, గురువారం ( క్యాబినెట్ కీ డెసిషన్స్ )
ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని రెండో విడతగా మరో 44 వేల ఎకరాల భూసేకరణను ఆమోదించారు. స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని.. మిగులు వరద జలాలనే ఏపీ వాడుకుంటుందని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేరీతిలో కూటమి నేతలు చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌పై దశలవారీగా ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం ఏం చెబుతుందో దాని ఆధారంగా నిర్ణయం తీసుకుందామని వివరించారు. రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అన్న క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. క్యాంటీన్లను మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఓ కమిటీ వేయాలని సూచించారు. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం ఆదేశించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 6497 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్‌పై నేతలను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

జులై 25, శుక్రవారం ( కుప్పం శ్రీమంతుడు )
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 పథకంపై.. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో.. సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు.. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. హ్యాష్ ట్యాగ్ ఐయామ్ మార్గదర్శి క్యాప్షన్‌తో.. పీ4కి సంబంధించిన లోగోని కూడా సీఎం ఆవిష్కరించారు. ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5 లక్షల 74 వేల 811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. పేదరిక నిర్మూలన ప్రయత్నంలో భాగంగా బంగారు కుటుంబాలకు సాయం అందించాలని సీఎం కోరారు.

జులై 25, శుక్రవారం ( ఏపీలో పీ4 మూమెంట్ )
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం పీ4.. ప్రజా ఉద్యమంలా సాగుతోందన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో.. జీరో పావర్టీ పీ4పై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను.. మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేద కుటుంబాల సాధికారతే.. కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా.. వాళ్లందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని సూచించారు సీఎం. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని.. ఆ ప్రాంతానికే చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాల సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 57503 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని.. పీ4 లక్ష్యం నెరవేరాలంటే.. మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

Also Read: నా భర్తను లేపేద్దాం! లవర్‌తో కలిసి.. భార్య బిగ్‌ స్కెచ్.. కట్ చేస్తే

జులై 27, ఆదివారం ( సింగపూర్‌లో బాబు )
ఐదు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ.. ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు,
ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు మహిళలు.. హారతులు పట్టారు. చిన్నారులు.. కూచిపూడి నృత్యాలతో సీఎంను స్వాగతించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా.. మొత్తం 29 కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. తొలిరోజు తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 1500 మందికి పైనే ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. పీ4 ప్రోగ్రామ్‌లో భాగస్వాములు కావాలని.. సీఎం చంద్రబాబు కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా.. భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతోనూ.. సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.

Story By Anup, Bigtv

Related News

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

Big Stories

×