BJP Master Plan: బీజేపీలో సొంత టీంల కోసం తెలంగాణ నేతలు ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఎవరికి వారు తమకు పోటీగా ఉన్నారని భావిస్తున్న నేతలకు చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారట. ఆ క్రమంలో కాషాయ పార్టీలో ముఖ్యనేతలు తలదారి అన్నట్టు వ్యవహరిస్తూ.. వారి మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుండటం గందరగోళానికి దారి తీస్తోందట. పార్టీలో సీనియర్ నేతలు తమ పట్టు పెంచుకునేందుకు మొదలపెట్టిన మైండ్ గేమ్‌లు హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు.
తెలంగాణ బీజేపీలో పట్టు పెంచుకోవడానికి నేతల మైండ్‌గేమ్
తెలంగాణ బీజేపీ నేతలు పార్టీలో పట్టు పెంచుకోవడానికి మైండ్ గేమ్ షురూ చేశారంట … సొంత పార్టీలో పోటీగా వచ్చేవారికి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారంట. వరుసగా జరుగుతున్న పరిణామాలు ఆ ప్రచారాలకు గట్టిగానే ఊతమిస్తున్నాయి. పార్టీలో తమకు కాంపిటేషన్‌గా ఫీలవుతున్న నేతల జిల్లాల్లో తమ సొంత టీమ్‌లను ఏర్పాటు చేయడంపై సదరు నాయకులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పలు మండలాలు, జిల్లాల్లో తమ వర్గీయులను రంగంలోకి దింపుతున్నారట నేతలు.
బండి సంజయ్‌ని కలిసిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
తాజాగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగిన వారి మీటింగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో అందరినీ ఆకర్షిస్తోంది. మల్లారెడ్డి బీజేపీలో చేరే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన కోడలు స్వయంగా వెళ్లి బండి సంజయ్‌తో భేటీ అయ్యారన్న చర్చ జరుగుతోంది.
బండి సంజయ్ హాజరైన విందులో ప్రత్యక్షమైన ప్రీతిరెడ్డి
తెలంగాణ కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాంచందర్ రావు ఆపరేషన్ ఆకర్స్‌కు తెరలేపారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది. పార్టీలో జాయినింగ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారంటున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అవ్వడం వెనుక మతలబేంటని చర్చించుకుంటున్నారు. బోనాల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నేత ఇంటిలో విందుకు బండి సంజయ్ వెళ్లగా, అక్కడ ఆమె సైతం ప్రత్యక్షమయ్యారు. బండితో కలిసి భోజనం చేసినట్లు తెలిసింది.
బండి సంజయ్‌తో భేటీపై క్లారిటీ ఇచ్చిన ప్రీతిరెడ్డి
బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. సీన్ కట్ చేస్తే, తాజాగా బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు భేటీ అవ్వడం ఆ ప్రచారానికి మరింత బలమిచ్చినట్లు అయిందంటున్నారు. అదలాఉండగా బండి సంజయ్, ప్రీతి రెడ్డి భేటీపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు. అయినా ఈ ప్రచారానికి బ్రేక్ పడడంలేదట. పార్టీలో సీనియర్ నేతల మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలతో తమకు కలిసోచ్చే అంశాలపై నేతల ఫోకస్ చేసినట్లు బీజేపీలో జరుగుతున్న పరిణామాల బట్టి ఆర్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. పార్టీలో బండికి, కొందరు నేతలకు ఏమాత్రం గిట్టడం లేదనే ప్రచారం ఉంది. ఆ క్రమంలో ఇన్నిరోజులు ఈటల, బండి మధ్య కొనసాగిన కోల్డ్ వార్ కాస్త ఈ మధ్య ఒక్కసారిగా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఈటలకు చెక్ పెట్టడంలో భాగంగానే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామచంద్రరావు నియామకం తర్వాత దూకుడు పెంచిన బండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించాక ఆయన సైలెంట్ అయ్యారు. ఆయన పదవి పోవడంలో ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరిగింది. అందుకే ఆయనను టార్గెట్ చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, ఎంపీగా గెలిచాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించినా కరీంనగర్, ఢిల్లీలకే బండి సంజయ్ పరిమితమయ్యారు. కానీ, కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం తర్వాత సంజయ్ కాస్త దూకుడు పెంచారు. క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తనకు పోటీగా ఉన్న అందరికీ చెక్ పెట్టాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతోందట. ఇటీవల హుజూరాబాద్‌లో ఈటలకు వ్యతిరేకంగా ఉన్నవారికి పదవులు దక్కడంలో సైతం బండి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీలో బలపడటానికి ఈటల రాజేందర్ ప్రయత్నాలు
మరోవైపు ఈటల కూడా ఏం తగ్గేదే లేదంటున్నారు. ఈ మధ్య తన అనుచరులతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాస్త అసహనం ఉన్నా, పార్టీలో క్రమంగా బలపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు, రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి ఆశించారు. ఆయన మాటకారి కావడంతో పార్టీలో ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది రుచించని ఇతర నేతలు ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే అరవింద్ సైతం పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించారు. పదవి దక్కపోవడంతో కొంత సైలైంట్‌గా ఉన్నా… పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సొంత టీమ్‌తో ఆయన పావులు కదుపుతున్నారట.
Also Read: థాయ్-కాంబో దాడుల్లో ప్రాణ నష్టమెంత?
పార్టీ పదవులు ఆశించిన నేతలను టార్గెట్ చేస్తున్నారా?
పదవులు అశించి భంగ పడ్ట నేతలకు చెక్ పెట్టేందుకు ఇతర నేతలు ప్రయత్నాలు పార్టీలో మొదలైయ్యనే చర్చ జోరుగా నడుస్తోందట. తమకు పోటీ అనుకున్న వారందరినీ ఎదగనివ్వకుండా చెక్ పెట్టాలనే యోచనలో నేతలు ఉన్నారని తెగ చర్చించుకుంటున్నారట. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇతర పదవుల్లో తమ అనుచరులు, వర్గీయులనే నియమించుకుని ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Story By Ramireddy, Bigtv