Thailand Cambodia War: థాయ్ లాండ్, కంబోడియా దేశాల మధ్య గొడవేంటి? దశాబ్దాల తరబడి వీరి మధ్య సాగుతున్న ఈ గొడవలకు కారణమేంటి? ప్రస్తుతం ఈ వివాదం ఎందుకంత తీవ్రతరం దాల్చింది. భారతీయుల కోసం జారీ అయిన అడ్వైజరీ ఎలాంటిది? అసలీ ఘర్షణ ఎలా చెలరేగింది? ఇరు దేశాల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా ఎంతటి వివాదానికి దారితీస్తాయో.. ఇప్పుడు చూద్దాం.
తీవ్రరూపం దాల్చిన థాయ్- కాంబో గొడవ
థాయ్ ల్యాండ్ కంబోడియా దేశాల మధ్య దశాబ్దాల తరబడి జరుగుతోన్న వివాదం.. కాస్తా ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చినట్టు కనిపిస్తోంది. దీంతో భారతీయుల కోసం ఒక అడ్వైజరీ జారీ అయ్యింది. ఇందులో ఏముందని చూస్తే.. భారత పౌరులు, థాయ్ ల్యాండ్ లోని ఏడు ప్రావిన్స్ ల వైపు ప్రయాణం చేయవద్దని శుక్రవారం నాడు థాయ్ ల్యాండ్ లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. అంతే కాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని కోరింది. ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని.. ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రావెన్స్‌లలో ఉద్రిక్తత నిజమే- థాయ్ తాత్కాలిక ప్రధాని
మరో వైపు థాయ్ తాత్కాలిక ప్రధాని వెచయాచై సైతం ఆయా ప్రావిన్స్ లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్నేళ్లుగా ఈరెండు దేశాల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకీ అవేంటో చూస్తే.. ప్రీహ్ విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ దేవాలయాలు. ఇవి తమవంటే తమవని రెండు దేశాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయ న్యాయ స్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పువచ్చింది. అప్పటి నుంచీ థాయ్ ల్యాండ్ అభ్యంతరాలు చెబుతూనే ఉంది.
ఆడియో క్లిప్ వైరల్ కావడంతో షినవత్ర రాజీనామా
మే నెలలో కంబోడియా సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. నాటి నుంచి ఇరు దేశాల సరిహద్దు వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్రా కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ తో రాయబారం చేయబోయారు. ఈ సమయంలో ఆమె అంకుల్ అని సంబోంధిస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ ఆర్మీ తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే అంశంపై అక్కడి కోర్టు విచారణకు ఆదేశించింది. షినవత్రాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న వెచయాచై థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జులై 23న ఒక ల్యాండ్ మైన్ పేలడంతో థాయ్ కి చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. దీంతో థాయ్ తన F16 యుద్ధ విమానాలతో కంబోడియా పై బాంబుల వర్షం కురిపించింది. ఘర్షణ మరింత తీవ్రతరమైంది. ఇరు దేశాలకు చెందిన 14 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణ కారణంగా సరిహద్దుల్లోని వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. థాయ్- కంబోడియన్ దేశాలు ప్రస్తుతం సరిహద్దులో వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య రాయబారుల ఉపసంహరణ వరకూ వచ్చింది వ్యవహారం.
టాముయోన్ థామ్ ఆలయానికి దగ్గర్లో ఘర్షణ
ఇంతకీ ఈ ఘర్షణలు ఎప్పుడు చెలరేగాయో చూస్తే.. టా ముయోన్ థామ్ ఆలయానికి దగ్గర్లో గురువారం తెల్లవారు జామున మొదలైంది. థాయ్ సైనిక స్థావరాలకు దగ్గర కంబోడియా దళాలు వైమానిక నిఘా కోసం డ్రోన్లను మొహరించాయి. దీంతో ఈ ఘర్షణ చెలరేగినట్టు చెబుతోంది థాయ్ ఆర్మీ. తమ సైనికులు చేసిన యత్నాలు విఫలమయ్యాయని.. దీంతో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు మొదలైనట్టు చెబుతున్నారు. ఆర్పీజీలతో కూడిన కంబోడియన్ యూనిట్లు రెచ్చగొట్టిన తర్వాత తమ దళాలు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపాయని అంటోంది థాయ్ ఆర్మీ. మరో వైపు థాయ్ తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది కంబోడియా. థాయ్ నాలుగో నెంబర్ హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఉమ్మడి సరిహద్దులోని అన్ని చెక్ పోస్టులు మూసి వేశారు. 86 గ్రామాల నుంచి సుమారు 40 వేల మంది థాయ్ పౌరులను ఖాళీ చేయించారు.
అసలేంటీ థాయ్ కంబోడియా గుడుల గొడవ? ఎందుకిలా జరుగుతూ వస్తోంది? ఈ దేశాల మధ్య ఘర్షణలకు ఒక హిందూ దేవాలయం కారణమా? లేక ఫ్రెంచ్ దేశం తయారు చేసిన మ్యాప్ ప్రధాన రీజన్ గా మారిందా? అసలేంటీ ఈ వివాదపు పూర్తి వివరాలు..
1962లో కంబోడియాకు ICJ అనుకూల తీర్పు
థాయ్ కంబోడియా మధ్య.. వలస రాజ్యాల యుగం నుంచీ వివాదాలున్నట్టు తెలుస్తోంది. 1962లో ఐసీజే కంబోడియాకు అనుకూల తీర్పునిచ్చింది. థాయ్ దళాలను ఉపసంహరించుకోవాలని.. ఆపై 1954 తర్వాత దోచుకున్న కళాకండాలను తిరిగివ్వాలని థాయ్ ని ఆదేశించింది ఐసీజే. ఈ తీర్పు 1907లో ఫ్రెంచ్ గీసిన మ్యాప్ ని బేస్ చేసుకుని ఇచ్చినది. ఈ ఆలయాన్ని ఫ్రెంచ్- రక్షిత కంబోడియాలో ఉంచింది. ఆనాటి థాయ్- ఈ మ్యాప్ ను అంగీకరించింది కానీ.. తర్వాతి కాలంలో అడ్డం తిరిగింది. అప్పట్లో ఒప్పుకుని తర్వాతి కాలంలో కుదరదని థాయ్ చెప్పడాన్ని అంతర్జాతీయ న్యాయ స్థానం కూడా తీవ్రంగా తప్పు పట్టింది.
ఆలయంపైనే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాలపైనా కంబోడియాకే హక్కున్నట్టు చెప్పిన ICJ
2011, 2013లోనూ ఘర్షణలు జరిగాయి. వీటి కారణంగా ఇరవై మంది వరకూ చనిపోయారు. ఈ సందర్భంగా ఐసీజే తన తీర్పును మరింత స్పష్టం చేసింది. ఆలయంపైనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా కంబోడయాకు హక్కులున్నట్టు తేల్చి చెప్పింది. అంతే కాదు ఈ ప్రాంతాల్లోని థాయ్ బలగాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య శతృత్వానికి ప్రధాన కారణం.. టా ముయెన్ థామ్ ఆలయం. డాంగ్రెక్ పర్వతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఖైమర్ హిందూ ఆలయ సముదాయంలో మూడు ప్రధాన ఆలయాలున్నాయి. అవి.. టా ముయెన్ థామ్, టా ముయెన్, టా ముయెన్ టోట్. టా ముయెన్ థామ్ ఆలయం దక్షిణం వైపు ఒక అభయారణ్యం ఉంది. ఇది తూర్పు ముఖంగా ఉన్న ఖైమర్ దేవాలయాలకు భిన్నమైనది. స్వయంభు లింగం ఈ ఆలయ గర్భగుడిలో కొలువై ఉంది. ఇదే ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో కంబోడియా సైనికులు ఈ ఆలయంలో తమ జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో థాయ్ దళాలు తీవ్ర ఆగ్రహావేశాలకు గురై ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందా సమయంలో.
1863లో కంబోడియాపై ఫ్రెంచ్ డిఫెన్స్ క్యాంప్
1863లో కంబోడియాపై ఫ్రెంచ్ డిఫెన్స్ క్యాంప్ స్థాపించింది. ఇరు దేశాల సరిహద్దుల విషయంలో ఫ్రాన్స్ థాయ్ మధ్య 1904 నుంచి 1907 మధ్య వరకూ అనేక ఒప్పందాలు సంతకాలు జరిగాయి. ఫ్రెంచ్ సర్వేయర్లు.. వాటర్ షైడ్ లైన్ల ఆధారంగా మ్యాప్ లను రూపొందించారు. కానీ ప్రీహ్ విహార్ వంటి సాంస్కృతిక కేంద్రాల విషయంలో మినహాయింపునిచ్చారు. ఈ పాశ్చాత్య సరిహద్దులే ప్రాంతీయ ఘర్షణలకు కారణమయ్యాయని అంటారు ఆగ్నేయాసియా చరిత్ర కారులు. యురోపియన్ కార్టోగ్రఫీ ఆధారంగా ఫ్రెంచ్ తయారు చేసిన మ్యాప్ లు కంబోడియాకు ఒక ప్రత్యేక జియో బాడీనిచ్చినట్టు భావిస్తారు. దీని ద్వారా చూస్తే వివాదాస్పద ప్రీహ్ విహార్ ఈ సరిహద్దుల్లో ఉంది. అయితే థాయ్ ఈ వ్యవహారంలో తరచూ ఏదో ఒక గొడవ చేస్తూనే వస్తోంది. 2008లో ప్రీహ్ విహార్ అనే ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగం చేసింది. ఈ విషయంలో కంబోడియా విజయం సాధించింది. ఈ విషయంలోనే థాయ్ తిరిగి తన వ్యతిరేకతను వ్యక్త పరిచింది. ఈ విషయంలో ఫెయిల్ యిన నాటి థాయ్ విదేశాంగ మంత్రి నొప్పడాన్ పట్టమా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సంవత్సరం ఆలయం సమీపంలో ఘర్షణలు చెలరేగి ఇరువైపులా సైనికులు మరణించారు.
ఒక హిందూ ఆలయం కోసం రెండు బౌద్ధ దేశాలు యుద్ధం
చేసుకోవడం ఇక్కడ కీలకంగా మారింది. ప్రీహ్ విహార్ ఒక హిందూ ఆలయం. 11వ శతాబ్దిలో ఖైమర్ సామ్రాజ్య హయాంలో నిర్మించిన ఈ అద్భుతమైన హిందూ ఆలయం.. డాంగ్రెక్ పర్వత శ్రేణులపై.. 525 మీటర్ల ఎత్తైన శిఖరంపై వెలసింది. ఈ ఆలయం ఖైమర్ ఆర్కిటెక్చర్ శైలిలో ఉంటుంది. హిందూ పురాణాల్లోని మేరు పర్వతం ద్వారా.. క్షీర సాగర మథన దృశ్యాలను సూచిస్తుంది ఇక్కడి శిల్ప కళా చాతుర్యం. ఈ ఆలయం విషయంలో ఇప్పటి వరకూ జరిగిన కీలక ఘట్టాల విషయానికి వస్తే.. 1941- రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో థాయ్‌లాండ్ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. 1954లో కంబోడియా స్వాతంత్య్రం తర్వాత కూడా థాయ్‌లాండ్ ఈ ఆలయాం తమదేనని వాదించింది. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్..
2013లో ICJ ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన భూభాగం
ఈ ఆలయం కంబోడియాకు చెందినదని తీర్పు ఇచ్చింది. 2008–2011 మధ్య యునెస్కో గుర్తింపు తర్వాత, ఆలయం చుట్టూ 4.6 చదరపు కిలోమీటర్ల సరిహద్దు భూమిపై వివాదం తీవ్రమై, సైనిక ఘర్షణలకు దారితీసింది. ఈ సమయంలో మొత్తం 28 మంది మరణించారు. 2013లో ICJ ఆలయం చుట్టూ ఉన్న ప్రధాన భూభాగం కంబోడియాకు చెందినదని తిరిగి స్పష్టం చేసింది. అంతే కాదు థాయ్‌లాండ్‌ను సైనిక ఉపసంహరణకు ఆదేశించింది. ఈ హిందూ ఆలయం ఖైమర్ వారసత్వ సంపదగా కంబోడియా భావిస్తే.. థాయ్ తమ జాతి వారసత్వ సంపదగా పరిగణిస్తుంది. రెండు దేశాల్లోనూ ఇదొక పర్యాటక ప్రధాన ఆకర్షణ. ఇపుడీ ఆధ్యాత్మిక చారిత్రక ఆలయ ఆకర్షణ కోసం.. ఇరు దేశాలు ఎన్నో సార్లు సంఘర్షించాయి. వీటి కారణంగా ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణించడం గమనార్హం. మరి ఈ సంఘర్షనలు ఆగే దారేదన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
Story By Adinarayana, Bigtv