China Vs India: భారత సరిహద్దుల్లో డ్రాగన్ కాపుకాస్తోంది. బోర్డర్ వెంబడి ఆర్మీ కౌంటీలు ఏర్పాటు చేస్తోంది. దాంతో.. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చనే టెన్షన్ నెలకొంది. ఎందుకంటే చైనాని అంత ఈజీగా నమ్మలేం! పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యలకు కౌంటర్‌గా.. తూర్పు లద్దాఖ్‌లో స్పెషల్ ఫోర్స్‌ని దించుతోంది ఇండియన్ ఆర్మీ. అసలు.. ఆ దళమేంటి? ఆ ఫోర్స్ గ్రౌండ్‌లోకి దిగితే.. ఎలా ఉంటుంది?
3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు
832 కి.మీ.ల వెంబడి టెన్షన్ టెన్షన్!
ఎల్ఏసీ దగ్గర అసలు పరిస్థితేంటి?
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్.. భారత్, చైనా మధ్య ఉన్న సుదీర్ఘమైన సరిహద్దు. ఇప్పుడు దీని మీదే.. ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెంచింది. సరిహద్దుల్లో కాచుకు కూర్చున్న.. చైనా ఆర్మీకి చెక్ పెట్టేలా.. సరికొత్త వ్యూహాన్ని రచించింది. లద్దాఖ్ కోసం ప్రత్యేకంగా ఓ ఆర్మీ డివిజన్‌ని ఏర్పాటు చేసింది. చైనాతో భారత్‌కు ఉన్న వేల కిలోమీటర్ల సరిహద్దులో.. 832 కిలోమీటర్ల వెంబడి సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయ్. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం.
లద్దాఖ్ కోసమే శాశ్వతంగా ఆర్మీ డివిజన్ ఏర్పాటు
అందువల్ల.. భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అంతేకాదు.. వ్యూహాత్మకంగానూ మన సైన్యం సిద్ధంగా ఉండాలి. అందుకోసమే.. ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్ కోసమే శాశ్వతంగా ఓ ఆర్మీ డివిజన్‌ని ఏర్పాటు చేస్తోంది. ఇది మొత్తం.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కి బాధ్యత వహించే.. త్రీ డివిజన్‌కి అదనంగా ఉంటుంది. వందల కిలోమీటర్ల బోర్డర్ వెంబడి.. రక్షణ కవచంలా నిలబడుతుంది.
కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక దళం 72 డివిజన్
లద్దాఖ్ సరిహద్దు వెంబడి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయడాన్ని.. బిగ్ రీ-ఆర్బాట్ మూవ్‌గా చెబుతున్నారు. సాధారణంగా ఆర్బాట్ అంటే.. ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ అని అర్థం. అదే.. రీ-ఆర్బాట్ అంటే ఇప్పటికే ఉన్న దళాల్ని రీ-ఆర్గనైజ్ చేయడం, తిరిగి మోహరించడంగా చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక దళాన్ని.. 72 డివిజన్‌గా పిలవనున్నారు. సాధారణంగా మన ఆర్మీలో.. ఒక డివిజన్‌లో 10 వేల నుంచి 15 వేల మంది సైన్యం ఉంటుంది. దీనికి అదనంగా 8 వేల సపోర్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనంతటికీ.. మేజర్ జనరల్ నాయకత్వం వహిస్తారు.
తూర్పు లద్దాఖ్‌లో ఇప్పటికే బ్రిగేడ్ కార్యాలయం
అదేవిధంగా 3 నుంచి 4 బ్రిగేడ్‌లు ఉంటాయి. ఒక బ్రిగేడ్‌లో 3500 నుంచి 4 వేల సైన్యం ఉంటుంది. వీటికి.. బ్రిగేడియర్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం.. 72 డివిజన్ ఫోర్స్‌కి సంబంధించిన హెడ్ క్వార్టర్ సైజుని కూడా పెంచుతున్నారు. ఇప్పటికే.. తూర్పు లద్దాఖ్‌లో ఓ బ్రిగేడ్ కార్యాలయం పనిచేస్తోంది. సిబ్బందితో పాటు పరికరాలను కూడా సమకూరుస్తున్నారు. ఒక ఆర్మీ డివిజన్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన అన్ని వసతుల్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే.. ఇతర ప్రాంతాల్లో ఆర్మీ డివిజన్‌కి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.
14 ఫైర్ అండ్ ఫ్యూరీ కార్స్స్ కింద 72 డివిజన్
కొత్తగా ఏర్పాటు చేయబోయే 72 డివిజన్ ఫోర్స్‌ని.. శాశ్వతంగా లేహ్‌లోని 14 ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కింద ఉంచుతారు. దీనిని.. కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో స్థాపించారు. ప్రపంచంలోని అత్యంత సున్నితమైన సరిహద్దులు, యుద్ధ భూముల్లో.. ఈ కార్ప్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇకపై 72 డివిజన్ నియంత్రణలో ఉండే ఈ ప్రాంతాన్ని.. ప్రస్తుతం యూనిఫాం ఫోర్స్ అని పిలిచే.. కౌంటర్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటోంది. ఇందులో తక్కువ సంఖ్యలో దళాలున్నాయి. అందులోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
ఇక తూర్పు లద్దాఖ్ పైనే ఆర్మీ 72 డివిజన్ ఫోకస్
యూనిఫాం ఫోర్స్ త్వరలోనే.. జమ్మూ డివిజన్‌లోని రియాసికి తిరిగి వెళ్లిపోతుంది. ఇక నుంచి 832 కిలోమీటర్ల సున్నితమైన లద్దాఖ్ బోర్డర్ అంతా.. 72 డివిజన్ ఫోర్స్ నియంత్రణలోకి వచ్చేస్తుంది. అంతేకాదు.. జమ్మూ నుంచి కూడా అదనపు బలగాలను లద్దాఖ్‌కు తరలిస్తున్నారు. ఇకపై.. ఆర్మీ 72 డివిజన్.. పూర్తిగా తూర్పు లద్దాఖ్ పైనే ఫోకస్ పెడుతుంది.
2020 మే నెలలో ఫింగర్-4 దగ్గర ప్రతిష్టంభన
2020 మే నెలలో.. పాంగోంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్-4 దగ్గర.. చైనా, భారత దళాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత జూన్‌లో.. గల్వాన్ లోయలో ఘోరమైన ఘర్షణ జరిగింది. అనేక రౌండ్ల చర్చల తర్వాత.. గతేడాది అక్టోబర్‌లో.. లద్దాఖ్‌లోని దెప్సాంగ్, దెమ్‌చోక్ ప్రాంతాల్లో.. భారత్, చైనా దళాలు తమ బలగాలని ఉపసంహరించుకున్నాయి. ఆ తర్వాత.. మళ్లీ పెట్రోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు.. వాస్తవాధీన రేఖకు రెండు వైపులా భారత్, చైనా దళాలు.. సమీపంలోనే ఉన్నాయి. కొన్నాళ్లుగా.. లద్దాఖ్‌కు దగ్గరలో చైనా కౌంటీలు ఏర్పాటు చేస్తూ వస్తోంది. సైనిక గ్రామాలను కూడా నిర్మిస్తోంది. అందుకు తగ్గట్లుగానే.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఎల్ఏసీ వెంబడి.. ప్రత్యేక బలగాలను మోహరించాలని నిర్ణయించారు.
లద్దాఖ్ వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖపై సీరియస్ ఫోకస్
ఆర్మీలోని 72 డివిజన్‌కి కీలక బాధ్యతల్ని అప్పజెప్పారు. లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు చెక్ పెట్టేందుకు దాదాపు 30 వేల సైన్యాన్ని అదనంగా తరలించబోతున్నారు. గల్వాన్ ఘర్షణ తర్వాత.. చైనా విషయంలో భారత్ అలర్ట్‌గా ఉంది. ఓ వైపు సరిహద్దు వివాదంపై చర్చలు జరుపుతూనే.. లద్దాఖ్‌లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెంచింది. నిజానికి.. ఆర్మీ 72 డివిజన్‌ని పాకిస్థాన్‌ని టార్గెట్ చేసేందుకు రెడీ చేశారు. కానీ.. ఇప్పుడు పాక్ కంటే చైనా నుంచే ముప్పు ఎక్కువగా పొంచి ఉంది. దాంతో.. లద్దాఖ్ వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖపై ఫోకస్ పెంచారు. 832 కిలోమీటర్ల మేర ఉన్న సున్నితమైన సరిహద్దుని.. ఈ ఆర్మీ 72 డివిజన్ కంటికి రెప్పలా కాపాడుతుంది.
సరిహద్దులకు అవతల చైనా సైన్యం ఏం చేస్తోంది
కేవలం.. లద్దాఖ్ సరిహద్దుల కోసం ప్రత్యేకంగా 72 ఆర్మీ డివిజన్‌ని ఏర్పాటు చేయడం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లద్దాఖ్ ప్రాంతం.. భారత్‌కు ఎందుకంత ముఖ్యమనే చర్చ కూడా మొదలైంది. అసలు.. ఇండియన్ ఆర్మీ.. లద్దాఖ్ సరిహద్దులపై ఇంతలా ఫోకస్ పెట్టడానికి కారణమేంటి? చైనాతో.. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? సరిహద్దులకు అవతల చైనా సైన్యం ఏం చేస్తోంది?
వ్యూహాత్మకంగా, భద్రతపరంగా లద్దాఖ్ ఎంతో ముఖ్యం
లద్దాఖ్ సరిహద్దులు భారత్‌కు భౌగోళికంగానే కాదు.. వ్యూహాత్మకంగానూ, జాతీయ భద్రతపరంగానూ ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యంగా.. చైనాతో సరిహద్దు వివాదాలతో.. ఈ ప్రాంతం ఇండియాకు మరింత కీలకంగా మారింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన లద్దాఖ్.. చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతం భారత్‌కు ఒక బఫర్ జోన్‌లా పనిచేస్తుంది. ఇది.. శత్రుదేశాల నుంచి భౌగోళికంగా రక్షణ కల్పిస్తుంది. ఆక్సాయ్‌చిన్ లాంటి ప్రాంతాలు చైనా నియంత్రణలో ఉన్నప్పటికీ.. అవి ఎప్పటికీ భారత్‌లోని భూభాగాలే. ఇవి.. రక్షణ వ్యూహంలో అత్యంత కీలకం. ఎందుకంటే.. లద్దాఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంట ఉంది. ఇది.. భారత్ – చైనా మధ్య వివాదాస్పద సరిహద్దు.
లద్దాక్ సరిహద్దుల్లో సైనిక బలాన్ని పెంచుతున్న భారత్
ఈ ప్రాంతంలో.. చైనా సైనిక మోహరింపులు, మౌలిక సదుపాయాల నిర్మాణం లాంటివన్నీ.. భారత్‌కు భద్రతాపరంగా సవాళ్లను సృష్టిస్తాయ్. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ.. ఈ ప్రాంతం ఎంత సున్నితమైందనేది తెలియజేసింది. లద్దాఖ్ ద్వారానే.. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉంటుంది. డార్జిలింగ్-లేహ్ హైవే లాంటి మార్గాలు.. సైనిక రవాణాకు భారత్‌కు కీలకంగా ఉన్నాయి. అందువల్ల.. లద్దాఖ్ సరిహద్దులకు దగ్గర్లోనే.. చైనా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తూ.. తన పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకే.. భారత్ కూడా మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేస్తోంది. మరోవైపు నుంచి లద్దాఖ్ సరిహద్దుల్లో సైనిక బలాన్ని కూడా పెంచుతూ వస్తోంది.
కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం అరుణాచల్
జమ్మూకశ్మీర్‌తో మొదలుపెడితే.. హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు.. భారత్ – చైనా సరిహద్దు కొనసాగుతుంది. దీనిని మూడు భాగాలుగా విభజించారు. పశ్చిమ సెక్టార్‌లో జమ్ముకశ్మీర్ ఉంటుంది. మిడిల్ సెక్టార్‌లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఇక.. మూడోది ఈస్ట్ సెక్టార్. ఇందులో.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉంటాయి. అయితే.. ఇప్పటికీ భారత్, చైనా మధ్య స్పష్టమైన సరిహద్దులు లేవు. ఈ అస్పష్టతే.. చాలా ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలకు దారితీస్తోంది. భారత సరిహద్దుల్లోని పశ్చిమ సెక్టార్‌లో ఉన్న ఆక్సాయ్‌చిన్‌ని.. 1962 యుద్ధ సమయంలో చైనా తన నియంత్రణలోకి తీసుకుంది. తూర్పు సెక్టార్‌లో.. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. అదంతా.. దక్షిణి టిబెట్‌లో భాగమని చెబుతోంది.
వాస్తవాధీన రేఖ యధాతథ స్థితిని మారుస్తున్న చైనా
అందువల్ల.. భారత్, చైనా సరిహద్దులకు సంబంధించి.. స్పష్టమైన నిర్వచనాలేమీ లేవు. భారత్ తన సరిహద్దు 3 వేల 488 కిలోమీటర్లని చెబుతుంటే.. చైనా మాత్రం 2 వేల కిలోమీటర్లే అంటోంది. అందువల్ల.. బోర్డర్ విషయంలో రెండు దేశాలకు సొంత వాదనలున్నాయ్. ఇటు భారత్, అటు చైనా దేనినీ వదులుకునేందుకు సిద్ధంగా లేవు. సరిహద్దు ఒప్పందాల విషయంలో.. బ్రిటీష్ ఇండియా, టిబెట్ మధ్య ఒప్పందాలు జరిగాయి గానీ.. భారత్, చైనా మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. అందువల్ల.. లద్దాఖ్ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా.. చైనా 1960 నాటి క్లెయిమ్ లైన్ గురించి మాట్లాడుతోంది. అదే.. రెండు దేశాల మధ్య సరిహద్దు అని, వాస్తవాధీన రేఖ కాదని వాదిస్తోంది. బోర్డర్ విషయంలో రెండు దేశాల వైఖరి భిన్నంగా ఉండటంతో.. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతమంతా సున్నితంగా మారిపోయింది.
డ్రాగన్ కు ధీటుగా బలగాలను మోహరిస్తున్న భారత్
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో పరస్పర నమ్మకాన్ని చైనా ఉల్లంఘిస్తూ.. యధాతథ స్థితిని మారుస్తోంది. అందుకే.. అప్పుడప్పుడు సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొంటోంది. ఇప్పుడు.. సరిహద్దుకు అవతల చైనా తన సైన్యాన్ని మోహరిస్తోంది. దాంతో.. భారత్ కూడా డ్రాగన్‌కు దీటుగా బలగాలను మోహరిస్తోంది. లద్దాఖ్ ప్రాంతంలో చైనా వైపు నుంచి కదలికలు తగ్గితేనే.. భారత్ కూడా తీవ్రతని తగ్గిస్తుంది. లేకపోతే.. చైనాకు ఎలా సమాధానం చెప్పాలో ఇండియాకు బాగా తెలుసు.
లద్దాఖ్ లో 50 వేల మందికి పైగా భారత్ సైనికుల మోహరింపు
ఈ క్రమంలోనే.. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసుకునే విషయంలో.. భారత్, చైనా మధ్య కొన్నేళ్లుగా రేస్ నడుస్తోంది. గల్వాన్ ఘర్షణ తర్వాత.. ఇది మరింత ఎక్కువైంది. చైనా.. కొత్త గ్రామాల్ని నిర్మిస్తుంటే.. భారత్ కూడా సరిహద్దు సమీప ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తోంది. దాంతో పాటు సరిహద్దుల్లో సైనిక మోహరింపుని కూడా పెంచింది. ఇప్పటికే.. లద్దాఖ్‌లో నెలకొన్న వివాదంతో.. ఆ ప్రాంతంలో 50 వేల మందికి పైగా సైనికులను మోహరించినట్లు అంచనాలున్నాయి.
వనరుల నియంత్రణ చైనా చేతిలోకి వెళితే భారత్‌కు నష్టం
ఇక.. లద్దాఖ్‌లోని ఎత్తైన పీఠభూములు, సియాచిన్ లాంటి గ్లేసియర్లు.. నీటి వనరులకు మూలంగా ఉన్నాయ్. ఇవి ఉత్తరాది రాష్ట్రాలకు నీటి సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తాయ్. ఈ వనరుల నియంత్రణ గనక చైనా చేతిలోకి వెళితే.. భారత్‌కు దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది. అందుకోసమే.. చైనా ఇక్కడ తన ఆధిపత్యాన్ని విస్తరించి.. భారత్‌పై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. అందుకే.. భారత్ ఈ సరిహద్దుని కాపాడుకునే విషయంలో ఇంత సీరియస్‌గా ఉంది. ఇదే.. భారత సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ స్థాయిలో ఇండియా బలాన్ని చాటుతోంది. అందువల్ల.. లద్దాఖ్ సరిహద్దులు భారత్‌కు కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు. దేశ రక్షణ, ఆర్థిక స్థిరత్వం, రాజకీయ ప్రతిష్ఠకు ప్రతీక. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు.. ఈ ప్రాంతాన్ని మరింత కీలకంగా మారుస్తున్నాయ్. అందువల్ల.. లద్దాఖ్ సరిహద్దుల్ని కాపాడుకోవడం భారత్‌కు ఎంతో ముఖ్యం.