Chintakayala Vijay: ఏపీలో ఆ రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఏపీలో ఉన్న మూడు రాజ్యసభ సీట్లులో ఒకటి తనకు కేటాయించాలని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్న నాయకుడు కొడుకు గట్టిగా కోరుతున్నారంట. రాజ్యసభ సీట్ ఆశిస్తున్న ఆ వ్యక్తి వయసులో చిన్నోడే.. మాటల్లో మాత్రం మహా ఘనుడు. కొన్నేళ్లుగా పార్టీ అధిష్టానం నుంచి పిట్ట కొంచెం కూత ఘనం అనే పేరు సంపాదించుకున్నాడు. గత ఎన్నికల్లో ఎంపీ సీటు ని త్యాగం చేసి తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీ గెలుపులో కీలకమయ్యాడు. పార్టీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు కూడా ఉన్న ఆ యువ నాయకుడికి రాజ్యసభ సీటు వస్తుందా? ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరు?
రాజకీయాల్లో ఎంత దూకుడుగా ఉంటే అంత మనుగడ ఉంటుంది. వాగ్గాటితో పాటు సబ్జెక్ట్ ఉన్న వారికి పాలిటిక్స్‌లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలా తన వాక్ చాతుర్యంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో ఉద్దండులను సైతం మెప్పించిన యువ నాయకుడు చింతకాయల విజయ్.. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఏడుసార్లు గెలుపొంది , అనకాపల్లి ఎంపీగా ఒకసారి గెలిచి, మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడైన చింతకాయల విజయ్ ఇప్పుడు పెద్దల సభ రేసులో ముందంజలో ఉన్నాడు. ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును చింతకాయల విజయ్ ఆశిస్తున్నారంట.
గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చింతకాయల విజయ్ ఆశించారు. అయ్యన్నపాత్రుడు సైతం తన కొడుక్కి ఎంపీ సీటు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజెపికి వెళ్లడంతో కొంత నిరాశకు చెందిన చింతకాయల విజయ్ తర్వాత తన తండ్రి గెలుపులో కీలక పాత్ర వహించారు.
తన తండ్రి సీటు వరకే పరిమితం కాకుండా వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తనదైన శైలిలో ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తన తండ్రిని అరెస్టు చేయాలనే ఆలోచన చేసినప్పుడు కానీ, ఇంటిని కూల్చాలనే ప్రయత్నం చేసినప్పుడు కానీ చింతకాయల విజయ్ అన్ని తానే వ్యవహరించి అటు కుటుంబంలో, ఇటు పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం మాత్రం మానలేదు.
Also Read: నాదెళ్ల సీజ్ చేసిన బియ్యం పోర్ట్‌కి ఎలా వచ్చాయి..? కాకినాడా మాఫియాకు లీడర్ అతనే..!
చింతకాయల విజయ్ అయ్యన్నపాత్రుడు కొడుకుగానే కాకుండా తనకు తాను తన సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే క్రమంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న చింతకాయల విజయ్ తనను రాజ్యసభకు పంపాలనే మనసులోని కోరికను లోకేష్ దగ్గర బయటపెట్టినట్లు తెలుస్తుంది. 2019 నుంచి 24 మధ్యకాలంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ, టిడిపిపై పెడుతున్న కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరించిన విజయ్.. లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా మారాడంటారు.
దానికి తోడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు వస్తుందని భావించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న చింతకాయల విజయ్ కి సీటు దక్కలేదు. బీజేపీ కోసం సీటు త్యాగం చేసిన విజయ్‌కు ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే టిడిపి తొలితరం నాయకుల్లో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా, మాజీ కేంద్రమంత్రి ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆనాటి నుండి నేటి వరకు టిడిపిలోనే కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు కుమారుడిగా విజయ్‌ని రాజ్యసభకు పంపడానికి టీడీపీ పెద్దలు సుముఖంగానే ఉన్నారంటున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ సీట్లపై టిడిపి తో పాటు జనసేన పార్టీ కూడా కన్నేసింది. మూడు సీట్లలో ఒక సీటు జనసేనకు కేటాయిస్తే మిగిలిన రెండు రాజ్యసభ సీట్లలో చంద్రబాబు తనకు కావలసిన వాళ్లకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో విజయ్ పేరు ఫోకస్ అవుతుంది. తన కోసం లోక్‌సభ ఎంపీ సీటు వదులుకున్న విజయ్‌కి రాజ్యసభ సభ్యత్వం కోసం అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా సిఫార్సు చేస్తున్నారంట. ఏపీలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి కేటాయించి, మరో సీటు జనసేన కోటాలో వెళ్లిపోయినా ప్రభుత్వంలో మూడో పార్టీగా ఉన్న బిజెపి తనకు కావలసిన వాళ్లకు సీటు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం జరుగుతుంది.
అందులో భాగంగానే చింతకాయల విజయ్ ని రాజ్యసభకు పంపించవచ్చు అనే ఊహాగానాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో చెక్కర్లు కొడుతున్నాయి. తన తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కావడం, చంద్రబాబుకి సన్నిహితమైన వ్యక్తి కావడం, నారా లోకేష్ ఆశీస్సులు విజయ్‌కి ఉండడం, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయ్ కి సహకరించడం .. ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే చింతకాయల విజయ్ త్వరలో రాజ్యసభలో అడుగు పెడతారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి … మరి చింతకాయల వారి వారసుడి అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి.