Rambhadracharya Priyanka Gandhi| ఉత్తర భారతదేశంలో భారీ జనాదరణ కలిగిన హిందూ మతగురువు స్వామి రామభద్రాచార్య కాంగ్రెస్ పార్టీపై ఇటీవల తీవ్రంగా విమర్శలు చేశారు. వయనాడ్ లో ప్రియాంక గాంధీ విజయం సాధిస్తే.. ఆ సంబరాల్లో ఒక ఆవుని తుపాకీతో కాల్చి చంపారని.. కాంగ్రెస్ పాలనలో హింస చెలరేగుతుందనేందుకు ఇదే ఉదాహరణ చెప్పారు. శుక్రవారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలో యువసాధువు సంత్ ధీరేంద్ర శాస్త్రి అలియాస్ బాగేశ్వర్ ధామ్ బాబా నిర్వహించిన సనాతన హిందూ ఏక్తా పదయాత్ర ముగింపు వేడుకల్లో స్వామి రామభద్రాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు.
“కాంగ్రెస్ పంజా (మృగంతో పోలుస్తూ)కు రక్తం అంటుకుంది. ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు ఆవు లాంటి ఒక అమాయక జీవిని కాల్చి చంపారు. అహింస గురించి మాట్లాడే వారి (కాంగ్రెస్) పాలనలో ఇదే జరుగుతుంది. ప్రియాంక గాంధీ మీడియా ఇంచార్జ్ స్వహస్తాలతో పేలిన తుపాకీతో ఆవు చనిపోయింది. ఆమె ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుంటాయి. ఆవుగాని, హిందూ ధర్మం కానీ ఆమె పాలనలో మనుగడ సాధించలేవు. కానీ వారు (కాంగ్రెస్ పార్టీని) విజయం సాధించడానికి వీల్లేదు. మేము అలా జరగనివ్వం. మేము ఎవ్వరికి హాని తలపెట్టం. కానీ మాకు హాని తలపెట్టాలని చూస్తే.. ఎవరినీ వదిలిపెట్టం.” అని ఆయన అన్నారు.
ఆ తరువాత స్వామి రామభద్రచార్య హిందూ ఐక్యత, రాజకీయాలు, మత గుర్తింపు గురించి కొన్ని సూచనలు చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువులందరూ ఏకం కావాలని అన్నారు. “విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదు. సమాజంలో హిందువులు ఐకమత్యంగా ఉండాలి ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతి అనే నినాదం ఉపయోగపడదు.. ఇప్పుడంతా ఓం క్రాంతి క్రాంతి క్రాంతి అనే కొత్త నినాదం కావాలి.” అని స్వామిజీ చెప్పారు.
Also Read: దేశముదుర్లు.. 5 స్టార్ హోటళ్లలో పట్టపగలు దోపిడి.. టికెట్ లేకుండా విమాన ప్రయాణం
నవంబర్ 21 బాగేశ్వర్ ధామ్ నుంచి ప్రారంభమైన ఈ హిందూ ఏక్తా పదయాత్ర నవంబర్ 29న ఆర్చా ధామ్ వరకు చేరింది.ఈ పదయాత్ర ముగింపు వేడుకల్లో వేల సంఖ్యలో హిందూ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. 160 కిలోమీటర్లు సాగిన ఈ పదయాత్రలో మహిళలు, పిల్లలు కూడా పాల్గొనడం విశేషం. దేశంలోని ప్రముఖ హిందూ పూజారులు, మత గురువులు కూడా ఈ వేడుకలకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు సంజయ్ దత్, నటుడు, గాయకుడు ఎంపీ మనోజ్ తివారి లాంటి బాలీవుడ్ సినీప్రముఖలు కూడా ఉండడం గమనార్హం.
ఆవుని కాల్చి చంపారని స్వామి రామభద్రాచార్య చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపలేదు. పైగా ఇండియా టుడే మీడియా ఈ అంశంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే రామభద్రాచార్య చెప్పినట్లు ఒక ఆవుని తుపాకీ ఒక యువకుడు కాలుస్తున్నట్లు ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఆరునెలల క్రితం మణిపూర్ లో జరిగిన ఘటనకు సంబంధించనదని తేలింది.