Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లండన్ పర్యటన పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్లిన చిరంజీవికి ఆ ఆనందం మిగలకుండా పోయిందంట. అవార్డు వచ్చిందనే సంతోషం కాస్తా విమర్శలు ఎదుర్కొంటూ .. ఎపిసోడ్ అంతా వివాదాస్పదంగా మారడం హాట్‌టాపిక్‌గా మారింది. అందేంటి అవార్డు తీసుకోవడానికి వెళ్లిన లండన్ టూర్ అంత పెద్ద చర్చకు దారితీయడమేంటి అనుకుంటున్నారా..? వాచ్ దిస్ స్టోరీ.
పద్మవిభూషణ్ చిరంజీవికి లండన్‌లో అవార్డు ప్రదానం
పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన కార్యక్రమంలో బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేసింది. చిరంజీవికి అవార్డు ప్రకటన నుంచి ప్రదానం వరకూ జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. చిరంజీవికి లండన్ ప్రభుత్వం భారత్ ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్ కంటే పెద్ద అవార్డు ప్రకటించేసిందని అభిమానులు, ఫాలో వర్స్ సోషల్ మీడియాలో తెగ పబ్లిసిటీ చేశారు.
బ్రిటన్ ప్రభుత్వమే మెగాస్టార్‌ను గౌరవిస్తోందని హడావుడి
బ్రిటన్ ప్రభుత్వమే మెగాస్టార్ ను పిలిచి, గౌరవిస్తోందని, సన్మానం చేస్తోందని హడావుడి చేసేసారు. పిలిచింది,సన్మానం చేసింది ఓ ప్రయివేటు ట్రస్ట్. ఇండియా నుంచి వెళ్లి లండన్ లో సెటిల్ అయిన కొందరు పారిశ్రామిక వేత్తలు కలిసి ప్రారంభించినది. ఆ సంస్థకు ఒక పేరెంటేల్ కంపెనీ కూడా వుంది. అది ఓ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ అంట. అక్కడ సంస్థలు ప్రభుత్వానికి అప్లయ్ చేస్తే, నిర్ణీత నిబంధనలు పాటిస్తే, నిర్ణీత ఫీజ్ చెల్లిస్తే పార్లమెంట్ లేదా కౌన్సిల్ హాలులో ఫంక్షన్ చేసుకోవడానికి అనుమతిస్తారంట.
ప్రచారంపై వివరణ ఇచ్చుకున్న చిరంజీవి
తొలుత చిరంజీవికి బ్రిటిష్ ప్రభుత్వం అవార్డు ఇచ్చినట్లు కథనాలను బయటకు వదిలారు.. చాలా మంది యూకే ప్రభుత్వమే అవార్డు ఇచ్చినందుకు శుభాకాంక్షలు, ప్రశంసలు తెలిపారు. తీరా చిరంజీవికి అవార్డు ప్రకటించింది బ్రిడ్జ్ ఇండియా అనే ప్రైవేట్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డని తెలుసుకుని అందరూ అవాక్కవ్వాల్సి వచ్చింది. దాంతో అవార్డు విషయంలో జరుగుతున్న ప్రచారంపై కూడా చిరంజీవి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కాదని, బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ నుంచి వచ్చినదని ప్రకటన చేయాల్సి వచ్చింది.
అవార్డు ఫంక్షన్ చూసి నిరాశ చెందిన మెగా ఫ్యాన్స్
అవార్డు వచ్చింది కదా అని చిరంజీవి లండన్ పర్యటనకు వెళ్లారు. ఎంతో సంతోషంగా అవార్డు తీసుకునేందుకు యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి అవార్డు ప్రధాన కార్యక్రమంలో అంటే ఓ రెంజ్‌లో ఉంటుందని అందరూ భావించారు. పార్లమెంట్‌లో జరిగింది కాబట్టి బ్రిటన్ రాజు వస్తారేమో, బ్రిటన్ ప్రధాని హాజరవుతారమో అనే విధంగా ప్రచారం జరిగింది. తీరా అవార్డు ప్రధానోత్సవం చూసి అభిమానులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారట.
అవార్డు ప్రామాణికత, విలువపై చర్చలు
మెగాస్టార్ రెంజ్‌కి తగ్గట్లు అతిథులు ఎవరూ లేకపోవడం.. అవార్డు ప్రధానోత్సవం మొత్తం తెలుగు వాళ్లే ఉండడం అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. ఈ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కాకుండా ఒక ప్రైవేటు సంస్థ నుంచి వచ్చినదని తెలిసిన తర్వాత.. అవార్డు ప్రామాణికత, విలువపై అనేక మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. మెగా ఫ్యాన్ సోషల్ మీడియాలో హడావుడి రేంజ్లో ఆ అవార్డుకు ప్రాధాన్యత ఉందా అన్న చర్చ జరుగుతోంది.
150 మంది పట్టే హాలులో అవార్డు ప్రధానం
మెగాస్టార్ కు సన్మానం చేసిన హాలు కూడాచాలా చిన్నది. వంద నుంచి నూట యాభై మంది మాత్రమే పడతారు. పైగా ఈ సన్మానం కార్యక్రమానికి ఆహ్వానం అందుకోవడం కోసం కొంత డొనేషన్ కూడా తీసుకున్నారంట. అవార్డు ప్రధానోత్సవమే సాదాసీదాగా జరిగితే…తర్వాత జరిగిన పరిణామాలు మరింత రచ్చకు దారితీశాయి. చిరంజీవితో మీటింగ్ కోసం ఒక రేటు, ఆయనతో ఫోటో దిగడానికి మరొక రేటు, సన్మానం కోసం వేరే రేటు కట్టి వసులూ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
డబ్బు వసూలుపై విచారం వ్యక్తం చేసిన మెగాస్టార్
చిరంజీవిని కలవడానికి, ఫోటో తీసుకోవడానికి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో చిరంజీవి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. తనను కలవడానికి కానీ, ఫోటో కోసం కానీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదని.. ఎవరైన డబ్బులు వసూలు చేసిన ఉంటే డబ్బును వాపసు ఇవ్వాలని ట్వీట్ చేశారు . కొంత మంది అర్గనేజర్స్ చేసిన వివాదానికి చిరంజీవే వివరణ ఇచ్చుకోవడం ఆయన స్థాయిని తగ్గించిందన్నది క్రిటిక్స్ మాట.